Suryaa.co.in

Andhra Pradesh

విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పని చేస్తా

• దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు
• గత ప్రభుత్వంలో నాశనం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పని చేద్దాం
• ఉద్యోగులను చిన్నచూపు చూడను.. వారి నా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాను
• సమస్యలను వినేందుకు, వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరిచేందుకు కృషి
• సమస్యలను చెప్పడమే కాదు… ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం సూచించండి
• పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో సమావేశం అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ… వాటిని నోట్ చేసుకున్న పవన్ కళ్యాణ్

మంగళగిరి: ‘భారత దేశం మెచ్చేలా, జాతి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దాం… దీనికి నేను కంకణబద్ధుడినై పని చేస్తాను. నా ఒక్కడి వల్లనే ఈ మహా క్రతువు పూర్తి కాదు. ఉద్యోగుల సహకారం, సూచనలు నాకు చాలా అవసరం. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నాను’ అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖామాత్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు పతనం అయ్యాయి అన్నారు. వాటిని తిరిగి గాడిలోపెట్టడం సాధారణ విషయం కాదు.. అయినా ప్రజలకు ఉపయోగపడేలా వ్యవస్థలకు మళ్లీ జీవంపోసేలా బలమైన సంకల్పంతో పని చేస్తానని ఉద్ఘాటించారు.

మంగళవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.

శాఖల్లోని సమస్యలు, గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిలు, వారి పదోన్నతులు, ఇతర శాఖాపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ కి నివేదించి, వాటి వివరాలను ప్రత్యేకంగా తెలియజేశారు. వీటిని ఆసాంతం విన్న ఉపముఖ్యమంత్రి వాటిని ప్రత్యేకంగా నోట్ చేసుకున్నారు.

వ్యవస్థలను ఎంత తీవ్రంగా దెబ్బ తీశారో శ్వేత పత్రాల ద్వారా వెల్లడిస్తాం
వినతి పత్రాలను స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా దెబ్బ తీశారనేది… వ్యవస్థలను ఎంత నాశనం చేశారనే విషయాలను, కీలక శాఖల్లోని వాస్తవాలను ప్రజల ముందుపెట్టేందుకు శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తాము. పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తాను. ఎంతో ఇష్టంతోనే ఈ కీలకమైన శాఖలను తీసుకున్నాను. వ్యవస్థ మొత్తం అద్భుతంగా పని చేసేలా ముందుకు తీసుకెళ్తాను.

సరైన నాయకత్వం లేకపోతే వ్యవస్థలు ఎలా నాశనం అవుతాయో గత ప్రభుత్వ పాలకులు ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. మళ్లీ వ్యవస్థలను గాడిలోపెట్టేందుకు, అవి పూర్తిగా ప్రజల కోసం పని చేసేలా తయారు చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేద్దాం. ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ, సాధక బాధకాలను అర్థం చేసుకుంటూ పునరుత్తేజం కలిగించేలా పాలన ఉంటుంది.

వింటాను… ఆలోచిస్తాను… పరిష్కారం చూపుతా
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. వారికి నేను ప్రత్యేకంగా గౌరవం ఇస్తాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. ఒకటో తేదీన జీతం రాకపోతే ఎంత కష్టమో కూడా అర్థం చేసుకోగలను. నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాత్రికి రాత్రి అద్భుతాలు చేసేస్తాను అని చెప్పను. ఉద్యోగుల వేదన వింటాను.

వారి సూచనలను స్వీకరిస్తాను. మొదట మీ బాధలు ఆసాంతం వినేందుకు ప్రయత్నిస్తాను. అప్పటికప్పుడు పూర్తి చేసే సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తాను. ఓ సగటు సాధారణ మధ్య తరగతి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన స్థాయిని నేను ఎప్పుడు మరిచిపోను. మీ కష్టాలు అన్ని నాకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనే కష్టాలను నా కుటుంబంలోని కష్టాలుగానే చూస్తాను.

గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది.. మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం
పెను తుపాను తర్వాత మళ్లీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. రాష్ట్రానికి అలాంటి సమయం ఇది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పాలకులు, ఉద్యోగులు పని చేసి వ్యవస్థలను నిలబెట్టాలి. ప్రజలకు పూర్తిస్థాయిలో వాటి సేవలు అందాలి. దీనికి ఏం చేద్దాం అనేది మీరు చెప్పండి. ఈ క్రతువులో మీ సమస్యలు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. వ్యవస్థలతో పాటు ఉద్యోగుల సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటాను.

