Home » ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఎందుకు?

ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఎందుకు?

-ఎమ్మెల్యేకు ఎస్కార్ట్, పైలెట్ వైభోగాలు అవసరమా?
– ఇళ్ల దగ్గర పోలీసు అవుటోపోస్ట్
– సీఐ, డీఎస్పీల అత్యుత్సాహంతో ట్రాఫిక్ ఆపుతున్న ఓవరాక్షన్
– తన కోసం ట్రాఫిక్ ఆపవద్దన్న సీఎం చంద్రబాబు
– ఎమ్మెల్యేలు సీఎం కంటే ఎక్కువా?

-అనధికార ప్రోటోకాల్లో ఎమ్మెల్యేలకు పోలీసు సేవ
-వైఎస్ జమానా నుంచి కొనసాగుతున్న ప్రత్యేక సేవలు
– చంద్రబాబు జమానాలో అయినా తెరదించుతారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

దేవాలయాల్లో కొన్ని ప్రత్యేక పూజలు ఉంటాయి. వాటిని సేవల పేరుతో పిలుస్తుంటాం. అయితే ఇవి అధికారికమే. వీటికి రుసుము కూడా ఉంటుంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కొన్ని పోలీసు సేవలున్నాయి. అయితే అవి అధికారికం కాదు. లోకల్గా ఏర్పాటు చేస్తున్న పోలీసుల ఓవరాక్షన్ ఇది. వైఎస్ హయాం నుంచి ఇప్పటివరకూ విజయవంతంగా కొనసాగుతున్న ఈ వ్యవస్థకు చంద్రబాబు జమానాలోనయినా తెరపడుతుందా?

ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అనధికారికంగా కొనసాగుతున్న పైలెట్, ఎస్కార్టు వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి టీపీఆర్ (త్రెట్ పర్సప్షన్ రిపోర్టు) ఆధారంగా ఎమ్మెల్యేల భద్రతా స్థాయి నిర్ణయిస్తారు. మావోయిస్టు, ఫ్యాక్షనిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నవారికి నలుగురు గన్మెన్లు (టు ప్లస్ టు) ఇస్తారు. సాధారణ ఎమ్మెల్యేలకు ఇద్దరు గన్మెన్లను (వన్ ప్లస్ వన్) కేటాయిస్తారు. టీపీఆర్ నివేదికను జిల్లా ఎస్పీలు అమలుచేయాల్సి ఉంటుంది.

అయితే వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచి ఇప్పటిదాకా నిబంధనలు అతిక్రమించి, సొంత భద్రతా వ్యవస్థను అమలుచేస్తున్న లోకల్ పోలీసు అధికారుల ఓవరాక్షన్ విమర్శలకు గురవుతోంది. స్థానిక ఎమ్మెల్యేలు నియోజకవర్గ పరిథిలోకి అడుపెట్టినప్పటి నుంచి, తిరిగి బయటకు వెళ్లేంతవర కు వారికి ఒక పైలెట్, ఎస్కార్టు వాహనం సమకూరుస్తున్న వైచిత్రి. ఇక ఎమ్మెల్యేలు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉండే రైల్వేస్టేషన్లకు.. వచ్చి వెళ్లే సమయంలో కూడా ఈ సేవలు కొనసాగుతుండటం విశేషం. ఇక ఎమ్మెల్యే నివాసం, పార్టీ కార్యాలయాల వద్ద కూడా ఈ సేవలు కొనసాగుతున్నాయి. చివరకు ఎమ్మెల్యేలు వస్తుంటే ట్రాఫిక్ నిలిపివేస్తున్న వైనం విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో సీఎం చంద్రబాబును సీఐ, డీఎస్పీలు ఆదర్శంగా తీసుకోవాలన్న సూచన వ్యక్తవుతోంది. ఆయన తాను వస్తుంటే ట్రాఫిక్ నిలిపివేయవద్దని పోలీసులను ఆదేశించారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి, తనకోసం ట్రాఫిక్ ఆపవద్దని ఆదేశిస్తే.. ఎమ్మెల్యేల కోసం ట్రాఫిక్ ఎలా ఆపుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నిజానికి పట్టణ-గ్రామీణ పోలీసుస్టేషన్లకు సిబ్బంది తక్కువ. అలాంటిది ఎమ్మెల్యేల ఎస్కార్టుకు కొందరు, పైలెట్ వాహనంలో కొందరు, ఇళ్లు-పార్టీ ఆఫీసుల వద్ద కొందరిని నియమిస్తే పోలీసులపై పనిభారం పెరుగుతుంది కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా స్థానిక డీఎస్పీ – సీఐల ఓవరాక్షన్ అని, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply