– బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుంటే ఏం లాభం?
– నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఎట్లా అభివృద్ధి చేస్తారు?
– బీఆర్ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమిటి?
– పొరపాటున ఆ పార్టీలను గెలిపిస్తే… కేంద్ర నిధులను దారి మళ్లిస్తారు
– కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తోంది బీజేపీయే
– బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే…వరదలా నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది
– గంగుల, వినోద్ రావు ముఖాలే మోదీకి తెల్వదు… వాళ్లను చూసి నిధులిస్తారా?
– కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో సీఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్…
కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులెత్తుకుపోయే దొంగ. ఆయనను ఎవరూ నమ్మడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘ఇది నామాట కాదు. రేవంత్ రెడ్డే చెప్పారు.
‘నాకు బజార్ల అప్పు పుట్టడం లేదు. నన్ను ఎవరూ నమ్మడం లేదు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు’ అని ఆయనే చెప్పారు. మరి అట్లాంటి చెప్పుల దొంగకు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయాలి? బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుని ఏం లాభం? నిధులు ఎక్కడి నుండి తీసుకొచ్చి అభివ్రుద్ధి చేస్తారు?’’అని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చ కాంగ్రెస్ నేతలను 6 గ్యారంటీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు వస్తే 10 ఏళ్ల పాలనలో ప్రజలను దోచుకుతిన్నారు. ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నించాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దుర్శేడ్, గోపాల్ పూర్, సప్తగిరి కాలనీ ఉస్మానీ అసోసియేట్స్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 4, 5, 44, 45, 13వ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు భూపతి రవీందర్, చిందెం హారిక, బండి తార, గడప విజయలక్ష్మీ, రెడ్డవేణ లావణ్యలను గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ప్రసంగిస్తూ సీఎంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు.
బీఆర్ఎసోళ్లు 10 ఏళ్లలో చేసిందేమీ లేదు. కబ్జాలు, దోపిడీలు చేసి జైలుకు పోయారు. ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతుంటే వేద్దామా? మళ్లీ గెలిస్తే నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? కేంద్రం నిధులిచ్చినా దారి మళ్లించి దోచుకోకుండా ఉంటారా?…ఆలోచించండి. బండి సంజయ్ ఏం తీసుకొచ్చారు? మేమే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చామని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు.
నేనడుగుతున్నా…మోదీకి కమలాకర్, వినోద్ కుమార్ ముఖం తెలుసా? వాళ్లను గుర్తు పడతారా? వాళ్లు అడిగితే మోదీ ఎందుకు పైసలు ఇస్తారు?
కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే. కరీంనగర్ కు రూ.1500 కోట్ల నిధులు మోదీ ఇచ్చారు. ఈ మధ్య ఢిల్లీ పోయినప్పుడు మోదీ నాతో చెప్పారు ‘బండి… మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించమను. మరిన్ని నిధులు ఇస్తా. అభివ్రుద్ధి చేస్తా’’అని అన్నారు. కరీంనగర్ కు మేయర్ పీఠంవ అప్పగిస్తే వరదలా నిధులను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.
పొరపాటున కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే ఇంటి పన్నులు పెంచుతారు. నల్లా ఛార్జీలు పెంచుతారు. కరెంట్ ఛార్జీల పెంపు ఖాయం. అదే బీజేపీకి ఓట్లేస్తే మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పన్ను పెంచకుండా కేంద్రం నుండే నిధులు తీసుకొచ్చి కరీంనగర్ మరింత అభివృద్ధి చేస్తా.
మొన్ననే కేంద్రం కరీంనగర్ కార్పొరేషన్ కు రూ.50 కోట్లు ఇచ్చింది. ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం నుండి రూ.134 కోట్లు తీసుకొచ్చిన. ఆ డబ్బులతో కరీంనగర్ ను మరింత అభివ్రుద్ధి చేస్తా. నిరంతరాయంగా ఇంటింటికీ నీళ్లు ఇస్తా. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేస్తే ఆ నిధులను దారి మళ్లిస్తారు. అభివృద్ధి కుంటుపడుతుంది. ఆలోచించించి బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నా.