– చంద్రబాబు హయాంలో 17 వైద్య కళాశాలలు, 38,595 మంది విద్యార్థులు చదివారు
– నాలుగేళ్లకు కాదు కదా…. నలభయ్యేళ్ల తర్వాత కూడా అధికారంలోనికి రారు
– వైద్య విద్యను వ్యాపారం చేసింది. జగన్ రెడ్డి కాదా?
– నిర్మాణాలకు ఖర్చుపెట్టిన మొత్తం రూ.1,550 కోట్లు మాత్రమే
– ఫొటోలు చూపించి వైసీపీ అసత్య ప్రచారంపై శాసనసభలో నిప్పులు చెరిగిన మంత్రి సత్యకుమార్ యాదవ్
– నర్సీపట్నం, బాపట్ల కళాశాలల వద్ద సెల్ఫీలు తీసుకోవాలని సూచించిన మంత్రి
– వైద్య విద్య ప్రమాణాల పెంపునకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
అమరావతి : “తెలుగుదేశ ప్రభుత్వ హయంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు వచ్చాయి. ఈ కళాశాలల్లో ఇప్పటి వరకు 38,575 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇందులో కన్వీనర్ కోవాలో చదివిన విద్యార్థులు 22,575 మంది ఉన్నారు. జగన్ పత్రికలో చంద్రబాబు హయాంలో ఒక వైద్య కళాశాల రాలేదని నిస్సిగ్గుగా రాశారు. జగన్ హయాంలో కేవలం 750 సీట్లతో 5 కళాశాలలు మాత్రమే వచ్చాయి. వైద్య కళాశాలల కోసం జగన్ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. పీపీపీ విధానం అమలుతో సంపద సృష్టిస్తాం ” అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
“ఆధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ టెండర్లను రద్దుచేస్తామని జగన్ బెదిరిస్తున్నారు. ఊకదంపుడు, తాటాకు చప్పుళ్లకు బెదిరే వారు ఎవరూ లేరు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పాలెగాళ్ల రాజ్యంలో ఉన్నామా? రాష్ట్రాన్ని ఆయన తన జాగీరు అనుకుంటున్నారా? సీఎంగా పనిచేసిన వారు ఇలా మాట్లాడాతారా? ఆయన నాలుగేళ్లకు కాదు కదా! మరో 40 ఏళ్ల తర్వాత కూడా అధికారంలోనికి రారు. ప్రైవేటీకరణ.. పీపీపీ విధానం మధ్య ఉన్న తేడా గురించి తెలియకుండా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.
రాష్ట్ర శాసనసభలో మంగళవారం సాయంత్రం ‘ఆరోగ్యం’పై లఘు చర్చలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ పీపీపీ విధానంలో కళాశాలలను నడపాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టారు. అరకొర నిర్మాణాలతో నిలిచిపోయిన కళాశాలల ఫొటోలను సభలో చూపిస్తూ వైకాపా వైఖరిని ఎండగట్టారు. ‘వైద్య విద్య ప్రమాణాలు పెంపు, పేద విద్యార్థుల విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
రానున్న రెండేళ్లలో కొత్త కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం 4 కళాశాలలకు టెండర్లు పిలిచాం. త్వరలో మిగిలిన కళాశాలలకు టెండర్లు పిలుస్తాం. పీపీపీ విధానంలో యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దనే ఉంటాయి. వాటిపై ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. 33 ఏళ్ల లీజుతో పారద్శకంగా టెండర్ల ఎంపిక జరుగుతుంది. వైకాపాకు చెందిన వారు కూడా టెండర్లు దాఖలు చేయొచ్చు.
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించడంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించినా జగన్ ముందుకు రావడంలేదు. పీపీపీ విధానం అమలుచేయడం కొత్తేమీ కాదు. ఎయిర్పోర్టులు, రోడ్ల నిర్వహణలో ఈ విధానం అమల్లో ఉంది. గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో కళాశాలలు నడుస్తున్నాయి’ అని మంత్రి పేర్కొన్నారు..
