Suryaa.co.in

Telangana

ఈ పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా?

మనం చేయాల్సింది చేశాం
ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలే అవుతోందని, ఈ పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? అయినా ఈ కాలంలో మనం చేయాల్సింది చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు.

ఈ ప్రభుత్వం కష్టం మీద వచ్చిందని చెప్పడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం ద్వారా, మా తలరాతను మార్చి పెద్ద బాధ్యతలు ఇచ్చారని, కాబట్టి విషప్రచారాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీదే అన్నారు. నల్లచట్టాలు తెచ్చిన మోదీ, వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

213 అంబులెన్స్‌లు ప్రారంభం
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో గల హెచ్ఎండీఏ మైదానంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 213 అంబులెన్స్‌లను ప్రారంభించారు. 108, 102 వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత విద్య, వైద్యం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ రెండింటిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఏడాదిలోపు తమ ప్రభుత్వం వైద్యశాఖలో 14 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. వైద్య శాఖ బలోపేతమైతేనే ఆరోగ్య తెలంగాణ నిర్మాణమవుతుందన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున వైద్య శాఖలో ఎవరూ భర్తీ చేయలేదన్నారు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజమే తమ కుటుంబం అనుకొని తాము ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

LEAVE A RESPONSE