Suryaa.co.in

Andhra Pradesh

మధ్యలో అదానీ ఎందుకు వచ్చాడు?

– తక్కువ ధరతో సెకీతో ప్రభుత్వ ఒప్పందం చరిత్రాత్మకం
– దాని వల్ల ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు ఆదా
– అలా 25 ఏళ్లలో దాదాపు లక్ష కోట్లు ప్రభుత్వానికి ఆదా
– సెకీతో చంద్రబాబు 2016లో కొనుగోలు ఒప్పందం
– యూనిట్‌ పవర్‌ రూ.4.50 చొప్పున కొనుగో లు
– అదే జగన్‌ రూ.2.49కే కొనేలా ఒప్పందం
– పవన్‌కళ్యాణ్‌ ప్రాపకం కోసమే బాలినేని అబద్ధాలు
– తనను మంత్రిని చేశారన్న కనీస విశ్వాసం లేదు
– దారుణంగా దిగజారి బాలినేని మాట్లాడుతున్నారు
– నెల్లూరులో వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

నెల్లూరు: గత కొద్ది రోజులుగా వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా అదానీపై యూఎస్‌లో చేసిన ఆరోపణలను పట్టుకుని బురద జల్లాలని చూస్తున్నారు. అదానీ కంపెనీ వ్యవహారంలో జగన్‌ పేరు లేదు. అయినా ఒక రిపోర్టు ఆధారంగా బురద జల్లడం కోసం అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. యూఎస్‌కు సంబంధించిన హిండెన్‌బర్గ్‌కు, అదానీకి మధ్య జరిగిన విషయాన్ని తెచ్చి.. ఏం సంబంధం లేకుండా మా నాయకులకు ముడిపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ ఇండియా’ (సెకీ)తో మాత్రమే ఒప్పందం చేసుకుంది. అంతేతప్ప, అదానీ కంపెనీతో కాదు. అలాంటప్పుడు అదానీ కంపెనీలకు, జగన్‌గారికి ఏం సంబంధం?. అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లావాదేవీలు జరపలేదు.

సెప్టెంబర్‌ 15, 2021న కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. రూ.2.49కి సోలార్‌ పవర్‌ ఇస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై క్యాబినెట్‌లో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న తర్వాత, అన్ని అంశాల అధ్యయనం కోసం ఎనర్జీ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. నెల రోజుల తర్వాత ఆ కమిటీ నివేదికపై మరోసారి చర్చించిన క్యాబినెట్, రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా సెకీ నుంచి పవర్‌ కొనాలని నిర్ణయించారు.

ఆ మేరకు 6400 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాన్ని కూడా చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. అలా న్యాయ పరమైన చిక్కులు ఏర్పడుతున్న కారణంగా టెండర్ల సమస్య ఉన్న నేపథ్యంలో, ఆ బాధ్యత తామే తీసుకుంటామన్న సెకీ, 2024 సెప్టెంబరులో 3వేల మెగావాట్లు, 2025లో 3వేల మెగావాట్లు, 2026లో మరో 3వేల మెగావాట్లు.. మొత్తం 9వేల మెగావాట్లు ఇస్తామని హామీ ఇస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది.

ఒకవేళ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోజు సెకీతో ఒప్పందం చేసుకోకపోయి ఉంటే, కచ్చితంగా మరో విధంగా విమర్శ చేసేవాళ్లు. రూ.2.49కే యూనిట్‌ విద్యుత్‌ ఇస్తామన్నా, ప్రభుత్వం లాలూచీ పడి తీసుకోలేదని రాసే వారు. నరం లేని నాలుకను ఎటైనా తిప్పి మాట్లాడతారు. దాన్ని ఇష్టారీతిన ప్రచారం చేసే మీడియా వారికి ఎలాగూ ఉంది. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్‌ కొనుగోలులో యూనిట్‌ విద్యుత్‌కు సగటున రూ.5.10 చెల్లించారు. అదే మా ప్రభుత్వ హయాంలో రూ.2.49కే కొనుగోలు చేస్తే, మంచి చేసినట్లా? లేక తప్పు చేసినట్లా?.

సోలార్‌ పవర్‌కు సంబంధించి 2014 వరకు 11 పీపీఏలు ఉండగా, చంద్రబాబు అయిదేళ్లలో 2400 మెగావాట్లకు సంబంధించి 35 పీపీఏలు చేసుకున్నారు. వాటి విలువ రూ.22,868 కోట్లు . 2014లో యూనిట్‌ సోలార్‌ విద్యుత్‌ను దాదాపు రూ.7కు కొనుగోలు చేశారు. 2016లో 1500 మెగావాట్లకు రూ.3.74 నుంచి రూ.4.84 వరకు అగ్రిమెంట్లు జరిగాయి.

