– ఒక్క సంక్షేమ పథకం లేకున్నా ఎందుకంతగా అప్పులు?
– మరి ఇప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక, బంగ్లాదేశ్ కాదా?
– 18 నెలల్లో ఏకంగా రూ.2.66 లక్షల కోట్ల అప్పు
– ఎక్కడ ఖర్చుపెట్టారంటే నోరు మెదపట్లేదు
– మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్
విశాఖపట్నం: ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రరాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్పులాంధ్రప్రదేశ్ గా మిగిలిపోతోందని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 18 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పు చేసిందని మండలి విపక్షనేత ఆక్షేపించారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన రుణంలో, దాదాపు 80 శాతం కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే చేసిందని ఆయన గుర్తు చేశారు.
అయితే అప్పుడు రెండేళ్లు కోవిడ్ సంక్షోభం ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం అప్పు చేసినా, ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని, కార్యక్రమాన్ని ఆపలేదని, దాదాపు రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ రూపంలో వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. ఇప్పుడు ఇంతింతగా అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఆ మొత్తం ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పమంటే నోరు మెదపడం లేదని, విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
ప్రెస్మీట్లో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే..:
ఏదీ సంపద? అన్నీ అప్పులేగా?:
మాకు సంపద సృష్టించడం వచ్చు. మా దగ్గర మంత్రాలున్నాయి. మేం చెత్త నుంచి కూడా సంపద సృష్టిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో ఎక్కడా ఆచరణలో అది కనిపించలేదు. గత ఎన్నికల్లో ఓ వ్యూహం ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురంధేశ్వరి ఇష్టానుసారం అంకెలు చెప్పి ఆరోపణలు చేశారు. రాష్ట్రం శ్రీలంక, బంగ్లాదేశ్ అయిపోతోందని దుష్ప్రచారం చేశారు. మరి ఇదే ప్రభుత్వం ఈ 18 నెలల్లో ఎందుకు రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రశ్నిస్తున్నాం. సంపద సృష్టించడం అంటే, అప్పు చేయడమేనా?. అలాగే తెచ్చిన అప్పు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పారు. ఇంకా దారుణం.. భవిష్యత్తు మద్యం అమ్మకాలపైనా అప్పు చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో అప్పు చేసినా..:
గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పు చేసినా.. అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేశాం. ఎక్కడా అవినీతి, వివక్ష, దళారీ వ్యవస్థకు తావునివ్వకుండా, పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేసి, లబ్ధిదారులకు నగదు బదిలీ చేయడం వల్ల, కోవిడ్ వంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. మార్కెట్లో నగదు చలామణి జరిగింది. తద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగింది.
కానీ, ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్. ఒకవైపు అప్పులు మాత్రం రాష్ట్ర చరిత్రలో లేని విధంగా పెరుగుతున్నాయి. కానీ, అవి ఎక్కడా, ఏ రూపంలో ప్రజలకు చేరడం లేదు. అందుకే ప్రతి నెలా చూస్తుంటే రాష్ట్రానికి వస్తున్న ఆదాయం పడిపోతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి లేకే జీఎస్టీ వసూళ్లు తగ్గుతున్నాయి. ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణం.
18 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా?:
అంత అప్పు చేసిన మీరు ఈ 18 నెలల్లో ఏ ఒక్కరికైనా కొత్త పెన్షన్ ఇచ్చారా? రూ.1000 పెన్షన్ పెంచి, దాదాపు 5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది నిజం కాదు అని చెప్పే ధైర్యం ఉందా?. ఎన్నికల హామీలేవీ అమలు చేయకపోయినా, సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. విజయోత్సవ సభలూ నిర్వహించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తున్నారా? ఏదీ అమలు చేయకపోయినా.. అంత నిస్సిగ్గుగా ఎలా ప్రచారం చేసుకుంటున్నారు?.
క్షేత్రస్దాయిలో ఏ ఆఫీసుకు పోయినా అవినీతి లేకుండా ఏదీ జరగట్లేదు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించారు.
18న గవర్నర్ వద్దకు కోటి సంతకాలతో జగన్:
కొత్త మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుపరం చేయడంపై ప్రజాభిప్రాయ సేకరణతో కోటికి పైగా సంతకాలు సేకరించాం. రేపు 15న జిల్లాల నుంచి విజయవాడకు ఈ సంతకాలు పంపిస్తున్నాం. 18న సా. 4 గం.కు జగన్‌గారు వాటిని గవర్నర్‌గారికి అందజేయబోతున్నారు. మేం సేకరించిన సంతకాలు ఎందుకు పెట్టాలని జనం ఎందుకు అడగలేదో ప్రభుత్వం తెలుసుకోవాలి.
మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
ఎకనామిక్ జోన్ల వల్ల ఫలితం వస్తుందంటే స్వాగతిస్తాం. అయితే మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించాలి. నిన్న (శుక్రవారం) విశాఖలో భూమిపూజ చేసిన సంస్థలు ఏర్పాటైతే చూద్దాం.. ఐటీ సంస్థలకు రూపాయికి భూములు ఇవ్వడం తప్పని మేం చెబితే కాదన్నారు. లులూకు చౌకగా భూములు ఇవ్వడం తప్పని వాళ్లే అంటున్నారు. కాగా, ఈ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత లేదా? అని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.