– పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, ఆది శ్రీనివాస్‌కు మెదక్ ఎంపి రఘనందన్ సవాల్
– కాంగ్రెస్ 250 మంది సీఎంలను నియమించగా, అందులో 43 మంది మాత్రమే ఓబీసీలు
– 68 మంది బీజేపీ సీఎం లలో 21 మంది ఓబీసీలు
– కూటమిలో ఉన్న 20 మంది సీఎంలలో ఐదుగురు ఓబీసీలు
– బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ సవాల్
సంగారెడ్డి: మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత మూడు రోజులుగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను బహిరంగ చర్చకు ఆహ్వానించారు.
“నాలుగున్నర దశాబ్దాలలో బీజేపీ బీసీల కోసం ఏం చేసిందో నేను గణాంకాలతో చెబుతాను. అదే విధంగా, బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో వారు చెప్పాలి. ఎక్కడైనా, ఎప్పుడు అయినా చర్చకు సిద్ధమున్నాను,” అని ఎంపీ పేర్కొన్నారు.
తెలంగాణలో 56% బీసీలు ఉన్నా, కేవలం ముగ్గురికే మంత్రి పదవులు ఇవ్వడం ఎంతవరకు న్యాయసంగతమో పీసీసీ నేతలు సమాధానం ఇవ్వాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 250 మంది ముఖ్యమంత్రులను నియమించగా, అందులో కేవలం 43 మంది మాత్రమే ఓబీసీలు (17%). బీజేపీ 68 మంది ముఖ్యమంత్రులలో 21 మంది ఓబీసీలు (31%) ను నియమించింది.
మోడీ మంత్రివర్గంలో 21 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేవలం ఇద్దరు ఓబీసీలు మాత్రమే మంత్రులుగా ఉన్నారు. కూటమిలో ఉన్న 20 మంది సీఎంలలో ఐదుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు మైనారిటీలు ఉన్నారు. రాష్ట్రపతిగా దళితులు, గిరిజనులను నియమించిన ఘనత బీజేపీదే. తెలంగాణకు ఇచ్చిన రెండు కేంద్ర మంత్రివర్గ స్థానాల్లో ఓబీసీకి ఒకటి కేటాయించిన ఘనత బీజేపీదే.
“కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల నిజమైన నిబద్ధత ఉంటే, రాష్ట్ర మంత్రివర్గాన్ని పునరాయోజన చేయాలి. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి” అని స్పష్టం చేశారు.