ఉద్యోగ సంఘాల నాయకులు సమస్యను వివరించడమే కాదు. దానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కూడా సూచించండి. దానిపై తగిన సహేతుకమైన నిర్ణయం మేము తీసుకుంటాం. ప్రభుత్వ వెన్నెముక ఉద్యోగులే. వారిని నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదు. చిన్న చూపు చూసే వ్యక్తిని అంతకంటే కాదు. మీ సమస్య నా సమస్యగా భావిస్తాను. మీ సమస్యలన్నీ వినగలిగే శక్తి పూర్తిస్థాయిలో ఉన్న వాడిని.

కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ లను గత ప్రభుత్వం ఇవ్వలేదు
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ ఆర్థికంగా వణుకుతూనే ఉంది. ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి గాడిన పడాలి. దీనికి పాలకులు, ప్రభుత్వ ఉద్యోగుల సమన్వయం అవసరం. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు బలమైన అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం మళ్లీ గాడిన పడుతుంది. గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి అందే పథకాలకు కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వకుండా, వాటి ప్రతిఫలాలు ప్రజలకు దక్కకుండా చేశారు.

15వ ఆర్థిక సంఘంకు సంబంధించి దాదాపు రూ. 1600 కోట్లు రావాల్సి ఉంది. జలజీవన్ మిషన్ వంటి గొప్ప పథకాలకు సరైన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో వాటి ఫలాలు అందలేదు. వాటన్నింటినీ సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కేంద్ర పథకాలను పూర్తిస్థాయిలో వాడుకుంటే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భద్రత దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి.

ఉద్యోగులకు జీతాలు పెంచడం మాట దేవుడెరుగు. ఒకటో తేదీన జీతాలు వస్తే చాలు అనే స్థితికి గత ప్రభుత్వం తీసుకెళ్లింది. అలాంటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకుండా కూటమి ప్రభుత్వం పాలనను ముందుకు తీసుకెళ్తుంది. దీనికి ఉద్యోగుల అందరి సహాయసహకారాలు కావాలి. రాష్ట్ర పరిస్థితిని అర్ధం చేసుకొని ఉద్యోగులంతా ఐక్యత పనిచేసి పాలనను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఉద్యోగ సంఘాల నుంచి అందిన వినతులు
• ఉద్యోగ సంఘాలను సైతం గత ప్రభుత్వం భయపెట్టింది. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి తెచ్చారు. జీపీఎఫ్ నిధులు మళ్లించేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి. విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందాలి. జీపీఎఫ్ లోన్లు, సరండర్ లీవ్ ల వేతనాలు, మెడికల్ రీయింబర్స్ మెంట్ అందాలి. 12వ పీఆర్సీ కమిషనర్ తోపాటు తగినంత సిబ్బందిని వెంటనే నియమించాలి. పెండింగ్ లో ఉన్న డీఏ ఎరియర్స్ చెల్లించాలి.

• కొత్త జిల్లాలకు సంబంధించి డీఎల్పీఓ పోస్టులను ప్రతి జిల్లాకు పూర్తి స్థాయిలో ఇవ్వాలని, పంచాయతీ డివిజినల్ అధికారి లేదా దానికి తగిన హోదా కలిగిన అధికారులతో వాటిని భర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ అండ్ డివిజినల్ పంచాయత్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సభ్యులు కోరారు.

• ఎంపీడీవో పదోన్నతుల్లో సూపరిండెంట్ లకు తగిన విధంగా న్యాయం చేయాలని 34 శాతం కోటాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టిరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు పవన్ కళ్యాణ్ ని కోరారు.

• గతంలో మేజర్ గ్రామపంచాయతీల అధికారులను కార్యనిర్వాహణ అధికారిగా (ఈవో)గా పిలిచేవారు. 2002 తర్వాత ఆ హోదాను తొలగించి పంచాయతీ సెక్రటరీగా చేశారు. ఒక పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 1 వరకు రావడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. అదే పేరుతో పని చేయడం వల్ల ఉద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

• గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసోసియేషన్ కోరింది.

• 2018-19 సంవత్సరాల్లో భారీగా గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని, వాటి బిల్లులు ఇప్పటికీ అందకపోవడం కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు చెప్పారు.

• మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసిన విధంగా 23 శాతం పీఆర్సీ జీతాల పెంపుదల చేయాలని, కొన్ని క్యాడర్ల సిబ్బందికి గ్రేడ్స్ ఫిక్సేషన్ పై ప్రభుత్వం పంపిన కమిటీ రిపోర్టు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కోరారు.

LEAVE A RESPONSE