– కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది
– రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీ
– నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు
– గాంధీ సరోవర్ నిర్మాణానికి డిఫెన్స్ ల్యాండ్
– మంచిరేవుల దగ్గర శివాలయాన్ని అభివృద్ధి చేయబోతున్నాం
– మూసీ పరివాహకంలో గురుద్వార్ , మసీదు, చర్చి
– మూడు నదుల సంగమంగా బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ను అభివృద్ధి
– అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన చోట బాపూ ఘాట్ నిర్మించారు. మానవ నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి చెందింది. కాకతీయుల నుంచి నిజాం నవాబుల వరకు సాగు, తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించారు. 1908 లో నగరాన్ని వరద ముంచెత్తితే… వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిజాం సర్కారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించింది.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇప్పటికీ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌజుల డ్రైనేజీతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో కలుపుతుంటే ఉక్కు పాదం మోపాం. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లాం. లండన్ థేమ్స్ రివర్, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాలను పర్యటించాం. ప్రపంచస్థాయి నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకున్నాయి.
గుజరాత్ సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించారు. ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. బీజేపీ నాయకులు వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసుకున్నారు. మేం వాటిని వ్యతిరేకించలేదు. తప్పుపట్టడం లేదు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.కంపెనీల కలుషితాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయి.
మూసీ పరీవాహక ప్రాంత మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు చెప్పిన పరిస్థితి. ప్రపంచ నగరాలు అభివృద్ధి చెందుతున్న విధానాలను చూశాక మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించాల్సిందేనని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. కన్సల్టెన్సీలను అపాయింట్ చేసుకుని మూసీ ప్రక్షాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పాం. బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ రెండు నదులు కలిసే చోట V షేప్ లో అభివృద్ధి జరుగుతోంది. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనుకుంటున్నాం
20 TMC లలో 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీ లో నిరంతరం శుద్ధమైన నీరు పాటించేందుకు ఉపయోగించాలనుకుంటున్నాం. మూడు నదుల సంగమంగా బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ను అభివృద్ధి చేయబోతున్నాం. మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ADB బ్యాంకు రూ. 4 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.
గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నాం. ఓల్డ్ సిటీని మేం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ. ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. కొంతమంది నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీ. హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారు.
రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతుంది. రాబోయే 20 ఏండ్లలో 75 శాతానికి పట్టణీకరణ పెరుగుతుంది. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరం.
నేను వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారు? నిజాలు ప్రజలకు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారు. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకు? మూసీ ప్రక్షాళన చేయాలని వాళ్ల బీఆరెస్ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటే వాళ్లు అలాగే ఉండాలన్నట్లుగా విపక్షం ప్రవర్తిస్తున్నది.
మంచిరేవుల దగ్గర మూసీ పరివాహకంలో ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. మూసీ పరివాహకంలో గురుద్వార్ , మసీదు, చర్చి లను నిర్మించి మత సామరస్యాన్ని చాటబోతున్నాం. డీపీఆర్ సిద్దమయ్యాక అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. గాంధీ సరోవర్ నిర్మాణానికి డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచనప్రాయంగా అంగీకరించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు నా సూచన. మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి. పేదలకు మంచి ఇండ్లు కట్టించి వారికి మెరుగైన వసతులు కల్పిద్దాం. హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే మా సంకల్పం. మేం మంచి పని చేయాలనుకుంటున్నాం. మీ సూచనలు సలహాలు ఇవ్వండి. డీపీఆర్ సిద్ధమయ్యాక, ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి సలహాలు తీసుకుంటాం. కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది.