Suryaa.co.in

Editorial

తప్పెవరిది?.. శిక్ష ఎవరికి?

  • తిరుపతి ఘటనలో నిజం నిద్రపోయిందా?

  • ఆ ఇద్దరినీ విడిచిపెట్టడం సబబేనా?

  • ఈఓ, ఏఈఓలే బాధ్యులన్న పవన్

  • సీఎంకే తెలియని పద్ధతులు అమలుచేసింది ఎవరు?

  • పాత పద్ధతులు పాటించడం వల్లే కదా ఈ దారుణం?

  • మరి దానిని అమలుచేసిన వారిపై శిక్షలేవీ?

  • ఎస్పీ సుబ్బారాయుడికి జగన్ కంటే ముందే శిక్ష విధించారా?

  • భక్తుల మనసు గెలిచిన పవన్

  • క్షమాపణ చెప్పి పెద్దమనసు చాటిన జనసేనాధిపతి

  • జగన్‌కు అస్త్రాలు అందిస్తున్నారా?

  • కొండపై ఇంకా వైసీపీ విధానాలేనా?

  • ధర్మారెడ్డి వారసత్వం కొనసాగుతోందా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

తిరుమల వైకుంఠ దర్శనానికి వచ్చి టోకెన్ తీసుకుండానే వైకుంఠానికి వెళ్లిన ఆరుగురు అమాయక భక్తుల విషాదానికి.. క్యూలైన్లలో వినిపించిన భక్తుల ఘోషకు కారకులైన వారెవరో ఉప ముఖ్యమంత్రి, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ చెప్పిన తర్వాత గానీ భక్తకోటికి అర్ధం కాలేదు. కానీ.. ప్రభుత్వానికి మాత్రం ఇంకా బోధపడకపోవడమే వింత.

ఆరుగురు అమరపురికేగి, డజన్లమంది భక్తులు క్షతగాత్రులైన ఆ విషాద వైఫల్య ఘటనకు కారకులంటూ.. కొందరిపై వేటు వేసిన వైనం చూస్తే, తిరుపతి ఘటనలో నిజం నిద్ర పోయిందన్న భావన ఏర్పడటం సహజం. అక్కడి ఎస్పీ సుబ్బారాయుడు, కొండ కింద ఉన్న జేఈఓ గౌతమి, టిటిడి సీఎస్‌ఓ శ్రీధర్‌పై బదిలీ వేటు పడగా.. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరక్టర్ హరినాధరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇది సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక్కడో చిన్న ముచ్చట. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో.. ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వ్యవహరించిన సుబ్బారాయుడు అనే అధికారిని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నానా రకాలుగా వేధించారు. చివరాఖరకు ఆయనను ఒక జిల్లాలో డాగ్‌స్వ్కాడ్‌లో పడేశారు. ఒక సీఎంకు సీఎస్‌ఓగా పనిచేసిన అధికారిని పోలీసుకుక్కల పెంపకంలో పడేస్తే ఆ అధికారి ఆత్మగౌరవం ఏ స్థాయిలో దెబ్బతింటుంది? దానితో తెలంగాణకు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆయనకు, అక్కడా కొంతకాలం పోస్టింగ్ దక్కలేదు. సరే మళ్లీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన సుబ్బారాయుడుకు, తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.

దానితో వైసీపీ నేతలు కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండ్ కో ఆయనను వెంటాడటం ప్రారంభించారు. చివరాఖరకు జగన్ సైతం.. ‘తెలంగాణ నుంచి తెచ్చుకున్న సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారాయుడును తెలంగాణలో కాదు. శ్రీలంకలో ఉన్నా వెంటాడి శిక్షిస్తా’మని హెచ్చరించారు.

సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆ అవకాశం జగన్‌కు ఇవ్వదలచుకోని టీడీపీ ప్రభుత్వం, తానే సుబ్బారాయుడిని శిక్షించింది. అంటే.. ‘మా సుబ్బారాయుడిని నువ్వు శిక్షించేదేమిటి? మేమే శిక్షిస్తాం. అలాంటి అవకాశం నీకెందకు ఇస్తామ’న్న సంకేతం జగన్‌కు పంపినట్లు స్పష్టమవుతుంది. పోనీలెండి. తనను శ్రీలంకలో ఉన్నా వెంటాడి శిక్షిస్తానన్న జగన్ విధించబోయే శిక్ష బదులు.. తాను సుదీర్ఘకాలం పాటు సేవలందించిన చంద్రబాబు చేతిలో ‘ముందస్తు శిక్ష’ అనుభవించడమనే ‘తీయని బాధ’ కొంత మేలే కదా?

