Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్‌ చనిపోతే ఆ కుటుంబసభ్యులకు తలనొప్పి కూడా రాలేదు ఎందుకో?

వైఎస్ మృతి అనంతరం చనిపోయిన వారందరూ ఆయన కోసమే చనిపోయినట్టుగా చిత్రీకరించారు
మరి… వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరికీ ఏమీ కాలేదు ఎందుకో ?
మీది తప్పుడు లెక్కని ఒప్పుకోండి… కానీ తెదేపా వారిది మాత్రం తప్పుడు లెక్క కాదు
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తో కలత చెంది చనిపోయిన వారి పేర్లనే టీడీపీ ప్రకటించింది
కష్టాల్లో ఉన్న మహిళ నిజం గెలవాలని ప్రజల్లోకి వెళ్తుంటే పేరడీ చేస్తారా?… మంత్రిగా రోజా తన స్థాయికి తగ్గట్టు మాట్లాడితే మంచిది
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణాన్ని తట్టుకోలేక 1000 నుంచి 1500 మంది చనిపోయినట్టుగా చెప్పిన లెక్క బోగస్ అని ఒప్పుకుంటే ఒప్పుకోండి. కానీ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు తెదేపా కార్యకర్తలు, ఆయన అభిమానులు కలత చెంది మృతి చెందారనేది నిజమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

తెదేపా నాయకులు కూడా తప్పుడు లెక్కలు చెప్పాలనుకుంటే 1000 నుంచి 1500 మంది చనిపోయారని చెప్పి ఉండేవారు. కానీ అలా కాకుండా ఎంతమంది అయితే చనిపోయారో, అంతమంది పేర్లను మాత్రమే ఆరా తీసి… వివరాలన్నీ తెలుసుకొని చెప్పారని ఆయన అన్నారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైయస్ కుటుంబంలో దాదాపు 150 మందికి పైగా సభ్యులు ఉంటారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం చెందితే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిల, ఆమె భర్త కు ఏమీ కాలేదు. ఇంకా ఎంతో మంది ఉన్నా వారి కుటుంబ సభ్యులెవరికి కూడా చిన్న తలపోటు రాలేదు.

జనాభా లెక్కల్లో చనిపోయిన వారందరినీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం తట్టుకోలేక ఆయన కోసమే చనిపోయినట్టుగా తప్పుడు లెక్కలు చెప్పినట్టుగా స్పష్టం అవుతుందన్నారు. ఒక మహిళ కష్టాల్లో ఉండి, దేవుడిని దర్శించుకుని ప్రజలకు నిజం చెప్పాలని భావిస్తే, సాటి మహిళగా మంత్రి రోజా పేరడీ చేయడం విడ్డూరంగా ఉంది. నిజంగానే నిజం గెలిస్తే భువనేశ్వరి తో పాటు, నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని పేర్కొనడం చూస్తుంటే ఆమె ఎంత అక్కసు తో మాట్లాడుతున్నారో అర్థమవుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

మంత్రి రోజా వ్యవహార శైలి ఏ మహిళ కూడా హర్షించదు . మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని… మంత్రి తన హోదా కు తగ్గట్లుగా మాట్లాడాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. భువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి యాత్రకు మహిళలు నీరాజనాలు పలుకుతారని ఆయన చెప్పారు. జైల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు . ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు రెండు వారాల ఇంట్రీమ్ బెయిల్ లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన రఘురామకృష్ణంరాజు, నవంబరు ఏడవ తేదీలోగా రిమాండ్ రిపోర్టు క్వాష్ కోసం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెలువడుతుందన్నారు.

అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన వర్తిస్తుందని కేసును కొట్టి వేయడం ఖాయమన్నారు. భవిష్యత్తుకు భరోసా యాత్రను జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది ఈ యాత్రను నారా లోకేష్ చేపడతారని పేర్కొంటున్నప్పటికీ, చంద్రబాబు నాయుడే ఈ యాత్రను చేపడతారని చెప్పారు. యువ గళం పాదయాత్రను నారా లోకేష్ మెరుపు వేగంతో పూర్తి చేస్తారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. నారా భువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి యాత్ర ద్వారా నిజమే గెలుస్తుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

విజయదశమి నుంచే మా పార్టీ నేతలకు నిద్రలేమి రోజులు షురూ
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్త నాయకత్వంలో టెన్టీటివ్ గా ఒక మేనిఫెస్టోను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తెదేపా పేర్కొన్న ఆరు అంశాలతో పాటు, జనసేన అధినేత మరో నాలుగు అంశాలను మేనిఫెస్టో రూపకల్పనకు జోడించారు. ఈ రెండు పార్టీల కలయికతో ఉభయగోదావరి జిల్లాలలోని తెదేపా, జనసేన క్యాడర్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఇరు పార్టీల శ్రేణులు కలిసి ఇంటింటికి వెళ్లి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తున్నారు. దీనితో విజయదశమి నుంచే మా పార్టీ నేతలకు నిద్రలేమి రాత్రులు మొదలయ్యాయి.

