Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పై చర్యలు తీసుకోవాలని అంటే సోము వీర్రాజుకు ఎందుకు అంత కోపం?

– అధికార పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి ప్రయత్నించడం దారుణం
– జగన్ నిందిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?
– రోజూ రాష్ట్రం లో దళితులు, బడుగు వర్గాలపై జరుగుతున్న హింస మీకు కనపడలేదా?
-ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పై కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఆందోళన వ్యక్తం చేసింది వాస్తవం కాదా?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మార్చిన సిఎం వైఎస్ జగన్ పై చర్యలు తీసుకోవాలని అంటే సోమువీర్రాజుకు ఎందుకు అంత కోపం, అసహనం వచ్చిందో అర్థం కావడం లేదు.

రాష్ట్రాల్లో పాలన గాడి తప్పినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు కేంద్రం ఆర్టికల్ 355 ప్రకారం కలుగజేసుకునే అధికారం ఉందన్న విషయం సోమువీర్రాజు తెలుసుకోవాలి. గతం లో అనేక రాష్ట్రాల్లో ఇది జరిగింది. రాష్ట్రంలో దారుణాలు, నేరాలపై, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పై కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఆందోళన వ్యక్తం చేసింది వాస్తవం కాదా?. వివేకా హత్య కేసు విషయంలో సిబిఐపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడిని మీరు చూడలేదా? రోజూ రాష్ట్రంలో దళితులు, బడుగు వర్గాలపై జరుగుతున్న హింస మీకు కనపడలేదా?

ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు చేజారినప్పుడు…కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం, అధికారం ఉందన్న విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలని అన్నారు. తాము జగన్ పై చర్యలు కోరింది కూడా ప్రజా స్వామ్య బద్దంగా, చట్టబద్దంగానే అని గుర్తు చేశారు. నాడు మా ప్రభుత్వం ప్రజాస్వామ్యం బద్దంగా ఆలోచించింది కాబట్టే…ప్రతి పక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్రకు అనుమతి ఇచ్చామని…చట్టబద్దంగా వ్యవహరించామని అన్నారు.

వైసీపీ మూకలు రాష్ట్రాన్ని చెరపట్టి చేస్తున్న విధ్వంసంపై పోరాడాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు….. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి ప్రయత్నించడం దారుణం అన్నారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చి ప్రతి జిల్లాను హైదరాబాద్ మాదిరి అభివృద్ధి చేస్తానన్న జగన్ రెడ్డి హామీని అమలు చేయమని కోరడం తప్ప జగన్ నిందిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి.ప్రతిపక్ష పార్టీ పై విమర్శలు మాని ప్రజాసమస్యలు, ప్రభుత్వ అరాచకాలపై పోరాటాలు చేయాలని సూచించారు.

LEAVE A RESPONSE