– టీడీపీ హయాంలోని ఆ పరిస్థితులు పునరావృతం కావు
– రెక్కీ, దాడులు చేయాలనే నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి
– లేదంటే సీఎం జగన్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి, డిసెంబర్ 28: వంగవీటి రాధాకృష్ణకు ఎటువంటి హాని జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా పాయింట్ మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. నా తమ్ముడు వంగవీటి రాధాకృష్ణతో కలిసి గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరు గ్రామంలో జరిగిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ తనకు హాని తలపెట్టే కార్యక్రమాలు కొంత మంది చేస్తున్నారని, రెక్కీ కూడా నిర్వహించారని చెప్పారన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళానని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని ఇంటిలిజెన్స్ డీజీని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.
వంగవీటి రాధాకృష్ణకు టూ ప్లస్ టూ గన్మెన్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాధాకృష్ణ దగ్గర ఇంకేదైనా సమాచారం ఉంటే ప్రభుత్వం, పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో ఏ వ్యక్తికైనా హాని కలుగుతుందన్న భావన ఉంటే వెంటనే తెలియజేయవచ్చన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వంగవీటి మోహనరంగా అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితులు పునరావృతం కావని చెప్పారు. వంగవీటి రాధాకృష్ణ తగిన ఆధారాలతోనో లేక తనకు వచ్చిన అనుమానంతోనో మాట్లాడినప్పటికీ సీఎం జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించి గన్ మెన్లను ఏర్పాటు చేశారన్నారు. వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ నిర్వహించడం, దాడులు చేయాలని నిర్ణయించుకుంటే వాటన్నింటినీ వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
గుడివాడ నియోజకవర్గంలో రంగా విగ్రహావిష్కరణ అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా పలు విగ్రహాలను ఆవిష్కరించేందుకు రాధాకృష్ణ వెళ్ళిపోవడం జరిగిందన్నారు. ఆ తర్వాత రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై రాధాకృష్ణతో ఫోన్లో కూడా మాట్లాడానని చెప్పారు. రాధాకృష్ణ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అనుమానాలు ఉన్నా వెంటనే ప్రభుత్వానికి, పోలీసులకు తెలియజేయాలని సూచించారు. రాజకీయాల్లో రాధాకృష్ణకు ఓనమాలు నేర్పి చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి లేదన్నారు. వంగవీటి మోహనరంగాకు మొదటి నుండి అభిమానిగా, ఆయన విగ్రహాల ఏర్పాటు, రంగా పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలోనూ తాను పాల్గొంటూ వస్తున్నానన్నారు.
గుడివాడ నియోజకవర్గంలో జరిగిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి మాత్రమే రాధాకృష్ణకు, తనకు మధ్య చర్చ జరిగిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తాను కోరలేదని, రాధాకృష్ణ కూడా వస్తానని చెప్పలేదన్నారు. రాజకీయాల్లో కొనసాగుతున్న విభిన్నమైన వ్యక్తులు కలిసినపుడు వారి గురించి పత్రికల్లో, మీడియాలో ఒక్కోసారి ఊహాగానాలు వస్తుంటాయని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ రావాలనుకుంటే ఆయనే చెబుతారని, వెంటనే ఆ విషయాన్ని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నాకు రాధాకృష్ణ మిత్రుడని, గుడివాడ నియోజకవర్గంలో జరిగిన రంగా విగ్రహావిష్కరణలో కలిశామని, దానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.