బాపట్ల, నర్సీపట్నం, పెనుకొండ కళాశాలల వద్ద సెల్ఫీలు తీసుకోరా?
కేంద్ర ప్రభుత్వం అనుమతి మేరకు 17 వైద్య కళాశాలలకు గత వైసీపీ పాలనలో రూ.8,480 కోట్ల వ్యయంతో అంచనాలు తయారుచేసి, ఏడాదికి కేవలం రూ.387 కోట్ల చొప్పున రూ.1,550.39 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. ఈ నిధులు కూడా సీఎస్ఎస్, సెషల్ అసిస్టెన్స్ ఫ్రమ్ గవర్నమెంటు ఆఫ్ ఇండియా, నాబార్డు ద్వారా వచ్చాయి. నాటి వైకాపా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిధులు కేటాయించలేదు.
కూటమి ప్రభుత్వం పెండింగు బిల్లుల చెల్లింపు నిమిత్తం రూ.786 కోట్లు ఖర్చుపెట్టింది. పులివెందులలోని కళాశాల నిర్మాణానికి నాటి ప్రభుత్వంలో రూ.396 కోట్ల వరకు ఖర్చుపెట్టారు. జగన్ పులివెందులకా? రాష్ట్రానికి సీఎంగా ఉన్నారా? అని ఒకరు నన్ను ప్రశ్నించారు. నిస్సిగ్గుగా ఆ కళాశాల భవనాలవద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. నాబార్డు ద్వారా 11 వైద్య కళాశాలలకు రూ.742.07 కోట్లు ఖర్చుపెట్టగా, పులివెందుల కళాశాలకు రూ.396,16 (53.38%) ఖర్చుపెట్టారు… అని మంత్రి ధ్వజమెత్తారు.
మదనపల్లి, ఆదోని, నర్సీపట్నం, బాపట్ల, పాలకొల్లు, పెనుకొండ, ఇతర కళాశాలల నిర్మాణాలను జగన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారు. పులివెందుల కళాశాలలో బోధకుల కొరత (47.5%), మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉన్నట్లు ఎన్ఎంసీ గుర్తించింది. పార్వతీపురం కళాశాలకు భూసేకరణ జరగలేదు. టెండర్లు పిలువలేదు.
గిరిజన ప్రాంతంపై ప్రేమంటే ఇంతేనా? వైకాపా వారు కొత్త వైద్య కళాశాలల భవనాల వద్దకు సెల్ఫీలు తీసుకుంటున్నారు. పెనుకొండ, బాపట్ల, నర్సీపట్నం కళాశాలలవద్ద ఎవరూ సెల్ఫీలు తీసుకోవడంలేదు. పులివెందుల కళాశాలకు నిధులు మళ్లించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల వారు ఉన్న ప్రాంతాల్లోని కళాశాలల నిర్మాణాలను పట్టించుకోలేదు…అని మంత్రి పేర్కొన్నారు
వైద్య విద్యను వ్యాపారం చేసిందెవరు? జీఓలిచ్చింది ఎవరు?
“ప్రభుత్వ రంగంలో వైద్య విద్యను వ్యాపారం చేసింది వైకాపాయేనే. సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో కళాశాలల నిర్వహణపై 2021లో జీఓ133 తెచ్చారు. 2023లో 108, మరో జీఓను కన్వీనర్, యాజమాన్య(రూ.12 లక్షలు) ఎన్నారై (రూ.20 లక్షలు) కోటాలను సృష్టించారు. ఫీజులు ఖరారు చేశారు. దీని కోసం ఏపీమెర్క్ సంస్థను స్థాపించేదెవరు? సీట్లు అమ్మాలన్న ఆలోచన చేసింది వైకాపాయేనే.
ప్రభుత్వ సీట్లను యాజమాన్య, ఎన్నారై కోటాలో సీట్లు అమ్మడం ప్రారంభిందెవరు? పీపీపీ విధానంలో నడవబోయే కళాశాలల్లో జాతీయ కోటా కింద ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు ఉండదు. 50% సీట్లు పూర్తిగా కన్వీనర్ కోటాలో ఉచితంగా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలల్లో జాతీయ కోటా సీట్లను మినహాయించాల్సి ఉంది. పీపీపీ విధానంలో ఇదేమీ ఉండదు.
