– జనసేన అధినేత పవన్ కల్యాణ్
పెందుర్తి: విశాఖపట్నంలో వృద్ధురాలిని వాలంటీర్ చంపేస్తే అధికార పక్షం నుంచి స్పందనే లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆ సమయంలో వృద్ధురాలి కుటుంబానికి జనసేన నేతలు అండగా నిలిచారని చెప్పారు.
వారాహి యాత్రలో భాగంగా పవన్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం దురదృష్టకరం. ప్రతి కుటుంబం పిల్లలు, మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గతంలో మహిళల మిస్సింగ్‌పై చెప్పిన గణాంకాలు నేను చెప్పినవి కావు. పరిశోధన సంస్థలు చెప్పిన గణాంకాలే నేను ప్రస్తావించాను. అలానే రౌడీషీటర్‌కు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎక్కడిది? కిడ్నాప్‌కు గురైన అదే ఎంపీ రౌడీషీటర్‌కు వత్తాసు పలికేలా చర్యలు ఉండటమేంటి? నాపై ఆంక్షలు పెడుతున్నారు కానీ నేరగాళ్లకు ఎలాంటి ఆంక్షలు లేవు” అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.