– రవిని నిర్బంధించ లేదని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కాణిపాకంలో ప్రమాణం చేస్తారా?
– బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్
బి.టెక్ రవిని పోలీసులు నిర్బంధించడంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశాను. 3 గంటలు పాటు బి. టెక్ రవిని నిర్బంధించ లేదని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సవాల్ చేశారు. నేను ఆరోపణలు చేశారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అంటున్నారని, ఎస్పీ ఆ విధంగా నాపైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అరెస్ట్‌పై తాను అవాస్తవాలు చెప్పానని కడప ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం దారుణమన్నారు. సీఐ అశోక్ రెడ్డి తన శక్తి సామర్ధ్యాలు ఉపయోగించి ఎస్పీ తో ప్రెస్‌మీట్ పెట్టించారని సీఎం రమేష్ ఆరోపించారు.
కడపలో సీఐ అశోక్ రెడ్డి.. ఐజీ రేంజ్ పవర్స్ చూపిస్తున్నాడని తాను గతంలోనే చెప్పానన్నారు. బీటెక్ రవి అరెస్ట్ తీరుపై మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. ఆధారాలతో కేంద్రహోమ్ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు. తనకు లీగల్ నోటీసిస్తే సరైన సమాధానం చెబుతానన్నారు. బీటెక్ రవి కడప జిల్లాలోనే ఉన్నాడని.. 10 నెలల నాటి ఓచిన్న కేసును నాన్ బెయిలబుల్‌గా మార్చి ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కడప ఎస్పీ గారు.. మీరు యువ ఐపిఎస్ అధికారి.. మీకు మంచి భవిష్యత్ ఉంది. వివాదాలు వద్దు అని సీఎం రమేష్ సూచించారు. ’ఎస్పీ నాకు లీగల్ నోటిసు ఇస్తామన్నారు. ఇస్తే ఎస్పీ కి సరైన సమాధానం ఇస్తాను.సీఐ అశోక్ రెడ్డి అవినీతి, అక్రమాలకు చేసిన సెటిల్మెంట్లపై ఆయన చేసిన అక్రమాలపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అన్నారు.