పులివెందుల, ఆదోని,మదనపల్లి, మార్కాపురం కళాశాలలు పీపీపీ విధానంలో 2026-27లో ప్రారంభమవుతాయి. వీటిలో 625 చొప్పున పడకలు ఉంటాయి. 2027-28లో మిగిలిన కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతాయి. వీటిల్లో ఓపీ సేవలు ఉచితం. ఐపీ కింద 70% పడకలు ఉచితంగా కేటాయిస్తాం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద రోగులకు ఉచితంగా సేవలందుతాయి.” అని సత్యకుమార్ యాదవ్ వివరించారు.
వైద్య కళాశాలల నిర్మాణాల వివరాలు
– మార్కాపురం, మదనపల్లి, ఆదోని, అమలాపురం, పెనుకొండ కళాశాలలకు రూ.475 కోట్లు చొప్పున, బాపట్ల కళాశాలకు రూ.505 కోట్ల ఖర్చుకు గత ప్రభుత్వ హయాంలో పరిపాలనాపరమైన ఆమోద ఉత్తర్వులు వెలువడ్డాయి.
– మార్కాపురం కళాశాలకు నాటి వైకాపా సర్కారు రూ.27.83 కోట్లు ఖర్చుపెట్టింది. కూటమి ప్రభుత్వం రూ.44.07 కోట్లు మంజూరు చేసింది. 13.35 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం జరగాల్సి ఉండగా 3.61 లక్షల చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మాణం జరిగింది.
– మదనపల్లి కళాశాలకు నాటి వైకాపా ప్రభుత్వం రూ.5.46 కోట్లు ఖర్చుపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏడాది వ్యవధిలో రూ.66.97 కోట్లు ఖర్చుపెట్టింది. 14.37 లక్షల చదరపు అడుగులకుగాను కేవలం 2.23 లక్షల చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మాణాలు జరిగాయి.
– ఆదోని కళాశాలకు నాటి ప్రభుత్వం రూ.24.38 కోట్లు ఖర్చుపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏడాదిలో రూ.53.95 కోట్లు వ్యయం చేసింది. 13.71 లక్షల చదరపు అడుగుల్లో జరగాల్సిన నిర్మాణాలకు 2.97 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం జరిపారు.
– అమలాపురం కళాశాలకు గత వైకాపా సర్కాదు రూ.60.59 కోట్లు వ్యయం చేసింది. కూటమి ప్రభుత్వం ఏడాది వ్యవధిలో రూ.62.79 కోట్లు ఖర్చుపెట్టింది. 11.98 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం జరగాల్సి ఉండగా కేవలం 2.52 లక్షల చదరపు అడుగుల మాత్రమే నిర్మాణం జరిగింది.
– పెనుకొండ కళాశాల నిర్మాణాలకు రూ.18.79 కోట్లు మాత్రమే గత వైకాపా ప్రభుత్వం ఖర్చుపెటింది. 13.58 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరగాల్సి ఉంటే 1.65 లక్షల చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మాణం జరిగింది.
– నర్సీపట్నం కళాశాలకు రూ.500 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతినివ్వగా గత ప్రభుత్వం రూ.13.65 కోట్లు ఖర్చుపెట్టింది. 12.19 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం జరగాల్సి ఉంటే కేవలం 0.89 లక్షల చదరపు అడుగుల మాత్రమే నిర్మాణం జరిగింది.
– బాపట్ల కళాశాలకు నాటి వైకాపా ప్రభుత్వం రూ.22.09 కోట్లు ఖర్చుపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.67.09 కోట్లు ఖర్చుపెట్టింది. 10.02 లక్షల చదరపు అడుగుల్లో జరగాల్సిన నిర్మాణాలు పునాదుల దశలో ఉన్నాయి.
– పాలకొల్లు కళాశాల నిర్మాణం పునాదుల్లోనే ఆగింది. పార్వతీపురం కళాశాలకు భూ సేకరణ జరగలేదు