సెకీ తక్కువకు ఇస్తామని చెప్పినా వినకుండా అంత భారీ రేట్లకు కొనుగోలు చేశారు. దాని వల్ల విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలు (డిస్కమ్‌లు) నాశనం అవుతున్నా, కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు. ఇక 2016లో యూనిట్‌ విద్యుత్‌ రూ.4.50 చొప్పున 500 మెగావాట్ల కొనుగోలు చేసేలా, సెకీతో ఒప్పందం చేసుకున్నారు. ఇంతకన్నా దౌర్భగ్యం ఎక్కడైనా ఉందా? మా ప్రభుత్వంలో కన్నా రూ.2 చొప్పున ఎక్కువ చెల్లించి కొనడం ఏమిటో?.

2019–20 నాటికి విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి రెగ్యులేటరీ కమిషన్‌ ఇచ్చిన టారిఫ్‌ల ధర రూ.4.63 నుంచి రూ.5.90 వరకు నిర్ధారించింది. చంద్రబాబు బ్రహ్మాండంగా చేయడం అంటే అధిక ధరలకు కొనుగోలు చేయడమా..

2014–19 మధ్య విద్యుత్‌ రంగంలో చంద్రబాబు నిర్వాకం చూస్తే.. ఉచిత విద్యుత్‌కు సంబంధించి దాదాపు రూ.8845 కోట్ల బకాయిలు పెట్టాడు. విద్యుత్‌ ఉత్పత్తిదారులకు సంబంధించి దాదాపు రూ.21,541 కోట్లు బకాయిలు పెట్టాడు. చంద్రబాబు రాకమునుపు రూ.29,552 కోట్లు ఉన్న విద్యుత్‌ రంగం బకాయిలు ఆయన దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లకు చేరాయి. ఇదేనా సమర్థవంతమైన పాలన. ఆయన హయాంలో విద్యుత్‌ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పడానికి ఈ లెక్కలే ఉదాహరణ.

సెకీతో ఒప్పందానికి ముందు యూనిట్‌ కరెంట్‌కి సంబంధించి రూ.2.49 నుంచి రూ.2.58 వరకు 58 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అంత తక్కువ రేటుకు ఏపీ ప్రభుత్వానికి రావడం ఇష్టం లేని చంద్రబాబు, వాటన్నింటినీ కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్నారు. చివరకు సెకీతో యూనిట్‌ పవర్‌ రూ.4.50కి కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు.

రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ వ్యయానికి యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కి కొనుగోలు ఒక గొప్ప విషయం. అది కూడా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు మినహాయించి 25 ఏళ్లకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ పబ్లిక్‌ డాక్యుమెంట్లు. ఎవరైనా దాచేస్తే దాగేవి కావు. ఆ చరిత్రాత్మక ఒప్పందం వల్ల 25 ఏళ్ల పాటు ఏటా రూ.4వేల కోట్ల చొప్పున 25 ఏళ్లలో లక్ష కోట్లు ఆదా అవుతుంది.

పవన్‌ ప్రాపకం కోసమే బాలినేని అబద్ధాలు
సెకీతో ఒప్పందంపై బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారని దాన్ని పెద్ద భూతంలా ప్రచారం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ దయతో ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. మా జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా పనిచేశారు. ఆయనతో మాకు చాలా చనువుంది. ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించలేదు.

పవన్‌ కళ్యాన్‌ దగ్గర మెహర్బానీ కోసం ఈ ఆరోపణలు చేసి ఉంటాడనిపిస్తుంది. వైఎస్‌ జగన్‌ గురించి, ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడటానికి ఆయనకి ఎలా మనసొప్పిందో ఆయన ఆలోచించుకోవాలి. మంత్రివర్గంలో నిర్ణయాలు ఎజెండాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియకపోవడం విడ్డూరం. టేబుల్‌ అజెండా కింద మంత్రులు అడిగిన అంశాలను వారి నియోజకవర్గ అంశాలను చేర్చడం మీకు తెలియదా?

అర్థరాత్రి ఫైల్‌ వచ్చిందని బాలినేని పచ్చిఅబద్ధాలు చెబుతున్నారు. ఆ సమయంలో ఈ–ఫైలింగ్‌ విధానం ఉండగా ఇలా దారుణంగా మాట్లాడటం బాలినేనికి తగదు. ఎవరి దగ్గర నీ స్థాయి పెంచుకోవడానికి మాట్లాడుతున్నావో, ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో మాకు అనవసరం.. కానీ వాటి కోసం మా నాయకుడి మీద బురద జల్లడం భావ్యం కాదు.

తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం నా నియోజకవర్గంలోకి వచ్చింది. దానిపై కేంద్రంతో ఇబ్బందులొస్తే టేబుల్‌ అజెండా కింద చేర్చి , భూముల కొనుగోలుకు కూడా నిధులు మంజూరు చేయించారు. ఇలాంటివి ప్రతి మంత్రికి ఎదురైన అనుభవాలే. మనం ఏదైనా అడిగితే కాదని లేదన్న సందర్భాలున్నాయా..?

LEAVE A RESPONSE