తెలంగాణ గొంతు తడపడానికే కాళేశ్వరం
– ఆంధ్రాలో కట్టిన ఏ రిజర్వాయర్లకు ఏ అనుమతులు లేవు
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ గొంతు తడపడానికే కాళేశ్వరం. సైట్ మార్చడం గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. దురుద్దేశం, దుర్బుద్ధితో నాడు నాగార్జున సాగర్ సైట్ మార్చి శాశ్వతంగా తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పాపం మూలంగా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా గొంతుకోశారు.
సైట్ ఎందుకు మార్చారు అన్నది రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఒక నివేదిక అందజేసింది. తెలంగాణ గొంతు తడపడానికే కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మించారు .. మీడియాను అడ్డుపెట్టుకుని ఎంత బురద జల్లినా భవిష్యత్తులో నిజం ప్రజల ముందు ఉంటుంది. చంద్రబాబు, వైఎస్ ల హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో కట్టిన ఏ రిజర్వాయర్లకు ఏ అనుమతులు లేవు
అన్ని అనుమతులతో నిర్మించిన కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారు. పచ్చబడ్డ తెలంగాణను చూసి ఓర్వలేక పోతున్నారు. తెలంగాణలోని ప్రతి ప్రాజెక్టు మీద చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశాడు. తెలంగాణ విజయాలను వైఫల్యాలు గా చిత్రీకరించడానికి ఒక సెక్షన్ మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది, బనకచర్లను నీళ్లను మలిపేందుకే కాళేశ్వరం మీద కక్ష గట్టారు. అందుకే దానిని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ మీద ఎన్ని కుట్రలు చేసినా వాస్తవాలను భవిష్యత్తు ప్రతిబింబిస్తుంది. ఘోష్ కమీషన్ నివేదికను యథాతథంగా ఎందుకు బహిర్గతం చేయలేదు ? కమీషన్ ఇచ్చిన నివేదిక అనేది ఫైనల్ కాదు దాని మీద కోర్టుకు వెళ్లవచ్చు అని కమీషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ లోనే ఉందన్న విషయం కూడా తెలుసుకోవాలి.
కేసీఆర్ మీద నిందలు మోపడానికి 665 పేజీల ఘోష్ కమీషన్ నివేదికను 60 పేజీలకు కుదించి ప్రచారం చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాను అడుక్కున్నాం పని చేస్తున్నాడు. తెలంగాణ సమాజం నాలుగు దశాబ్దాలు నీటి కోసం తపించింది. నాటి దుర్భిక్ష పరిస్థితులను అధిగమించి కేసీఆర్ నాయకత్వంలో పునర్నిర్మాణం అయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆంధ్రలో కలిపి, తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోక పోవడమే తెలంగాణ దుస్థితికి కారణం.
కాళేశ్వరం, కార్ రేసింగ్, విద్యుత్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లు వేసింది. గతంలో కేంద్రం వేసిన షా కమీషన్ ను అడుగడుగునా కాంగ్రెస్ వ్యతిరేకించింది. కృష్ణా, గోదావరి నీళ్లను మలిపి తెలంగాణకు అందించి ఉంటే ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చేది ? తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్.
తెలంగాణ గోస, బాధలు అర్థం కావాలంటే ఒక కవి చెప్పినట్లు ‘ఆకలి ముందు ఆకాశం చిన్నది’ ఆ ఆకలిని జయించడానికి మొదలుపెట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల.కాళేశ్వరం ఎత్తిపోతలలో మేడిగడ్డలో కుంగింది మూడు పిల్లర్లు అయితే మూడు బ్యారేజీలు కూలిపోయాయని మంత్రి చెప్పడం దుర్మార్గం .. సోయిలో ఉండే మాట్లాడుతున్నారా అర్ధం కావడం లేదు
మేడిగడ్డలో 85 పిల్లర్లలో రెండు ఎక్కువగా ఒకటి పాక్షికంగా దెబ్బతిన్నాయి, అన్నారంలో 66, సుందిళ్లలో 74 పిల్లర్లు ఉన్నాయి. మూడు మినహా మిగతావి అన్నీ బాగానే ఉన్నాయి కదా .. మిగిలిన పంపింగ్ స్టేషన్లు , మిగతావి బాగానే ఉన్నాయి కదా?
