– ఎందుకింత కోపం పేదల మీద రేవంత్ రెడ్డి గారు?
– ఇంజనీరింగ్ విద్యలో ఎస్సీలకు కాంగ్రెస్ మొండి చెయ్యి
– నూతన గైడ్ లైన్స్ తెచ్చి ఎస్సీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న రేవంత్ సర్కార్
– ఇలా మోసం చేయడానికేనా మల్లిఖార్జున ఖర్గే గారు?
– బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మీది ఆపన్న హస్తం కాదు మొండి చెయ్యి:. ఖర్గే నుండి భట్టి వరకు ఎందరో ఎస్సీ మంత్రులున్నా, స్పీకరున్నా ఎస్సీలకు మాత్రం కాంగ్రేసు ప్రభుత్వంలో మొండి ‘చేయే’ మిగులుతున్నది. కేసీఆర్ పాలనలో ఇట్లెన్నడూ జరగలే.
నేడు రేవంత్ ప్రభుత్వం ఎస్సీలకు ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది.
ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే ఫీజు విద్యార్థులే కట్టాలంట. ఇది కూడా కేవలం ఎస్సీలకు మాత్రమే ప్రత్యేక నిబంధన అంట. లక్ష రూపాయల ఫీజు ఎస్సీ విద్యార్థులు ఎలా కడతారు? ఎందుకింత కోపం పేదల మీద రేవంత్ రెడ్డి గారు?
గత ఏడాది వరకు,ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు,మరియు మెయింటనెన్స్ ఫీజు అన్నిటిని ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద కాలేజ్ అకౌంట్ కి పంపేవారు. కానీ ఈ ఏడాది నుండి కాలేజీకి చెల్లించే ఫీజు రియంబర్స్ మెంట్ డబ్బులు, విద్యార్థుల అకౌంట్ కి పంపిస్తామని చెబుతుంది.
గత సంవత్సరం వరకు కాలేజీ యాజమాన్యాలు ఒక్క రూపాయి ఫీజు అడగకుండానే అడ్మిషన్ ఇచ్చేవారు. కానీ ఇపుడు EAPCET మంచి ర్యాంకు తెచ్చుకుని కన్వీనర్ కోటాలో సీటు పొందినా, ఖచ్చితంగా కాలేజీ ఫీజు కడితేనే అడ్మిషన్ ఇస్తామని చెబుతున్నారు. ఏమన్నా అంటే చూడండి ప్రభుత్వమే గైడ్ లైన్స్ ఇచ్చింది అని యాజమాన్యాలు చెబుతున్నాయి.
చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మీరు విద్యాజ్యోతుల పథకం పెట్టింది ఇలా మోసం చేయడానికేనా మల్లిఖార్జున ఖర్గే గారు? కేవలం ఎస్సీలే ఏం పాపం చేశారు? వారు ఇంజనీరింగ్ చదువులు చదువద్దా? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి కోర్సులు చేయద్దా? సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం/అధికారులు చెప్పలేదు ఎందుకు?
అన్ని వర్గాలను కాకుండా కేవలం ఎస్సీలకే ఈ అనాగరిక నిబంధన ఎందుకు? బండి సంజయ్,కిషన్ రెడ్డి,రాం చందర్ రావు ఎస్సీ వర్గీకరణ చేశామని ఒక పక్క చెబుతూ, మరో పక్క ఈ ఫీజుల దోపిడీ ఏమిటి? కేసిఆర్ ప్రభుత్వంలో ఏనాడు ఇలాంటి అన్యాయం జరగలేదు. రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు రాజీనామా చేయండి. లేదా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేయండని ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.