– మీపై ప్రభుత్వం ప్రతి నెలా సుమారు కోటి రూపాయల వరకు వెచ్చిస్తోంది
– అయినా ప్రజల సమస్యలపై మౌనం ఎందుకు?
– అసెంబ్లీకి హాజరు కాకుండా వేతనం తీసుకోవడం న్యాయమా?
– ప్రజల మధ్యకు రాకుండా ప్రజాసేవ ఎలా సాధ్యం?
– గజ్వేల్ నియోజకవర్గం అనాధగా మారింది
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్పై ప్రభుత్వం ప్రతినెలా కోటి రూపాయల ప్రజాధనం ఖర్చు పెడుతున్నప్పటికీ.. ఆయన అసెంబ్లీకి హారుకాకపోవడం బాధ్యతారాహిత్యమని, బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు విమర్శించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యల పరిష్కారం కోసం గళం విప్పి, అనాధగా మారిన గజ్వేల్ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లానని ఆయన కోరారు. ఈ మేరకు ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు బహిరంగలేఖ పూర్తి పాఠం ఇదీ..
26-03-2026
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి
గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు,
శాసనసభ్యులు, గజ్వేల్ నియోజకవర్గం.
అయ్యా,
విషయం: గజ్వేల్ ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వీడి, అసెంబ్లీ సమావేశాలకు హాజరై పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతూ..
మీరు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, గజ్వేల్ ప్రజలకు మీరు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనుల ఒత్తిడి ఉందని భావించాం.
కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగడం గజ్వేల్ ప్రజలను నిరాశలోకి నెట్టింది. అసెంబ్లీలో ప్రజల గొంతుకగా ఉండాల్సిన మీరు సభకు హాజరు కాకపోవడం, బడ్జెట్ సమావేశాలను సైతం పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
గజ్వేల్ ప్రజల ప్రధాన సమస్యలు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ అమలు కాలేదు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు, ఇంకా చాలా మంది అర్హులకు ఇండ్లు ఇస్తామన్నారు, వాటి జాడే లేదు.
ఒంటరి మహిళలకు, యువకులకు ఇస్తామన్న ప్యాకేజీలు అందుబాటులోకి రాలేదు. ఔటర్ రింగ్ రోడ్ పనులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ – కోట మైసమ్మ రోడ్డు విస్తరణ మధ్యలోనే ఆగింది, ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందలేదు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రూ.125 కోట్లు కేటాయించినా, అవినీతి, అక్రమాల మూలంగా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. పాండవుల చెరువు సుందరీకరణ పనులు నిలిచిపోయాయి. గజ్వేల్ పట్టణంలో సీసీ రోడ్లు దయనీయ స్థితిలో ఉన్నాయి. నిర్మించిన బస్టాండ్ ప్రజలకు ఉపయోగంలో లేదు.
ఎడ్యుకేషనల్ హబ్ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉంటే, మీరు ఒక్కసారి అయినా సభలో గళం విప్పారా? ప్రజల డబ్బుతో మీకు లభిస్తున్న సౌకర్యాలు జడ్ ప్లస్ భద్రతతో భారీ పోలీస్ బలగాలు
24 గంటల ఫామ్ హౌస్ భద్రత – నిరంతర ప్రభుత్వ వ్యయం వ్యక్తిగత సిబ్బంది, కార్యదర్శులు – ప్రభుత్వ వేతనాలతో ప్రభుత్వ వాహనాలు, ఇంధనం, నిర్వహణ ఖర్చులు ప్రతిపక్ష నాయకుడి హోదా కారణంగా అదనపు భద్రతా సదుపాయాలు.. వీటి కోసం మీపై ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రతి నెలా సుమారు కోటి రూపాయల వరకు వెచ్చిస్తోంది. అయినా, ప్రజల సమస్యలపై మౌనం ఎందుకు?
ప్రజల తరఫున కీలక ప్రశ్నలు అసెంబ్లీకి హాజరు కాకుండా వేతనం తీసుకోవడం న్యాయమా? ప్రజల మధ్యకు రాకుండా ప్రజాసేవ ఎలా సాధ్యం? నియోజకవర్గ సమస్యలపై నోరు మెదపకపోవడం మీ బాధ్యతారాహిత్యం కాదా? ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం అనాధగా మారింది.
అధికార పార్టీ స్పందించకపోతే, ప్రతిపక్ష నాయకుడిగా మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మౌనం పాటించడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఇప్పటికే మీరు ఎన్నికై రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా సభకు హాజరై గజ్వేల్ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతున్నాను.
ధన్యవాదాలు.
భవదీయులు
(కప్పర ప్రసాదరావు)
రాష్ట్ర అధికార ప్రతినిధి,
భారతీయ జనతా పార్టీ – తెలంగాణ
ఫోన్: 9676776622