సరే.. తిరుపతి విషాదం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిన సీఎం చంద్రబాబునాయుడు, ఆ వైఫల్యానికి కారకులైన ఈఓ, జేఈఓపై అగ్గిరాముడయ్యారు. కలెక్టరుకూ క్లాసులిచ్చారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ తెలియదా? భక్తుల మైండ్‌సెట్ తెలుసుకోరా? తప్పుచేస్తే నేనెవరినీ స్పేర్ చేయనంటూ పాత పద్ధతిలో అగ్గిరాముడయ్యారు. అసలు తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నట్లు తనకే తెలియదని వాపోయారు. పాత బోర్డు విధానాలను ఎందుకు కొనసాగించారు? సంప్రదాయాలు మార్చమని మీకెవరు చెప్పారు? టెక్నాలజీ వాడుకోవాలని తెలియదా? అంటూ శివమెత్తారు.

చంద్రబాబు ఆగ్రహోదగ్రుడైన విధానం చూసి, ఈఓతో సహా పెద్దతలలపై వేటు తప్పదన్న భావన టీవీ న్యూస్ చూసేవారిలో ఏర్పడం సహజం. అయితే అది భ్రమేనని తెలియడానికి పెద్ద సమయం పట్టలేదు. పెద్ద తలల బదులు.. కిందిస్ధాయి వారిపై వేటుతో సరిపెట్టిన వైనం, చంద్రబాబు ఇమేజీకి తగినట్లు లేదన్న భావన క్షణాల్లో విస్తరించింది. సీఎం స్థాయి వ్యక్తి టీటీడీ బాసులపై వేటు వేసేందుకు, వెనుకంజవేయడంపై సహజంగానే చర్చకు తెరలేచింది.

ఈఓ, ఏఈఓలపై వేటు వేసి ఉంటే.. బాబు తిరుపతి పర్యటనకు సార్థకత ఉండేదన్న వ్యాఖ్యలు, స్వయంగా కూటమి నేతల నుంచే వినిపించడం విశేషం. బహుశా వారిపై చర్యల విషయంలో ఏదో మొహమాటం ఉందన్న, కించిత్తు అనుమానం కూడా తెరపైకి రాకపోలేదు. ఏదేమైనా చంద్రబాబు తిరుమల పర్యటనతో బాధ్యులకు శిక్ష పడలేదన్న భావన సర్వత్రా వ్యాపించిందనేది నిష్ఠుర నిజం.

నిజానికి తిరుపతిలో టోకెన్ల కౌంటర్లు పెట్టకపోతే అసలు ఈ దుర్ఘటన జరిగేదే కాదు. కౌంటర్లు పెట్టినందుకే కదా అక్కడకు భక్తులు పోగయింది? వారిని నియంత్రించేందుకే కదా పోలీసులు కాపలా కాయాల్సివచ్చింది? చంద్రబాబు చెప్పినట్లు.. ఆ టోకెన్లు ఏవో కొండపైనే ఇచ్చి ఉంటే.. ఆరుగురు భక్తులు టికెట్ లేకుండా వైకుంఠానికి వెళ్లేవారు కాదు కదా? అప్పుడు సుబ్బారాయుడు అండ్ కోపై బదిలీ వేటు పడేదీ కాదు కదా?

మరి ఆ టోకన్ కౌంటర్లు తిరుపతిలో ఏర్పాటుచేసిన అధికారులను విడిచిపెట్టి.. ఆ నిర్ణయం తీసుకున్న అధికారి ఆదేశాలు పాటించిన అధికారులపై చర్యల కొరడా ఝళిపించడం సబబా? ఇదెక్కడి న్యాయం? ఇదేం న్యాయం? ఇదీ ఇపుడు సర్వత్రా వినిపిస్తున్న ధర్మసందేహం. అసలు తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఎవరు? ఈఓనా? ఏఈఓనా? కింద ఉన్న జేఈఓనా? తిరుపతి ఎస్పీనా? టీటీపీ చైర్మనా? టీటీడీ బోర్డుకు చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారా? సొంత నిర్ణయమా? అన్నది తేల్చకుండానే, శిక్షలు విధించడం సబబు కాదన్నది విజ్ఞుల ఉవాచ.

చంద్రబాబు తిరుపతి పర్యటన తర్వాత.. ‘‘ఒక ఎస్పీ, జెఈఓ, డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్‌పై వేటు వేయడం ఖాయం. ఈఓ, ఏఈఓలు సురక్షింగా ఉంటార’’ంటూ సోషల్‌మీడియాలో పోస్టింగులు తెగ హోరెత్తాయి. చివరాఖరకు అంబులెన్స్ డ్రైవర్ మినహా.. మిగిలిన వారి విషయంలో సోషల్‌మీడియా సైనికుల జోస్యం నిజమవడమే విచిత్రం. అంటే ‘మంచి ప్రభుత్వం’పై కూటమి కార్యకర్తలకంటే, ప్రజలకే ఎక్కువ అవగాహన ఉన్నట్లు తేలిపోయింది.

