– వ్యర్థాలను నేరుగా సముద్రంలో కలిపేస్తున్నా కళ్లు మూసుకుంటారేం?
-గాలి, నీటిని కలుషితం చేస్తున్న రాంకీపై పాలకులకు ప్రేమెందుకు?
– రాంకీ భజన ఆపి చర్యల కొరడా ఝళిపించండి
– నోటీసులిచ్చి చేతులు దులుపేసుకున్న పీసీబీ
– మొల్లేటి గడ్డలో రసానికి వ్యర్థ జలాలను తోడించాలి
– రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గని శెట్టి డిమాండ్
– మొలోడుగడ్డలో వ్యర్థ రసానికి జలాలను పరిశీలించిన సీఐటీయు నేత గనిశెట్టి
పరవాడ: ఫార్మా సిటీలో శుద్ధిచేసి సముద్రానికి పంపించవలసిన వ్యర్ధ రసానికి జలాలను సి ఈ టి పి నుండి నేరుగా మొల్లోడు గడ్డలోకి విడుదల చేస్తున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
సోమవారం మొలోడుగడ్డలో వ్యర్థ రసానికి జలాలను ఆయన పరిశీలించారు. ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాంకీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప, చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. వెంటనే వ్యర్ధ రసానికి జలాలను మొల్లోడు గడ్డి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
రాంకీ యాజమాన్యం ల్యాండ్ ఫిల్ నిండిపోవడంతో ఘన వ్యర్ధాలను కూడా కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ లో బహిరంగ ప్రదేశంలో వేసి వేయడం వలన ఈ ప్రాంతం భూగర్భ జలాల నాశనం అవడంతో పాటు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని, తానం పక్కన అక్రమంగా చెరువు తవ్వకాలు చేసి వ్యర్థ జలాలు నిల్వ చేయడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరవాడ, భరిణికం, తానం,తాడి, లంకెలపాలెం,ఈ బోనంగి, సాలాపువానిపాలెం చుట్టూ ఉన్న గ్రామాలు తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తుందని ఒకవైపు కేసు నడుస్తున్న రాంకీ యాజమాన్యం బరితెగించి అక్రమాలకు చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం నేతలు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని రాంకీ యాజమాన్యానికి భజన చేసే కార్యక్రమాలకు స్వస్తి పలకాలని అన్నారు.