– మీకు ఓట్లేయని వారికి సంక్షేమ పధకాలు ఇవ్వరా జగన్ రెడ్డి?
– బాపట్ల యానాది కాలనీలో చంద్రబాబు పర్యటన. తుఫాను బాధిత ప్రజలకు పరామర్శ
బాపట్ల:- యానాదుల సంక్షేమం కోసం టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాడు బాపట్ల యానాది కాలనీలో చంద్రబాబు పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ….తుఫాన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, రెండు మూడు రోజులు నీళ్లలోనే ఉన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో యానాదుల పరిస్ధితి దయనీయంగా ఉంది. టీడీపీకి ఓటేశారని సంక్షేమ పధకాలు ఆపేశారని ఓ తమ్ముడు చెబుతున్నాడు. మీకు ఓట్లేయని వారికి సంక్షేమ పధకాలు ఇవ్వరా జగన్ రెడ్డి?
టీడీపీ హయాంలో యానాదుల అభివృద్దికి కృషి చేశాం. విద్య, వైద్యం, ఆరోగ్య పరంగా యానాదులు ఇంకా వెనుకబడి ఉన్నారు.యానాదుల్లో తెలివైన వారున్నారు, ఆ పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని సైతం జయిస్తారు,అంతటి మేధో సంపత్తి వారి సొంతం. యానాదులకు కూడా ప్రభుత్వం అందరిలాగే 25 కేజీల బియ్యం ఇవ్వటం ఏంటి? కనీసం 50 కేజీలు కూడా ఇవ్వలేరా? ప్రభుత్వం మాటలు చెప్తోంది తప్ప పేదలను ఆదుకోవటం లేదు. ప్రభుత్వం తక్షణమే రూ. 20 వేలు ఇవ్వాలి. విపత్తు సమయంలో పేదల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకు? యానాదుల్లో నాయకత్వం పెరగాలి, మీ జీవితాలు మారాలంటే రాజకీయాల్లో కూడా మీ భాగస్వామ్యం ఉండాలి. యానాదుల్ని అభివృద్ది చేసే బాధ్యత నేను తీసుకుంటా, ప్రత్యేక ప్రణాళిక రూపొందించి యానాదుల అభివృద్దికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.