– ఏ కమిషన్లు వచ్చాయని టిక్కెట్ ధరలు పెంచుతున్నారు ?
– ఆత్మగౌరవం ఉంటే కోమటి రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి
– ఒక్కో సినిమాకు ఒక్కో శాఖ నుంచి వేర్వేరు జీవోలు జారీ
– పాలన కూరగాయల దుకాణం నడిపినట్టుగా మారిపోయింది
– కంచె చేను మేసినట్టుగా సీఎం వ్యవహారం
– సినీ పరిశ్రమపై జులుం–కమిషన్ల రాజ్యం
— ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కొందరు పెద్దలు “కంచె చేను మేసినట్టుగా” వ్యవహరిస్తూ, సినీ పరిశ్రమపై జులుం చేస్తూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతీ విషయంలో కమిషన్లు దండుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు.
1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా ప్రదర్శనలు కలెక్టర్ పరిధిలో ఉండాలని, కానీ ఈ ప్రభుత్వం ఒక్కో సినిమాకు ఒక్కో శాఖ నుంచి వేర్వేరు జీవోలు జారీ చేస్తోందని విమర్శించారు. సినిమాటోగ్రఫీ శాఖను పక్కనబెట్టి హోం శాఖ నుంచే సినిమా టిక్కెట్ ధరల పెంపు జీవోలు రావడం అసంబద్ధమని పేర్కొన్నారు. “అన్ని జీవోలు సీఎంఓ ఒత్తిళ్లతోనే వస్తున్నాయి” అని దాసోజు శ్రవణ్ అన్నారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా “తనకు తెలియకుండానే టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు” అని మొదటి ప్రెస్ మీట్లో వెల్లడించారని, అదే విషయంపై హరీష్ రావు న్యాయంగా ప్రశ్నించగానే కాంగ్రెస్ నేతలు ఆయనపై మాటల దాడులు చేయడం దుర్మార్గమని విమర్శించారు.
ముందు కమిషన్లు రాలేదని కోమటి రెడ్డి చెప్పి, ఇప్పుడు తన ‘వాటా’ రాగానే మాట మార్చడం ప్రజలు గమనించలేరని దాసోజు శ్రవణ్ అన్నారు. “రాష్ట్రంలో పాలన కూరగాయల దుకాణం నడిపినట్టుగా మారిపోయింది. ఇది ఏ ప్రభుత్వం?” అని ప్రశ్నించారు.
ప్రభాస్ పెద్దమ్మ మరణ అంశం పేరుతో ‘రాజా సాబ్’ సినిమా పై అనవసరంగా వివాదాలు రేపి, జీవో ఇచ్చినట్టే ఇచ్చి హైకోర్టు స్టే తెప్పించిన తీరు కూడా ప్రభుత్వ దురుద్దేశాన్ని స్పష్టపరుస్తోందని ఆరోపించారు. “ఒక్కో హీరోకి ఒక్కో న్యాయం ఎందుకు?” అని పలికారు. అసెంబ్లీలో “నేను కుర్చీలో ఉన్నంత కాలం టిక్కెట్ ధరలు పెంచనివ్వను” అని రెండు భాషల్లో ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ కమిషన్లు వచ్చాయని టిక్కెట్ ధరలు పెంచుతున్నారని ప్రశ్నించారు.
“సీఎం శాఖ మంత్రిని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆత్మగౌరవం ఉంటే కోమటి రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. సినిమా థియేటర్లలో దోపిడీ జరుగుతుంటే సీఎం, మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేదలకు సినిమా చూసే హక్కు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదని అన్నారు.
“సీఎంను నిలదీయకుండా హరీష్ రావుపై బురదజల్లడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. హోం శాఖను అడ్డం పెట్టుకుని సీఎం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కర్రు గాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి,” అని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.