( మోహన్దేవ్ సుకుమార్, డెన్మార్క్)
చాట్ జీపీటీ అన్ని ఉద్యోగాలను త్వరలోనే తానే రీప్లేస్ చేయబోతున్నది. మరి 800 కోట్ల జనాభా ఉపాధి కోసం ఏం చేయాలి?
ఉద్యోగాలు పోవు అని రాయాలనుంది, కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా ‘జనాలు ఇలానే మాట్లాడుకుంటారులే’ అని అనుకునేవాడిని. ఈసారి అలా తీసిపారెయ్యలేకపోతున్నా. ఎందుకంటే ఇది నా ఫీల్డ్. ఏ స్థాయిలో ఈ టెక్నాల జీ విధ్వంసం ఉండబోతోందో నాకు ముందే ఒక అవగాహన ఉంది. కారణాలు వివరంగా ఉదాహరణలతో చెప్తాను.
OpenAI యొక్క ChatGPT వెనుక ఉన్న మోడల్ GPT-3 (జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ 3) ఆర్కిటెక్చర్. ఇది విస్తృత శ్రేణి టెక్స్ట్ ఇన్పుట్లకు మానవ-వంటి ప్రతిస్పందనలను ఇవ్వడానికి లోతైన అభ్యాస అల్గారిథమ్లను మరియు విస్తారమైన టెక్స్ట్ డేటాను ఉపయోగిస్తుంది. Gpt3 ఆర్కిటెక్చర్ ని డెవలప్ చేస్తున్న కంపెనీలు చాలానే పుట్టుకొస్తున్నాయి. Suki , Jarvis , Texito అంటూ చాలా కంపెనీలు gpt ని మించిన టెక్నాలజీలని తయారుచేసే పన్లో ఉన్నారు.
Chatgpt ని చాలా పద్దతిగా తయారుచేసారు – ఎక్కడా అసభ్యకరమైన ప్రశ్నలని ఎంటర్టైన్ చెయ్యలేదు, సొల్లు లేకుండా సూటిగా సమాధానాలిస్తోంది. ఎప్పటికప్పుడు మన నుంచి నేర్చుకుంటోంది కూడా. మనకి ఈ టెక్నాలజీ వల్ల లాభమే గాని నష్టం లేదు.
chatgpt ఒక్కటే ఐతే పెద్దగా కంగారు పడక్కర్లేదు. ప్రాబ్లెమ్ ఏంటంటే చాలా విభిన్నమైన టెక్నాలజీల కలయికతో ప్రమాదం పొంచివుంది.
Metaverse : ఆగ్మెంటేడ్ రియాలిటీ, వర్చ్యువల్ రియాలిటీ గురించి తెలుసు కదా. ముద్దుగా XR అంటాం. తెలియని వాళ్ళకోసం క్లుప్తంగా చెప్పాలంటే.. ఒక కళ్ళజోడు పెట్టుకుని, మన ఇంట్లో కూర్చుని కూడా మరొక ప్రపంచం లోకి వెళ్లేలా చేసే మాధ్యమం. XR లో మరో ముందడుగు Metaverse. ఈమధ్య ఒక కంపెనీ టెక్ మీట్ కి వెళ్ళాను. అది పేరుకి పైపుల కంపెనీ అయినప్పటికీ XR లో నిష్ణాతులు. ప్రపంచంలో ఏ మూలనున్నా వారి నియామకాలు, ట్రైనింగ్, మీటింగులు అన్నీ .. కళ్ళజోడు పెట్టుకుని వేరే ప్రపంచం లోకెళ్ళి చేసుకుంటున్నారు. దీని వల్ల ప్రయాణ ఖర్చులు, సమయం వగైరా ఆదా చేసుకుంటున్నారు. అక్కర్లేని ఉద్యోగులను కూడా పీకేస్తున్నారు కాస్ట్ కటింగ్ లో భాగంగా. ఇందులో AI ని కరెక్ట్ గా వాడితే.. నా సామిరంగా .. బార్బర్ షాప్ లో వెంట్రుకలు వూడినంత తేలిగ్గా ఉద్యోగాలు పోతాయి.
gpt ని ఆధారం చేసుకుని జావాస్క్రిప్ట్ వెబ్ డెవలప్మెంట్ framework ని సృష్టిస్తే, వెబ్ డెవలపర్ ఉద్యోగాలు గాల్లో కలిసిపోతాయి.
Algo ట్రేడింగ్: స్టాక్ మార్కెట్ ని అర్ధం చేసుకునే అల్గోరిథమ్స్ వల్ల నష్టాలు లేని ట్రేడింగ్ సాధ్యం. కానీ దీనివల్ల stock బ్రోకర్లు, ఫైనాన్సియల్ అనలిస్టుల అవసరం పెద్దగా ఉండదు.
AI ఎడ్యుకేషన్: గూగుల్ వాళ్ళ VideoBERT కూడా gpt ఆధారిత మోడల్. మీరు టెక్స్ట్ రాస్తే వీడియో తయారు చేస్తుంది. ఈ టెక్నాలజీ ని సరిగ్గా వాడితే unacademy , బైజూస్ వంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు దివాళా తీస్తాయి.
ఒక వంద మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెయ్యాల్సిన పనిని ChatGPT సహాయంతో పది మంది చెయ్యొచ్చు . కాబట్టి చాట్ gpt వల్ల భారీ ఎత్తున ఉద్యోగాలు పోయే అవకాశం లేకపోలేదు.
AI అంటే సినిమాల్లో చూపించినట్టు టెర్మినేటర్ రోబోట్లు వచ్చి మనుషుల మీద దాడి చేస్తాయనుకోవడం లేదు.
సమస్యల్లా మనుషులతోనే. నాకు మనుషుల మీద నమ్మకం లేదు. చాలీచాలని వనరుల కోసం జరిపే వేటలో లాభాపేక్షకి పోయి మనుషులే మనుషుల్ని అంతం చేసుకుంటారేమో అని నా భయం. లాభాల కోసమే కంపెనీలు పనిచేస్తాయి. లాభాలుంటేనే వారి స్టాక్ లు పదిలంగా ఉంటాయి. అంతవరకే వారికి అవసరం. ఉద్యోగులు ఎలా చచ్చినా వారికి సంబంధం లేదు. ప్రభుత్వాలు కూడా చేసేదేం ఉండదు.
ముక్కుసూటిగా చెప్పాలంటే Chatgpt వల్ల ఉద్యోగాలు పోవు. మనుషుల స్వార్దానికి, అత్యాశలకి, ఆశయాలకి కచ్చితంగా పోతాయి.
ఇప్పుడు ప్రశ్నకి రెండో భాగం.. ఉపాధి కోసం ఏంచెయ్యాలి?
ఎవరికి వారే ఉపాధిని సృష్టించుకోవాలి.
టెక్నాలజీలని వాడుకుని ఉద్యోగులకి పని ఒత్తిడి తగ్గించే, మానవతా విలువల్ని పెంచే కంపెనీల ప్రోడక్ట్స్ ని మాత్రమే వాడేలా మనం ఆలోచనలు చెయ్యాలి.
ఉద్యోగుల్ని రీసోర్స్ లా కాకుండా మనిషిగా చూసేలా ప్రభుత్వాలు నిబద్దతతో విధానాలు తీసుకు రావాలి.