2024 ఎన్నికల ముఖచిత్రం
జాతీయ రాజకీయాల్లో కదలికలు మొదలయినట్టే..2024 ఎన్నికలకు రిహార్సల్స్ ఆరంభమయ్యాయి..
పాములు ఒక్కటొక్కటిగా పుట్టలోంచి బయటికి వస్తున్నాయి..ఒకచోట చేరే ప్రయత్నాలు చేస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఒక మహాశక్తిలా విజృంభించిన భారతీయ జనతా పార్టీని మూకుమ్మడిగా ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో కమలం జోరుకు కళ్లేలు వేసేందుకు దేశంలోని కొన్ని రాజకీయ శక్తులు పావులు కదుపుతున్నాయి..ఇంకా ఏడాదిన్నర వ్యవధి ఉన్న ఎన్నికలకు సంబంధించి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున ముందస్తు సన్నాహాలు కాస్త మందకొడిగానే సాగుతున్నా విపక్షాలు మాత్రం కౌంట్ డౌన్ షురూ అనేసుకుంటున్నాయి.
ఎన్డీయేతర పార్టీలన్నీ ఒక గొడుగు నీడకు చేరి అధికార పార్టీని ఎదుర్కొనేందుకు బలమైన కూటమి నిర్మాణానికి శ్రీకారం జరుగుతోంది..ఒకవైపు మమతా బెనర్జీ..మరోవైపు కేసీఆర్ ఎవరికి వారు పగ్గాలు తమ చేతిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుండగా కేసీఆర్ ఒకడుగు ముందుకు వేసి జాతీయ పార్టీ ఆవిర్భావానికి బీజాలు వేయడంతో జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
చోటు చేసుకుంటున్నాయి..
బిజెపికి సంబంధించి 2014 నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రధాని నరేంద్ర మోడీనే..మరీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప మోడీ బొమ్మతోనే మరోసారి బిజెపి ఎన్నికలకు వెళ్తుందనేది తథ్యం..అయితే ఆ పార్టీలో కూడా ఇప్పుడిప్పుడే మోడీ నాయకత్వంపై..వన్ మాన్ షో వైఖరిపై అసంతృప్తి మొదలైనా ప్రజల్లో ఆయనకు గల ఇమేజ్ దృష్ట్యా బహిరంగంగా నోరెత్తే పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు..
అప్పుడప్పుడు ఆరెస్సెస్ నుంచి కొంత విముఖత వ్యక్తం అవుతున్నా అది ఒక స్థాయిని దాటి ముందుకు వెళ్ళడం లేదు..పార్టీలో మోడీతో సమానమైన ఇమేజ్ కలవారెవ్వరూ తెరపైకి రాలేదు..ఒకరిద్దరు అంతర్గతంగా గళం విప్పినా మోడీ..అమిత్ షా ద్వయం పెత్తనం ముందు ఆ నోళ్ళు మూసుకుపోతున్నాయి.
ఇక విపక్షాలు ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే సంఖ్యా బలం లేక అల్లాడుతున్నాయి..బిజెపిని ఎన్నికల్లోనే ఎదుర్కొందామనే ఉద్దేశంతో అందుకు సన్నాహాలు ప్రారంభించారు కొందరు నాయకులు.. అలాంటి వారిలో మొన్నటి వరకు మమతా బెనర్జీ ముందంజలో ఉన్నా ఇప్పుడిప్పుడే వేగం పెంచి కేసీఆర్ ముందుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
2014 ఎన్నికల్లో అనూహ్య స్థాయిలో విజయం సాధించి అధికార పీఠాన్ని అధిరోహించిన బిజెపి అయిదేళ్ల కాలంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించకపోగా పెద్ద నోట్ల రద్దు వంటి ఆకస్మిక నిర్ణయంతో దేశాన్ని విస్మయపరచినా,కొన్ని రోజుల పాటు జనజీవితాన్ని అతలాకుతలం చేసినా సరైన పద్ధతిలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు..వాస్తవానికి 2014-19 మధ్యకాలంలో ఎన్డీయే ప్రభుత్వం పెద్దగా ఊడబొడిచింది లేకపోగా ఎన్నికల ప్రధాన వాగ్దానాలు సైతం నెరవేర్చింది లేదు..అయినా 2019 ఎన్నికల్లో బిజెపికి అదే స్థాయిలో విజయం దక్కింది..
