-రేవంత్ కు ఉన్న అభ్యంతరం ఏంటి?
-ఎందుకు లేఖ రాయడం లేదు?
-స్కాం వెనక మెఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పాత్ర
-మెఘా కంపెనీని తప్పించాలనే కుట్ర
-మెఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కాపాడే ప్రయత్నం
-ప్రాజెక్టు నిర్మాణంలో మెఘాకు రూ. 48 వేల కోట్ల లబ్ధి
-హైకోర్టు జడ్జి విచారణ అనేది కేసును పక్కదారి పట్టించడానికి మాత్రమే
-నాడు రేవంత్ … కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటే కరప్షన్ రావు అని అభివర్ణించారు
-కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది
-కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అనుమానాలు
-కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు
-బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం పై వివరాలు ఇవ్వాలని కాగ్ పలు దఫాలుగా కోరినా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు… ఆ డబ్బులను వసూలు చేసి పేద ప్రజల అకౌంట్స్ లో వెస్తానని గతంలో రాహుల్ అన్నారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ కు ఉన్న అభ్యంతరం ఏంటి? ఎందుకు లేఖ రాయడం లేదు? అంటూ ప్రశ్నలు సంధించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మెడిగడ్డ వరకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరగాలన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నాయని గతంలో రేవంత్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం గా తన దగ్గర ఉన్న ఆధారాలను పంపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి గారితో పాటు, రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి గారు, రాణా ప్రతాప్ గారు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘునందన్‌రావు ఇంకా ఏమన్నారంటే…
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో గత ఏడాది నుంచి కాగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ఉత్తరాలు రాసింది.
మార్చి 20, 2023న తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక అధికారి డాక్టర్ రజత్ కుమార్ కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని లేఖ వచ్చింది. ఉద్దేశపూర్వకంగా లేఖకు సమాధానం ఇవ్వకుండా.. తమ బండారం బయపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టింది.
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని.. టీపీసీసీ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి భారత ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్నప్తులు చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కథను కంచికి చేర్చాలని చూస్తోంది. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అనేలా అవినీతి కథను పక్కదోవ పట్టించాలని చూస్తోంది.
నాడు రేవంత్ … కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటే కరప్షన్ రావు అని అభివర్ణించారు. నాసిరకం పనుల వల్లే పిల్లర్లు కుంగాయి అని రాహుల్ గాంధీ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్షకోట్లు దోచుకున్నారన్నారని… తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును రికవరీ చేసి ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరి నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదు? కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి.
దేశ చరిత్రలో నే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగింది. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు.. అది ప్రాజెక్ట్ లో చిన్న భాగం. కాళేశ్వరం పక్కన పెట్టేసి మెడిగడ్డ వరకే చర్చ సాగుతోంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలి. సీబీఐ విచారణకు కోరాలి. రేవంత్ రెడ్డి.. మేడిగడ్డ వరకే విషయాన్ని పరిమితం చేస్తున్నారు. ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థపైకి మాత్రమే నెడుతున్నారు.
పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా 5 వేల కోట్లు ఖర్చు చేసి.. కేవలం 42 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే అదనంగా నీరిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.. దీనిపై విచారణ మేడిగడ్డ వరకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోంది.
కాళేశ్వరం రీడిజైన్ పేరుతో కేసీఆర్ అంచనా వ్యవయాన్ని పెంచారు. 2016 లో రూ. 63 వేల కోట్ల డీపీఆర్ అంచనా కాస్త.. రూ. లక్షా 49 వేల 315 కోట్లకు పెరిగింది. ఈ స్కాం వెనకాల మెఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పాత్ర ఉంది. L&t వరకే కాళేశ్వరం స్కాం పాత్రను పరిమితం చేయాలని చూస్తున్నారు.
పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలోని ఓ ప్రజాప్రతినిధిని మెఘా పెద్దలు కలిసినట్టు సమాచారం. దీంతో మెఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 48 వేల కోట్ల లబ్ధి కేవలం మెఘా కంపెనీకి జరిగింది.
గతంలో అమిత్ షా కి రాసిన ఉత్తరంలో.. కాళేశ్వరం అవినీతిపై ఆధారాలు ఉన్నాయని రేవంత్ పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి హోదాలో ప్రాజెక్టు అవినీతిపై సాక్ష్యాధారాలను సమర్పించి, రేవంత్ ఎందుకు సీబీఐ విచారణకు కోరడం లేదు? రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలపై రూ. లక్షా 50 వేల కోట్ల భారం పడనుంది.
మెఘా కంపెనీని పక్కకు తప్పించాలనే కుట్ర జరుగుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అవినీతి విషయంలో కేవలం మేడిగడ్డ మీదకే డైవర్ట్ చేయొద్దు. సీబీఐ విచారణ కోసం భారత ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన సొమ్మును.. అవినీతిపరుల నుంచి కక్కించాలి. రేవంత్ రెడ్డి… కాళేశ్వరం కరప్షన్ రావుపై సీబీఐ విచారణను కోరుతూ భారత ప్రభుత్వానికి లేఖ రాసి చిత్తశుద్ధిని చాటుకోవాలి.
హై కోర్ట్ జడ్జి విచారణ అనేది కేసును పక్కదారి పట్టించడానికి మాత్రమే. దీనిపై సీబీఐ విచారణకు కోరాలి. మెఘా కరప్షన్ మీద సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ భారత ప్రభుత్వాన్ని కోరాలి. దానికి సంబంధించిన ఆధారాలు కావాలంటే నేను ఇస్తాను. ఇప్పటికే వారికి నేను ఆధారాలు పంపించాను. అవి వారికి చేరాయి అనే అనుకుంటున్నా.