ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ప్రజల టాక్స్ సొమ్ములు ఖర్చు చేసి స్థాపిస్తారు. అలా పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వానికి తగిన ఆదాయం రావాలి. అంటే ఆ సంస్థలు సంపాదించిన ఆదాయంలో ఆ సంస్థల ఖర్చులు అంటే ఉద్యోగుల జీతాలు , విద్యుత్, నిర్వహణా ఖర్చులు పోనూ మిగతా ఆదాయం ప్రభుత్వానికి ఇస్తే ప్రజల టాక్స్ సొమ్ము దాని మీద ఖర్చు చేసినందుకు ఆ ప్రజలకు పరోక్షంగా ఆదాయం వచ్చినట్లు..అంటే అలా వచ్చే ఆదాయాల వల్ల ప్రభుత్వం ప్రజల మీద టాక్స్ భారం తక్కువ వేయవచ్చు లేదా ఆ డబ్బులు సంక్షేమ పథకాలకు, మౌలిక సదుపాయాల అంటే రోడ్లు విద్యుత్ మొ. వాటికి ఖర్చు చేయవచ్చు.
అలా కాక ఆ సంస్థలు కనీసం తమ ఖర్చులకు తగ్గ ఆదాయం ప్రతీ సం. సంపాదించగలిగితే ప్రభుత్వం స్థాపించిన సంస్థల వల్ల పోనీ ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా కనీసం కొంత మందికి ఉపాధి చూపిస్తున్నాయి అని సరి పెట్టుకోవచ్చు. అలా కూడా కాకుండా, ఆ ప్రభుత్వ సంస్థ ఆదాయం దాని ఖర్చులకు, జీతాలకు కూడా చాలకపోతే?
మళ్లీ ప్రతీ సం. బడ్జెట్ నుండి అంటే ప్రజల దగ్గర వసూలు చేస్తున్న టాక్స్ మొత్తము లోంచి నిధులను ఈ సంస్థలను పోషించడానికి అంటే వాటి ఉద్యోగుల జీతాలకు ఇతర ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చెయ్యవలసి వస్తే? ఈ నిధులు వాటికి ఇవ్వడానికి కొత్త అప్పులు చేయడమో లేక ప్రజలపై టాక్స్ లు పెంచడమో కొత్త టాక్స్ లు వేయడమే చేయాలి. లేకపోతే ప్రభుత్వానికి మాత్రం వీటికి నిర్వహించడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి?
ఉదాహరణకు మన పాపులర్ వాచ్ సంస్థ HMT తీసుకోండి, దాని వాచీల మార్కెట్ బాగా పుంజుకున్న సమయంలో ప్రభుత్వ అజమాయిషీ వల్ల మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గ మోడల్స్ తీసుకురాలేక, విధానపరమైన నిర్ణయాలలో జాప్యం వల్ల, నూతన ఆలోచనలు, అవిష్కరణలకు తగిన ప్రోత్సాహం లేక, నిధులు సమయానికి అందక, ప్రభుత్వం లో సాధారణంగా ఉండే అలసత్వం, జాప్యం ఉద్యోగుల యూనియన్స్ సమస్యలు అన్ని కలిసి HMT ని ముంచేయగా మరోవైపు ప్రైవేట్ వాచీ సంస్థలు కొత్త మోడల్స్ తో మార్కెట్ లో దూసుకుపోయాయి.
ఉదాహరణకు చూడండి. ప్రైవేట్ రంగం రాక ముందు ఫోన్ కనెక్షన్లు సంపాదించడం దగ్గర నుండి రిపేర్స్ వరకు ఆపై దసరా మామూళ్లు అంటూ BSNL ఉద్యోగులు మనల్ని ఎంత ఎడిపించేవారో గుర్తుకు తెచ్చుకోండి.
సరే! ఇలా నష్టాలు వస్తున్న సంస్థలను ఎన్ని సం.లు ప్రభుత్వం ఆ సంస్థలు నడవడానికి డబ్బులు సాయం చేస్తూ ఉండాలి?
చెప్పలేం. కారణం మళ్ళీ ఆ సంస్థలు లాభాల బాట పట్టే దాకా చెయ్యాలి. ఎప్పుడు లాభాల బాట పడతాయి? అదీ చెప్పలేం. ఎందుకంటే అంతర్జాతీయ, దేశీయ ఆర్ధిక పరిస్థితులు, ఆ సంస్థ తయారు చేస్తున్న వస్తువులు/సేవల నాణ్యత, ప్రజల అవసరాలు, అభిరుచుల్లో మార్పు, టెక్నాలజీ లో మార్పులు ఇలా చాలా చాలా విషయాలు మీద ఆధార పడి ఉంటుంది
ఇక ఎప్పటికి ఇక లాభాలు రాని సంస్థలను?
పూర్తిగా గాని పాక్షికంగా కానీ ఆ సంస్థ వాటాలు అమ్మి వాటి అప్పులు తీర్చి ఆ సంస్థను గాడిలో పెట్టడం. లేదా ఆ సంస్థలు ఇక గాడిలో పెట్టినా మారిన టెక్నాలజీ లేదా మార్కెట్ లేదా ప్రజల అవసరాల/అభిరుచుల మార్పుల దృష్ట్యా మళ్లీ ఒకటి రెండు సం. లలో ఆ సంస్థలు నష్టాల బాట పడతాయి అని అంచనా వేసినప్పుడు వాటిని ప్రభుత్వం పూర్తిగా అమ్మి ఆ డబ్బులు ఏవైనా లాభదాయకంగా కొత్త సంస్థలలో మదుపు చేరడం చేయవచ్చు.
దాని వల్ల ప్రభుత్వానికి అనవసర ఖర్చు తగ్గడమే కాక కొత్త పరిశ్రమల్లో లేదా మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
లేదా పాత సంస్థ లో కొందరు ఉద్యోగులను కొత్త సంస్థ లోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
సరే! నష్టాలు వస్తున్న సంస్థల వాటాలు లేదా వాటిని పూర్తిగా అమ్మేస్తారు. మంచిదే..మరి లాభాలు వస్తున్న సంస్థల్లో వాటాలు పూర్తిగా గానీ పాక్షికంగా కానీ ఎందుకు అమ్మాలి?
– చాడా శాస్త్రి