– ప్రభుత్వానికి చేతనైతే మళ్లీ సుప్రీంకోర్టుకే వెళ్లాలి
– ‘సిట్’ రిపోర్ట్ తప్పు అని సుప్రీంకోర్టుకు చెప్పాలి
– ఆ విషయాన్ని పక్కాగా రుజువు చేయాలి
– నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని సిట్ తేల్చేసింది
:- వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు, చేపనూనె కలిపిన నెయ్యి వాడారని పచ్చి గత వైయస్సార్సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్న సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా దొరికిపోయి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్, నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని చెప్పినా, మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్ రిపోర్ట్ తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అక్కడ రుజువు చేయాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్ చేశారు.
సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారుల్ని సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం అసాధారణ విషయం. వారి దగ్గరి నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ చేశామని కేబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చిన మంత్రులు చెప్పారు. చంద్రబాబును కాపాడటానికి, ఆయన చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చడానికే వీళ్ల ప్రయాస.
సిట్ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జిషీట్లో కానీ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయినా చంద్రబాబు ఈ ఛార్జిషీట్‌పై సంతృప్తి చెందకుండా ఇవాళ కేబినెట్ సమావేశంలో నెయ్యి విషయంలో ప్రత్యేక విచారణ చేపడుతున్నట్లు మంత్రులతో బయట ప్రకటన చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టు కాకుండా, మళ్లీ విచారణ చేయించాలన్న నిర్ణయం పూర్తిగా తప్పు.
నెయ్యిలో కల్తీ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సిట్ విచారణ 2019–24 మధ్య కాలానికి వేశారు. ఇందులో నిందితులుగా తేలిన ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి 2024 వరకూ నెయ్యిని అనేకసార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే, మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయించాలి. ఆ రోజు 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేసిన డెయిరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం.
విభజిత రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018, ఆగస్టు 27న టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం 87 వేల కేజీల నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్‌ను కలిపిన నెయ్యిని రోజుకు 975 కేజీల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రోజున మీరు వాడిన నెయ్యి కల్తీ నెయ్యి కాబట్టే వాసన రాలేదు. అందుకే ఏకంగా రూ.3.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్లేవర్ కలిపారు.
అప్పటి జేఈవో అధ్యక్షతన పని చేసిన ఈ కొనుగోలు కమిటీలో విజయ్‌భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథ్ వంటి సాంకేతిక నిపుణుల్ని నియమించారు. వారే ఆ తర్వాత మా హయాంలోనూ కొనసాగారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్ నిందితుల్లోనూ ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జీఎం కూడా టీడీపీ హయాంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే టెంపుల్ అఫైర్స్ ఏవో, ఎస్వీ గోశాల డైరెక్టర్ కూడా మొన్నటి వరకూ ఉన్నారు. వీళ్లంతా నెయ్యిని కొనాలని నిర్ణయించి, పలమనేరుకు చెందిన పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి నుంచి కేజీ నెయ్యి రూ.385 చొప్పున కొనుగోలు చేశారు.
అప్పటికే రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే కాలంలోనే ప్రతి రోజూ 975 కేజీల నెయ్యికి ఫ్లేవర్ అద్దడానికి వీళ్లు చేసిన దుర్మార్గం ఇది. 2018, ఆగస్టు 28న చేసిన టీటీడీ తీర్మానం 374 ఇందుకు నిదర్శనం. 2014 నుంచి ఇదే సీబీఐ దర్యాప్తు వేయించే ధైర్యం మీకు ఉందా? టీటీడీని రాజకీయ పావుగా వాడుకోకపోతే మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసిన వాళ్లు, కొనుగోళ్లు చేసిన వాళ్ల మీద విచారణ చేయించండి.
ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటున్నారు. సిట్ ఏర్పాటు చేశాక జంతుకొవ్వు విమర్శలు చేసిన మీరు ఆయన్ను రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారు? నెయ్యి పేరుతో అనిల్ సింఘాల్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారిపై భక్తి ఉంటే, ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకపోతే.. మీ హయాం నుంచే జరుగుతున్న నెయ్యి కల్తీపై విచారణ చేయించమని కోరుతున్నాం.
మా హయాంలో నాణ్యత లేని 18 నెయ్యి ట్యాంకర్లను మేం వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా 14సార్లు కూడా ఇలాంటి నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపింది. సీఎస్ఆర్టీఐ రిపోర్టులు వచ్చాక ఛైర్మన్‌కు అందిస్తే ఆయన కళ్లు మూసుకున్నారని ఎలా చెప్తారు? టీటీడీ పాలక మండలి తనకున్న అధికారాల్ని ఈవోకు బదలాయించిన విషయం మీకు నిజంగా తెలియదా? అధికారులు ఈవోను కలవకుండా ఛైర్మన్‌ను ఎలా కలిశారు?.
సీబీఐ నివేదిక మీద విచారణ చేసే అధికారం మీది కాదు కోర్టుది. కానీ నేరస్తుల్ని మేమే గుర్తించామంటూ విచారణలకు సిద్దమవుతున్నారు. ఇలాంటి తీర్పులు ఇచ్చే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, నెయ్యిలో ఫ్లేవర్ కలపాలన్న నాటి టీటీడీ బోర్డు నిర్ణయానికి సమాధానం చెప్పాలి. మళ్లీ చెబుతున్నాం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై, మరో విచారణ జరిపించే అధికారం మీకు లేదు.