మెడికవర్పై ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ ఆసుపత్రులపై ఎందుకు లేదు ?

- రెండేళ్లలో టిమ్స్ అల్వాల్‌లో జరిగింది 5 శాతం పనులేనా?
- గతంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని ప్రకటించారు.. ఇప్పుడు కూడా అదే ప్రకటన చేస్తున్నారు
- ప్రభుత్వ ఆసుపత్రులపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఏదీ?
- టిమ్స్ అల్వాల్ను సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్
హైదరాబాద్: టిమ్స్ అల్వాల్ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో కేవలం ఐదు శాతం పనులు మాత్రమే పూర్తి చేసిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. బుధవారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన టిమ్స్ అల్వాల్ను సందర్శించారు.
ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. 2025 జనవరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్‌తో కలిసి టిమ్స్ అల్వాల్ను సందర్శించి 90 శాతం పనులు పూర్తయ్యాయని ప్రకటించారని గుర్తుచేశారు. 2025 ఆగస్టు 31 నాటికి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
అయితే, నవంబర్ 10, 2026న మంత్రి దామోదర రాజనర్సింహ టిమ్స్ అల్వాల్ను సందర్శించి మళ్లీ 90 శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ రెండు ప్రకటనలను బట్టి రెండేళ్లలో పనుల పురోగతి ఎంతమాత్రమే ఉందో అర్థమవుతోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యుల కార్పొరేట్ ఆసుపత్రి మెడికవర్పై ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ ఆసుపత్రులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. టిమ్స్ సనత్‌నగర్‌ను ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వాయిదా వేశారని, ఇప్పుడు టిమ్స్ అల్వాల్ విషయంలోనూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, నాయకురాలు నివేదిత, మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
