-అంబేద్కర్ పేరు చెప్పి మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు
-లాల్చీ వేసుకున్నోడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు…పంచె కట్టిన వారు వైఎస్ కాదు
-30 లక్షల మంది నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?
-ఉద్యోగం ఇవ్వకపోతే కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు
-ఒక్కో నిరుద్యోగికి రూ.60వేలు బాకీ
-పంచె కట్టిన మంత్రి నిరంజన్ వైఎస్ లా ఫీలవుతున్నారు
-ఇంకో మంత్రి హాఫ్‌కు ఎక్కువ ఫుల్ కు తక్కువ
-రూ.2.50 మీ ఓటును అమ్ముకుంటారా?
-ఓటును అమ్ముకుంటే ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్లే
-ఈ బిడ్డ మీ బిడ్డ.. సంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ : కృష్ణా, తుంగభద్ర నీళ్లతో తడిసిన నేల పాలమూరు జిల్లా.బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాప రెడ్డి, రాజా బహద్దూర్ వెంకట రామి రెడ్డి, జైపాల్ రెడ్డి మన పాలమూరు బిడ్డలే.పాలమూరు బిడ్డలు కష్టజీవులు.కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవే. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. మరి తొమ్మిదేళ్లయినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు జిల్లా ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఒక్కసారి ఆలోచించండి.కేసీఆర్ కుటుంబం కానీ, బంధువులు కానీ తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోలేదు. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చింది పేదింటి బిడ్డలే.
సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ మనసులో అంబేద్కర్ భావజాలం ఉంటే.. నీ మంత్రి వర్గంలో మాల మాదిగలకు ఎందుకు స్థానం ఇవ్వలేదు. నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్నావ్. మరి 30 లక్షల మంది నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? బాబా సాహెబ్ అంబేద్కర్ వారికి హక్కులు ఇవ్వలేదా? కేవలం మీ కుటుంబానికే ఇచ్చారా? రాష్ట్రంలో దుర్మార్గపు పరిస్థితులు దాపురించాయి. పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సప్ లో ప్రత్యక్ష మవుతున్నాయి. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్ లలో దొరుకుతున్నాయి. భూములు, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు కొల్లగొట్టారు. ఇప్పుడు ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను వందలాది కోట్లకు అమ్ముకుంటున్నారు. ఇదేనా తెలంగాణ మోడల్?
ఉద్యోగం ఇవ్వకపోతే కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఒక్కో నిరుద్యోగికి రూ.60వేలు బాకీ. నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడే కేసీఆర్ ను క్షమించే ప్రసక్తే లేదు. అంబేద్కర్ పేరు చెప్పి మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. మీ పాలమూరు బిడ్డకు కాంగ్రెస్ రథసారధిగా సోనియాగాంధీ అవకాశం ఇచ్చారు.లాల్చీ వేసుకున్నోడు లాల్ బహద్దూర్ శాస్త్రి కాదు…పంచె కట్టిన వారు వైఎస్ కాదు. పంచె కట్టిన మంత్రి నిరంజన్ వైఎస్ లా ఫీలవుతున్నారు. ఇంకో మంత్రి హాఫ్‌కు ఎక్కువ ఫుల్ కు తక్కువ.
క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా.పాలమూరును భయపెడుతున్న దున్నపోతును , దూడను కట్టేసి బుద్ది చెబుతాం. రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ సిద్దిపేటకు వెళుతున్నాయి. అక్కడ ఏ దేవుడు ఏలుతున్నాడు… ఇక్కడ ఏ దెయ్యాలు ఏలుతున్నాయ్? జిల్లాలో 14కు 14 గెలిపిస్తేనే సోనియమ్మకు కృతజ్ఞత చెల్లించిన వాళ్లం అవుతాం. ఓటుకు రూ.5వేలు ఇచ్చినా.. రోజుకు రూ.2.50 అవుతుంది. రూ.2.50 మీ ఓటును అమ్ముకుంటారా? ఓటును అమ్ముకుంటే ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్లే.ఈ బిడ్డ మీ బిడ్డ. సంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. జిల్లాలో 14 కు 14 గెలిపించండి.