– నాడు అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చి… నేడు మడమ తిప్పడం కుట్ర కాదా?
– ఉత్తరాంధ్రలోని ఆస్తుల కబ్జాకే విశాఖపై రాబందుల్లా వాలుతున్నారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
నవరత్నాలు నవ మోసాలయ్యాయి. గడపగడపకు వెళ్లే మంత్రుల్ని, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. రూ.2 లక్షల కోట్లు లూటీ చేశారు. పన్నుల బాదుడు, ధరల వాతలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అక్రమ కేసులు, వైసీపీ గూండాల దౌర్జన్యాలపై ప్రజల్లో తిరుగుబాటు పెరుగుతోంది. తమపై వచ్చిన ప్రజావ్యతిరేకత, అరాచక పాలన నుండి ప్రజల దృష్టి మరల్చడానికి అబద్దపు ప్రచారాలతో ప్రాంతీయ, కుల చిచ్చు కుట్రకు జగన్ రెడ్డి గ్యాంగ్ విచిత్ర విన్యాసాలు చేస్తోంది.
అమరావతి రాజధానికి వ్యతిరేకంగా అమరావతిలోనే జగన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులతో నిరాహార దీక్ష శిభిరం నడుపుతున్నా అమరావతి రైతులు ఆ శిభిరానికి నిరసనలు తెలియజేయకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారు. కానీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రై కారుమూరు నాగేశ్వరరావు తన నియోజకవర్గంలో అమరావతి రైతుల మహాపాదయాత్రపై పోలీసులను అడ్డం పెట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులతో నిరసన కార్యక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడడం ప్రాథమిక హక్కుల్ని ధిక్కరించడం కాదా?
మరో మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు, జగన్ రెడ్డి కుటుంబమే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిందంటూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. వారు జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేశారు తప్ప.. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇవ్వలేదు. పులివెందులకు చంద్రబాబు నాయుడే సాగునీరిచ్చారు. పోలవరం పనుల్ని పరుగులు పెట్టించి 72శాతం పూర్తి చేశారు. పట్టిసీమ పూర్తి చేసి సీమ జిల్లాలకు నీటి సరఫరా పెంచారు. పురుషోత్తమపట్నం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పరుగులు పెట్టించారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 2015 సెప్టెంబర్ 11న చంద్రబాబు జాతికి అంకితమిచ్చారు.
చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనలో సాగునీటి రంగంపై రూ.64వేల కోట్లు ఖర్చు చేసి 26 ప్రాజెక్టులు పూర్తి చేసి, 32 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రభుత్వం రూ.1,571 కోట్లు ఖర్చు చేయగా.. జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో రూ.488 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు జగన్ రెడ్డి ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. జగన్ రెడ్డి తండ్రి.. కృష్ణా నదిలో మిగులు జలాలపై ఏపీకి ఉన్న హక్కుల్ని దారాదత్తం చేశారు. జగన్ రెడ్డి.. కృష్ణా-గోదావరి నదీ జలాల్లో బచావత్ కమిషన్ ఏపీకి కల్పించిన ప్రత్యేక హక్కుల్ని దారాదత్తం చేశారు. ఈ వాస్తవాలను అంబటి రాంబాబు అరుపులు, అబద్దాలు తారుమారు చేయలేవు.
జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు నమ్మి మరోసారి మోసపోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలు గానీ, రాయలసీమ ప్రజలు గానీ సిద్ధంగా లేరు. మీకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాజధానిని మార్చే హక్కు జగన్ రెడ్డికి లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేశాయి. ఈ విషయం తెలిసి కూడా జగన్ రెడ్డి మూడు ముక్కల నాటకం ఆడించడం ప్రజల్ని మోసం చేయడం కాదా? తన అవినీతిని, తన ప్రజా వ్యతిరేకత విధానాలను కప్పిపెట్టుకునేందుకు చేస్తున్న కుట్ర కాదా? విశాఖపై ప్రేమ ఉంటే… గత మూడున్నర సంవత్సరాల్లో విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.