– టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
అర్థరాత్రిళ్ళు గోడలు దూకివెళ్ళడం, గునపాలతో గొళ్ళెం పగలగొట్టి ఇళ్లలోకి చొరబడటం, ఇంట్లోని మనుషుల్ని ఎత్తుకెళ్ళడం వంటి దోపిడీ దొంగల సంస్కృతిలోకి రాష్ట్ర పోలీసులు వెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అమరావతి మండలం, ధరణికోటకు చెందిన వెంకటేశ్ అనే ఒక సామాన్య యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిని, మరో వ్యక్తి సాంబశివరావును పోలీసులు అర్థరాత్రి ఇంటిపై పడి అరెస్టు చెయ్యడం దారుణం. ప్రభుత్వ అసమర్థపాలనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అరెస్టుచేస్తారా? వాళ్లేమన్నా ఖునీకోరులా? తీవ్రవాదులా?
ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించడం నేరం కాదు…అరెస్టు సమయంలో పోలీసులు లైట్లు పగులగొట్టి చీకట్లో చేసిన విధ్వంసమే నిజమైన నేరం. ప్రభుత్వ పెద్దల మన్నన కోసం బరితెగిస్తున్న పోలీసు అధికారులు తప్పక మూల్యం చెల్లించుకుంటారు. సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వెంకటేశ్, సాంబశివరావులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కోర్టులు హెచ్చరించినా అతి పోకడలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఖచ్చితంగా తమ చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.