మా పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే… వారిలోని ఫస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. నిజం గెలవాలి యాత్ర ప్రారంభానికి ముందు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పెళ్లయిన తర్వాత చంద్రబాబు నాయుడు తోడు లేకుండా, తిరుమలేశుని దర్శించుకోవడం ఇదే మొదటి సారని చెప్పారు. ఎటువంటి సాక్ష్యం లేకుండా అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. దీని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ పెద్దలకు తెలుస్తుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

సాధికారిక యాత్ర పేరిట మీ ముందుకు వచ్చే మంత్రులను ప్రశ్నించండి
సామాజిక సాధికారిక యాత్ర పేరిట ఎస్సీ, ఎస్టి, బీసీమంత్రులు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి యాత్రలను చేపట్టనున్నట్లు ప్రకటించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలను ఏమి ఉద్ధరించారో ఈ యాత్రలో చెప్పనున్నారట. గతంలో బీసీమంత్రుల బస్సు యాత్రలను చూశాము. వెలవెల పోయిన సభలు, ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు మాత్రమే కనిపించాయి. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకు అయితే బలవంతంగా నైనా డ్వాక్రా మహిళలను తరలించే వారు. సభ కు హాజరైన వారికి బిర్యాని ప్యాకెట్లు, రిటర్న్ లో మందు సీసాలు ఇచ్చేవారు.

ఇప్పుడు క్వార్టర్ సీసాలు కాదు కేసులు ఇచ్చినా సాధికారిక యాత్రకు ఎవరు వచ్చే పరిస్థితి లేదు. సామాజిక సాధికారిక యాత్ర పేరిట మీ వద్దకు వచ్చే వారిని డాక్టర్ సుధాకర్ ఎలా మరణించారో చెప్పమని ప్రశ్నించండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యమును హత్య చేసి పార్సెల్ చేసిన వ్యక్తికి ఏ శిక్ష పడిందో నిలదీయండి. అలాగే దళిత యువకుడికి శిరోమండనం చేసిన కేసు ఏమయిందని, హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా ఓ దళిత యువకుడిని చంపేసిన సంఘటనను… తన సోదరిని వేధించవద్దని ప్రాధేయపడిన మైనర్ బాలున్ని కాల్చి చంపిన నిందితునికి ఏ శిక్ష విధించారో చెప్పామంటూ ప్రశ్నించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నామమాత్రపు మంత్రి పదవులు అయితే ఇచ్చారు కానీ, వాటి అధికారాలన్నీ సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వద్దనే ఉన్నాయన్నది జగద్వితం. సామాజిక సాధికార యాత్ర అన్నది ఒక డొల్ల. దళిత గిరిజన విద్యార్థులకు గత ప్రభుత్వాలు నాణ్యమైన విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్స్ స్కూల్స్ అందుబాటులో ఉంచితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని ఎత్తివేసింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో తిరిగి పునరుద్ధరించనున్నట్లుగా జీవో ఇచ్చారన్నారు.

కీలక పదవులన్నీ రెడ్డి నేతలకే
రెడ్డి నాయకులకేమో కీలక పదవులను ఇచ్చి, చిన్నాచితకా పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కట్టబెట్టారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . రెడ్డి నాయకులకు ఇచ్చిన పదవులతో కూడిన సహస్ర దండకాన్ని నేను ఇటీవల చదివి వినిపించాను. నేను చెప్పడమే కాదు ప్రజలకు కూడా ఈ విషయం తెలుసు. ఎన్ని అబద్ధాలు చెప్పాలని చూసినా, నిజమన్నదేమిటో ప్రజలకు తెలుసు. అయినా ప్రజలు ఇప్పుడు తిరగబడే పరిస్థితిలు లేవు. ఎందుకంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రజలకు ఎంత కోపం ఉందో, అంతే కోపం పోలీసులపై కూడా ఉంది.

పోలీసులపై, ఈ ప్రభుత్వంపై… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైనున్న కోపాన్ని ప్రజలు పోలింగ్ బూత్ లో తీర్చుకోనున్నారు. తెదేపా, జనసేన కూటమి సునాయసంగా 150 స్థానాలలో విజయం సాధిస్తుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వైకాపా నేతల మాదిరిగా 175కు 175 స్థానాలలో గెలుస్తామని కూటమి నేతలు బీరాలు పలకడం లేదు. తమకు 160 స్థానాలు వస్తాయని చెబుతున్నారు. కచ్చితంగా కూటమి అభ్యర్థులు 160 స్థానాలలో గెలిచే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 11 లక్షల పై మాటే
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 11 లక్షలకు పైమాటే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆర్బిఐ వద్ద తీసుకున్న అప్పులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పులని, మీరు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు అణా పైసలతో తన వద్ద లెక్కలు ఉన్నాయి.

ఆర్బిఐ, కార్పొరేషన్ అప్పులు, కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిలన్నీ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 11 లక్షల కోట్ల రూపాయలకు పై మాటేనని ఆమె కేంద్రమంత్రికి వివరించారు. వెంటనే ఫోరెన్సిక్ ఆడిటర్ ను పిలిపించి, ఆ రిపోర్టును పబ్లిష్ చేయాలని కోరారు. ఆడిట్ ద్వారానే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పురందరేశ్వరి పేర్కొన్నారన్నారు . ప్రతి ఏడాది మద్యం ద్వారా 30 వేల కోట్ల రూపాయలను స్వాహా చేస్తున్నారన్న పురందరేశ్వరి, సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు.

సీబీఐ విచారణకు ఆదేశించాలి అంటే కేసు వేయాల్సి ఉంటుందని… పురందరేశ్వరి వేస్తారేమో చూడాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. పురందరేశ్వరి కేసు వేయకపోతే, తనలాంటి వారు ఎవరైనా కేసు వేస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టిడిపి జనసేన పొత్తు ఖరారు కాక, తెలంగాణలో బిజెపి, జనసేన మధ్య పొత్తు ఉండే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ చక్కటి శుభవార్త చెబుతారని ఆశిద్దాం అని రఘురామకృష్ణం రాజు అన్నారు .

LEAVE A RESPONSE