బిజెపి పలుకుబడి కొంత మేర తగ్గిందనుకున్నా ఇతర పార్టీలు..ముఖ్యంగా కాంగ్రెస్ పుంజుకోకపోవడం కమలం పార్టీకి కలసి వచ్చిన అంశంగా పరిణమించింది..అయితే 2019లో మళ్లీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చాక బిజెపి ప్రతిష్ట నెమ్మదిగా దిగజారుతూ వచ్చిందన్నది నిర్వివాదం..!
ముఖ్యంగా ధరలు అదుపుచేయడంలో ఎన్డీయే సర్కార్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది..పెట్రోల్ ధరలను నియంత్రించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట..రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా బిజెపికి కొన్ని చోట్ల చావు తప్పి కన్ను లోట్టపోగా కొన్ని చోట్ల ఘోరపరాభవం ఎదురైంది..ఆ తరహా సన్నివేశానికి ప్రధాన వేదిక పశ్చిమబెంగాల్..అక్కడ బిజెపిని,మోడీని సమర్థంగా ఎదుర్కొని చుక్కలు చూపించిన కథానాయిక.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి..ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ఇప్పుడు అదే మమత పార్లమెంటు ఎన్నికల్లో కూడా బిజెపి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని ఉత్సుకతతో ఉన్నారు. పూర్తిగా కాకపోయినా దేశంలో బిజెపియేతర పార్టీలు మమత చుట్టూ తిరిగే పరిస్థితి మొదట్లో ఉన్నా ఇప్పుడు ఆమె దూకుడు తగ్గింది.అదే అదనుగా ఇటు కేసీఆర్ జోరు పెంచారు.
ఇప్పుడు ప్రధాన ప్రశ్న మమత..కేసీఆర్ కలిసి పనిచేస్తారా..అన్నదే.. ఇలా మళ్లీ ఎవరికి వారే అన్న ధోరణిలో కూటములు ఎక్కువైతే అది మళ్లీ బిజెపికి అనుకూలం అవుతుంది. అప్పుడు కొన్ని పార్టీలు అటు..ఇంకొన్ని పార్టీలు ఇటు అయిపోయి విపక్షాల ఓట్లు చీలిపోతే 2024 లో కూడా గత రెండు ఎన్నికల ఫలితమే పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది.బిజెపిని ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం తప్పని సరి.అలాంటి దశలో అందరూ త్యాగాలకు సిద్ధపడక తప్పదు.
ఇంకో కీలక శక్తి కాంగ్రెస్..
ఆ పార్టీ గత వైభవాన్ని కోల్పోయి కనీసం నిర్ణాయక శక్తిగా కూడా మిగల్లేదనేది వాస్తవమే అయినా ఇప్పటికీ ప్రధాన పక్షమే అన్నది కాదనలేని వాస్తవం. అదీగాక ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కారణంగా కాంగ్రెస్ కాస్త బలం పుంజుకుంతున్నట్టే కనిపిస్తోంది. బిజెపియేతర కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించే స్థాయి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం..అయితే కాంగ్రెస్ ఎటువైపు ఉంటే ఆ కూటమి బలంగా ఉంటుందనేది కాదనలేని విషయం.
ఇలా చూసుకున్నా ఇన్ని పార్టీలు ఒక త్రాటిపైకి రావడం కొంచెం కష్టమే..ఎందుకంటే ఎక్కడికక్కడ స్థానిక బలాబలాలు..వాటిని అనుసరించి స్థానిక ప్రయోజనాలు ఉంటాయి.ప్రాంతీయ పార్టీలు అనేపాటికి జాతీయ రాజకీయాల కంటే ఉనికి కాపాడుకోడానికి స్థానిక రాజకీయాలే ముఖ్యం.ఆ అంశాన్ని కాదనుకుని సొంత రాష్ట్రంలో ప్రత్యర్ధితో జాతీయ స్థాయిలో చేయి కలపడం జరిగే పని కాదు.
ఇప్పుడు తాజా పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ..కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని శాసించిన ఒక మహాశక్తి ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో..అది మమతా బెనర్జీ కానివ్వండి..కేసీఆర్ సారధ్యంలో పని చెయ్యడానికి సిద్ధంగా ఉంటుందా అనేది ఇప్పటికైతే ప్రశ్నే..అందులోనూ ఈమధ్యనే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల కోసం స్వతంత్రంగా సన్నాహాలు ప్రారంభించింది.
