– వంగవీటి హంతకులపై వైసీపీ కొత్త చర్చ
– టీడీపీని దోషిగా చూపించే వ్యూహం పారుతుందా?
– పాతకథను కాపులు కొత్తగా గుర్తు చేసుకుంటారా?
– పార్టీలు మారిన పాత్రలతో పాత కథ హిట్టవుతుందా?
– పవన్‌పై వైసీపీ ‘రంగా అస్త్రం’ సక్సెస్ అవుతుందా?
– వంగవీటి, దేవినేని కుటుంబాల సంగతేమిటి?
– రంగా బద్ధవ్యతిరేక దేవినేని కుటుంబం ఇప్పుడు వైసీపీలో
– రంగాను చంపారంటున్న టీడీపీలో వంగవీటి కుటుంబం
– రంగా హత్య సమయంలో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఇప్పుడు వైసీపీలో
– మారిన పాత్రలతో జనాలను నమ్మించడం సాధ్యమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొన్నేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రాన్ని అట్టుడికించి.. ఏకంగా గద్దెనెక్కిన ఒక పార్టీనే అధికారం నుంచి పెకిలించి వేసిన వంగవీటి రంగా పాత కథను, మళ్లీ కొత్తగా తెరకెక్కించేందుకు వైసీపీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. నాటి టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న వంగవీటిని, ఎన్టీఆర్ జమానాలో దారుణంగా హత్య చేసిన వైనం ఉమ్మడి రాష్ట్రాన్ని అట్టుడికించింది. రంగా హత్యతో ఆగ్రహోదగ్రులైన కాపులు, కోస్తాలోని కమ్మ వర్గానికి చెందిన ఆస్తులను దహనం చేశారు. వంగవీటి-దేవినేని కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన.. రంగా హత్య-తదనంతర హింసాత్మక పరిణామాలు, కోస్తా చరిత్రలో ఇప్పటికీ మరచిపోలేని విషాద ఘటన.
ఇప్పుడు వైసీపీ మళ్లీ ఆ ఘటనను గుర్తుచేసే రాజకీయ వ్యూహానికి తెరలేపింది. పాత గాయాన్ని గుర్తు చేసి ‘కుల’కలం సృష్టించే పనిలో ఉంది. ‘‘రంగాను చంపిన వాళ్లతో కలుస్తారా’’? అంటూ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ భుజంపై తుపాకి పెట్టి.. టీడీపీని పేల్చే ఎత్తుగడతో, పాత కథను కొత్తగా గుర్తుచేసే మాటల యుద్ధం మొదలుపెట్టింది. మరి వైసీపీ కొత్తగా చెబుతున్న పాత ‘వంగవీటి కథ’ సక్సెస్ అవుతుందా? అలాగయితే మారిన పరిణామాలతోపాటు.. మారిన వంగవీటి-దేవినేని కుటుంబాల రాజకీయ పాత్రల సంగతేమిటి? అసలు ఇప్పుడు కాపులలో నాటి కసి ఉందా? అంతిమంగా అది టీడీపీ-జనసేన కొత్త కాపురంలో చిచ్చు పెట్టేంత ప్రభావం చూపిస్తుందా? అన్నదే ప్రశ్న.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేనాధిపతి పవన్ కల్యాణ్ తాజా కలయిక ఆంధ్ర రాజకీయాల్లో కీలక మలుపు అన్నది నిస్సందేహం. పొత్తులు- సీట్లు-సర్దుబాట్లు పక్కనపెడితే, కలసి కదం తొక్కుదామంటూ చేసుకున్న తీర్మానం, జగన్ సర్కారుపై జమిలి పోరాటం చేద్దామన్న బాసలు, అధికార పార్టీని కుదిపివేసేవే. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది పక్కనపెడితే.. టీడీపీ-జనసేన కలయిక మాత్రం నిన్సందేహంగా సంచలనమే.
కమ్మ వర్గం సంగతి అటుంచితే.. కాపుల్లో మాత్రం, ఈ పరిణామం కొత్త ఊపు-ఉత్సాహాన్నిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు తాజా పల్నాడు పర్యటన సందర్భంగా, టీడీపీ-జనసేన జెండాలు కలసి కనిపించడం చూస్తే.. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీ శ్రేణుల మైండ్‌సెట్ కలసినట్లేనన్నది స్పష్టమయింది. అంటే టీడీపీ-జనసేన పొత్తు పొడిచినట్లే లెక్క.
సహజంగా ఇలాంటి ఆకస్మిక పరిణామాలు అధికార పార్టీకి కలవరం కలిగించేవే. రెండు పార్టీలూ కలుస్తాయని.. అధికార వైసీపీ చాలాకాలం నుంచి అంచనా వేస్తున్నప్పటికీ, అది ఇంత వేగంగా జరుగుతుందని మాత్రం అంచనా వేయలేదు. మంత్రులు- కాపు నేతలంతా, మూకుమ్మడిగా పవన్ కల్యాణ్‌పై చేసిన మూకుమ్మడి దాడి, బూమెరాంగయిన ఫలితంగా బాబు-పవన్ ఏకం కావడం వైసీపీకి షాక్ కలిగించింది.
ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన బంధాన్ని బ్రేక్ చేయడానికి రంగంలోకి దిగిన వైసీపీ, ఊహించని విధంగా ‘వంగవీటి రంగా కార్డు’ ప్రయోగించడం ఆసక్తికరంగా మారింది. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ ఎలా కలుస్తాడు? అన్న ప్రశ్నాస్త్రాలతో వైసీపీ కొత్త కోణంతో రంగంలోకి దిగిన నేపథ్యంలో, వైసీపీ వ్యూహం ఫలిస్తుందా అన్న చర్చకు సహజంగానే తెరలేచింది. బాబు-పవన్ కలయిక తర్వాత.. కాపు మంత్రులు, మాజీ మంత్రులంతా వరసపెట్టి ఇదే అస్త్రం సంధిస్తుండటం గమనార్హం.
అయితే.. వంగవీటి రంగా హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీరామారావు. ఆ సమయంలో దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు టీడీపీలోనే ఉన్నారు. దేవినేని-వంగవీటి కుటుంబాల మధ్య ప్రతీకార హత్యలు, దాడులు-ప్రతి దాడులు చాలా జరిగాయి. రంగా సోదరుడు రాధా- నెహ్రు సోదరుడు మురళి, ప్రతీకార దాడుల్లో హత్యకు గురయ్యారు. వసంత నాగేశ్వరరావు కూడా అప్పుడు టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో వంగవీటి రంగా కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇదీ.. వంగవీటి-దేవినేని కుటుంబాలకు సంబంధించిన కథ.
తర్వాత జరిగిన పరిణామాల్లో రంగా భార్య రత్నకుమారి, అనూహ్యంగా టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రంగా కుమారుడు రాధాకృష్ణ కాంగ్రెస్‌లో చేరి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రంగా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉండటం ప్రస్తావనార్హం. రంగా శత్రువయిన దేవినేని నెహ్రు, తదనంతర పరిణామాలలో కాంగ్రెస్‌లో చేరారు.
ఆ తర్వాత చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో.. దేవినేని నెహ్రు, తన కుమారుడు అవినాష్ సహా టీడీపీలో చేరారు. అవినాష్ తెలుగుయువత అధ్యక్షుడిగా కూడా పనిచేయడంతోపాటు, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అవినాష్ ఆ పార్టీలో చేరిపోయారు. ఇవీ.. రంగా హత్య తర్వాత, వంగవీటి-దేవినేని కుటుంబాల్లో చోటు చేసుకున్న రాజకీయ విచిత్ర పరిణామాలు.
ఇక రంగా హత్య సమయంలో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి .. ప్రస్తుతం వైసీపీలో,నామినేటెడ్ చైర్మన్ పదవి అనుభవిస్తున్నారు. రంగా హత్య సమయంలో టీడీపీలో ఉన్న వసంతనాగేశ్వరరావు కుటుంబం ఇప్పుడు వైసీపీలో ఉంది. వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్,
మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వంగవీటి రంగాతో కలసి, కాపు ఉద్యమం నిర్వహించిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇది మరో రాజకీయ వైచిత్రి.
ఈ నేపథ్యంలో… వైసీపీ నాయకత్వం ఆడుతున్న రంగా గేమ్- సంధిస్తున్న కాపు కార్డును, కాపు జాతి ఎలా అర్ధం చేసుకుంటుందన్నది ప్రశ్న. వైసీపీ మంత్రులు ఏ రంగా హత్య గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారో, అదే రంగా కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. ఏ రంగా కుటుంబానికి వ్యతిరేకంగా, అప్పట్లో ముఠా రాజకీయాలు నడిపిన దేవినేని కుటుంబం నుంచి వచ్చిన అవినాష్ , ఇప్పుడు వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంటే.. ఆ ప్రకారంగా ఇప్పుడు కాపులకు శత్రువులెవరు? మిత్రులెవరు? రంగాను ప్రేమించింది ఎవరు? ద్వేషించింది ఎవరు? అసలు రంగా హత్యకు కారణమైన కుటుంబం ఇప్పుడు ఏ పార్టీలో ఉంది? రంగా కుటుంబంతో ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవినేని కుటుంబమా? లేక హత్యకు గురయి, తర్వాత టీడీపీలో చేరిన వంగవీటి కుటుంబమా? అన్నది మరో ఆసక్తికర అంశం.
ప్రస్తుతం దేవినేని అవినాష్ కుటుంబం వైసీపీలో ఉన్నందున.. రంగాను వ్యతిరేకించిన దేవినేని కుటుంబాన్ని పక్కన పెట్టుకుని, రంగా హత్య గురించి కాపు మంత్రులు మాట్లాడితే కాపు జాతి నమ్ముతుందా? రంగా హత్య సమయంలో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన భార్య లక్ష్మీపార్వతి కూడా వైసీపీలోనే ఉన్నారు. మరి లక్ష్మీపార్వతిని పక్కనపెట్టుకుని, రంగా హత్య గురించి మాట్లాడితే కాపులు నమ్ముతారా?
రంగాను వ్యతిరేకించిన దేవినేని కుటుంబం- అప్పుడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీపార్వతి, ఇద్దరూ వైసీపీలోనే ఉన్న నేపథ్యంలో.. జనసేన ఆ బంధాన్ని ముడిపెడుతూ ఎదురుదాడి చేస్తే, అప్పుడు వైసీపీ ఆత్మరక్షణలో పడదా? అన్నది మరో సందేహం. రంగాపై కాపుమంత్రులకు చిత్తశుద్ధి ఉంటే.. వైసీపీలో ఉన్న అవినాష్-లక్ష్మీపార్వతిని పార్టీ నుంచి తొలగించాలని జనసేన ఎదురుదాడి చేస్తే, అప్పుడు వైసీపీ ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో చూడాలని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.