ఏమాటకామాట. ఈ ఎపిసోడ్‌లో డిప్యూటీ సీఎం, జనసేన దళపతి పవన్‌కల్యాణ్ గురించి చెప్పకపోతే అన్యాయమే అవుతుంది. ఈ ఘటనకు చైర్మన్ నాయుడు, ఈఓ శ్యామలరావు, ఏఈఓ చౌదరి బాధ్యత వహించాలని నిర్మొహమాటంగా, నిష్కర్షగా చెప్పిన తీరు బహు ముచ్చటేసింది. రాజకీయాలు తెలియని పవన్.. ఈఓ-ఏఈఓ-పాలకమండలి మధ్య గ్యాప్ ఉందని చెప్పారంటే, ఆయనకు టీటీడీ వ్యవహారలపై ఎంత అవగాహ న ఉంద న్నది స్పష్టమయింది. మీ వల్ల మేం తిట్లు తినాల్సి వస్తోంది. మీ వల్ల చంద్ర బాబుకు చెడ్డపేరు వస్తోంది. మీకు బాధ్యత లేదా? ఈ ఘటనకు ఆ ముగ్గురే బాధ్యత వహించాలంటూ కుండబద్దలు కొట్టిన వైనం భక్తులనే కాదు, సాధారణ ప్రజలనూ ఆకట్టుకుంది.

మీరు వీఐపీల సేవలో మునుగుతున్నారు. మీకు వీఐపీలు కాదు. సామాన్య భక్తులు ముఖ్యమని స్పష్టం చేసిన విధానం, పవన్‌పై సగటు మనిషికి గౌరవం పెంచిందన్నది మనం మనుషులం అన్నంత నిజం. ‘40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమ నేత ఆ మాట ఎందుకు చెప్పలేకపోయార’ంటూ.. తమ్ముళ్లు తెగ మదనపడిన సందర్భమది.

సహజంగా సీఎం ఒక పర్యటనకు వెళితే, మంత్రివర్గ సహచరులెవరూ అదే ప్రాంతంలో,అదే కార్యక్రమం నిర్వహించరు. సీఎం కార్యక్రమాన్ని అనుసరిస్తారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం రొటీన్‌కు భిన్నంగా.. తాను కూడా బాధితులను పరామర్శించి, తన అభిప్రాయాన్ని మీడియా సమక్షంలో కుండబద్దలు కొట్టడమే విశేషం. నిజానికి పవన్ కల్యాణ్ తిరుపతికి వచ్చి ఆ ప్రకటన చేయకపోతే, కూటమి అప్రతిష్ఠపాలయ్యేది. చంద్రబాబునాయుడు చెప్పలేని విషయాన్ని.. పవన్ కల్యాణ్ నిర్మొహమాటంగా చెప్పి, ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచారన్న వాదన వినిపించింది.

ఇక జగన్ జమానాకు తెరపడి కూటమి పాలన వచ్చినప్పటికీ, టీటీడీలో ఇంకా వైసీపీ విధానాలే అమలవుతున్నాయన్న విమర్శ.. చంద్రబాబు వ్యాఖ్యలతోనే స్పష్టమయింది. ఒక సీఎం.. అందునా సొంత జిల్లాకు చెందిన చంద్రబాబుకే తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారంటే, ఇక ఆయనకు తెలియకుండా తెర వెనుక ఎంత జరుగుతోందో? గత పాలకమండలి అనుసరించిన విధానాలను, ఎందుకు కొనసాగించారన్న చంద్రబాబు ప్రశ్న ఒక్కటి చాలు.. కొండపై ధర్మారెడ్డి పాలనే కొనసాగుతోందని చెప్పడానికి!

ఒక్క వైకుంఠ ఏకాదశి దర్శనాలే కాదు. అన్ని విధానాలూ ధర్మారెడ్డి దారిలోనే నడుస్తున్నాయన్నది నిష్ఠుర నిజం. కొండపైన బడా పారిశ్రామికవేత్తలు నిర్మించిన గెస్ట్‌హౌస్‌పై ఉన్న పెంట్‌హౌసులను టీటీడీ ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ధర్మారెడ్డి గతంలో వారికి ఆ వెసులుబాటు ఇచ్చారు. దానిని ఈ పాలకమండలి కూడా విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇటీవల మండ లిలో విపక్షనేత బొత్సకు డజన్ల సంఖ్యలో టికెట్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే అది రాస్తే రామాయణం. చెబితే మహాభారతం!

ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఈఓ, అడిషినల్ ఈఓ, చైర్మన్ వైఫల్యాన్ని కుండబద్దలు కొట్టిన వైనం ప్రజల్లోకి వెళ్లింది. మరి వారిపై చర్యల కొరడా ఝళిపిస్తారా? లేదా?.. ఇదే ఇప్పుడు అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్న అంశం.

LEAVE A RESPONSE