ఇక మిగిలిన పార్టీల సంగతి..మూలాయం సింగ్..అఖిలేష్ యాదవ్,లాలూ ప్రసాద్ యాదవ్..తదితర ప్రాంతీయ సామ్రాట్టుల స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలి..ఇక నిన్న మొన్న తమిళనాడులో ఒక ఊపు ఊపిన డిఎంకె అధినేత..ముఖ్యమంత్రి స్టాలిన్ ఎటువైపు మొగ్గు చూపుతారో.. ఆయన ఇప్పుడు పెద్ద శక్తే..
ఆపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు..వైఎస్సార్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఇద్దరి వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది కీలకమైన అంశమే…ఇద్దరూ ఒకే గొడుగు నీడన ఉంటారనేది అసాధ్యం..
జగన్ బిజెపితో చేతులు కలపడానికి తెగ ఉబలాట పడుతున్నారు.ప్రస్తుతం కొన్ని క్లిష్ట పరిస్థితుల మధ్య నలుగుతున్న ఆయనకు అది వ్యక్తిగత అవసరం.ఆయన తొందర పడి బిజెపికి ఎదురెళ్తే కష్టాల్లో పడే ప్రమాదం ఉంటుంది..
ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ మధ్య తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా.. సంప్రదాయానికి వ్యతిరేకంగా జన్మవైరి కాంగ్రెస్ తో చేతులు కలిపి చెయ్యి కాల్చుకున్నారు.. మరోసారి ఆ ప్రయోగం చేసేందుకు ఆయన సిద్ధపడక పోవచ్చు..దీదీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి..ఆ కోణంలో చూస్తే ఆయన మమత నేతృత్వంలోని కూటమితో చెయ్యి కలిపితే,అదే కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా సైకిల్..హస్తం కలిసి ప్రయాణం చెయ్యవలసి ఉంటుంది.మొత్తానికి అటు
తమిళనాడులో డీఎంకె ఎటు చేరితే అన్నా డిఎంకె వ్యతిరేకం..అలాగే చంద్రబాబు ఎవరితో జట్టు కడితే జగన్ వారికి వైరి పక్షంలో కలవడం గ్యారంటీ..ఈ కాంబినేషన్ల మీదనే ప్రధానంగా 2024 ఎన్నికల ముఖచిత్రం ఆధార పడి ఉంటుందనేది పక్కా.. పోతే కమ్యూనిస్టులు బిజెపి వ్యతిరేక శక్తులతోనే చేయి కలుపుతారనేది కూడా నిర్వివాదం..
ప్రస్తుతానికైతే అతుకుల బొంతగా ఉన్న బిజెపియేతర శక్తులను ఒక చోట చేర్చి కొత్త బొంతను కుట్టే దర్జీ పనిలో అటు మమతా బెనర్జీ,ఇటు కేసీఆర్ ఉన్నారు.!రానున్న రోజుల్లో చాలా మార్పులు,చేర్పులు చోటు చేసుకుంటాయనుకున్నా ప్రధానంగా బిజెపి వైపు కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్ ఉండవనేది గ్యారంటీ..అదే వచ్చే ఎన్నికల్లో కీలక ఈక్వేషన్..మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2024 ఎన్నికలు ఇంతకు ముందులా మోడీ..రాహుల్ బొమ్మలతోనే జరుగుతాయా..
లేక మోడీ × బహుముఖాలు
తెరపై ఉంటాయా..ఇదీ ఆసక్తికరమైన ప్రశ్నే…
రేసులో వెనకబడి ఉన్న కాంగ్రెస్ ఒంటరిగా బిజెపిని ఎదుర్కోలేదన్నది గ్యారంటీ..
భిన్న శక్తులు..విభిన్న మొహాలు..ఈ మిశ్రమాలు అనివార్యం..అయితే కాంబినేషన్లు ఎలా ఉండబోతాయనేది నిర్దిష్టంగా చెప్పడానికి ఇంకొంతకాలం వేచి ఉండాల్సిందే..!
ఇ.సురేష్ కుమార్
_జర్నలిస్ట్_
9948546286