దీని రిపేరు చేస్తామని , దానికి అయ్యే రూ.400 కోట్లు తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకు వస్తే ఎందుకు అడ్డుకున్నారు ? పోలవరం రెండు సార్లు దెబ్బతింటే రూ.2 వేల కోట్లు దానికి కేటాయించారు .. ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారు ?
కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు వేయడానికే కమీషన్ వేసి రాద్దాంతం చేస్తున్నారు. ఘోష్ కమీషన్ నివేదిక బయట పెట్టకుండా అధికారుల నివేదిక ఎందుకు బయట పెడుతున్నారు ? కమీషన్ నివేదిక పేరుతో కొన్ని పత్రికల్లో కథనాలు ఎలా వస్తున్నాయి ?
మేడిగడ్డకు బరాజ్ ఎందుకు మార్చారో వందల సార్లు వెల్లడించారు .. నీటిలభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో సైట్ మార్చారు .. సీడబ్లూసీ దానికి ఆమోదం తెలిపింది. ఆంధ్ర ప్రాంతం మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ నిపుణుడు కాని సర్ అర్దర్ కాటన్ ధవళేశ్వరం నిర్మాణం చేశారు
బ్రిటిష్ ప్రభుత్వం దానిని పలుమార్లు వ్యతిరేకించింది.. కానీ కాటన్ పట్టుబట్టి నిర్మించారు .. అటువంటి కాటన్ మీద కూడా ఇంగ్లండ్ ప్రభుత్వం విచారణ జరిపింది. గోదావరి ప్రాంతం ప్రజలు కాటన్ ను దేవుడిగా కొలుస్తున్నారు. కాళేశ్వరం ప్రయోజనాలు చూడాలి కానీ అక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు అంటూ ఆరోపించడం విడ్డూరంగా ఉంది.
కాళేశ్వరం ఎత్తిపోతల ఖర్చు రూ.24 వేల కోట్లు అయినప్పుడే రూ.లక్ష కోట్ల అవినీతి అని కాంగ్రెస్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ తాత్కాలికంగా నిందలు వేసి శునకానందం పొందవచ్చు కానీ భవిష్యత్తులో అది నిలబడదు. కాళేశ్వరం మీద నివేదిక పూర్తిగా బయటపెట్టకుండానే రాజకీయ ఆరోపణలు చేయడం సమంజసమేనా ?
అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల. ప్రాణహిత చేవెళ్లలో తట్టెడు మట్టి ఎత్తకుండా రూ.15 వేల కోట్లు కేటాయించి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. దానిని రూ.38 వేల కోట్లకు పెంచారు .. ఏ పని చేపట్టకుండానే అంచనాలు పెంచుకుంటూ పోయారు? ప్రజల ప్రయోజనాలు, రైతుల సంతోషమే లక్ష్యంగా తెలంగాణలో కేసీఆర్ పాలనలో పనులు చేపట్టాం.
కేసీఆర్ భూగోళం మీద ఎవరూ చేయని తప్పు చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వ్యతిరేకుల ఇష్టం నెరవేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాళేశ్వరం కాలిపోయింది అని చెప్పడంలోనే కాంగ్రెస్ తుళ్లు బయటపడింది.
శ్రీశైలం సొరంగం కూలితే కనీసం శవాలను బయటకు ఎందుకు తేలేదు ? దాని మీద ఎందుకు కమీషన్ వేయలేదు ? ప్రపంచంలోని మానవాద్భుతాలు అన్నీ ప్రజల పట్ల, ప్రాంతం పట్ల, సమస్యల పట్ల ఆర్ధ్రత, ఆలోచన ఉన్న వారివల్లనే సాధ్యం అయ్యాయి .. తెలంగాణ పట్ల కేసీఆర్ కి ఉన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదు.
తెలంగాణలోని వాగులు, వంకల మీద కేసీఆర్ గారికి సంపూర్ణ అవగాహన ఉన్నది కాబట్టే ఒక కాళేశ్వరం నిర్మాణం సాధ్యమయింది. 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదు? ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు చిరుమళ్ల రాకేష్ కుమార్ ,అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.