Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ తో గ్యాస్ సిలిండర్ భారం మాయం

కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక రూ. 400 కే గ్యాస్ సిలిండర్
పోలింగ్ తేదీన ఓటేసే ముందు ఇంట్లో లైట్ వెయ్యండి… లైట్ వెలిగితే బిఆర్ఎస్ కే ఓటెయ్యండి
బీఆర్ఎస్ తోనే బంగారు భవిష్యత్తు
కాంగ్రెస్ తేలు వంటిది… అవకాశం ఇస్తే విషం చిమ్ముతుంది
బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేస్తే… మన చెవిలో పువ్వు పెడుతారు
జగిత్యాల నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జగిత్యాల: బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే గుదిబండగా మారిన గ్యాస్ సిలిండర్ ధరను రూ. 400కే సబ్సిడిగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను విపరీతంగా పెంచి రూ. 1200 వరకు తీసుకెళ్లిందని విమర్శించారు. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో సబ్సిడీ కింద సిలిండర్లు అందజేస్తుందని, ధర వ్యత్యాసం రూ. 800 ను కేసీఆర్ ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.

బీఆర్ఎస్ పార్టీ తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలుముకుంటాయని అన్నారు. పోలింగ్ తేదీ నాడు ఓటేయడానికి వెళ్లే ముందు ఇంట్లో స్విచ్ వేయాలి, ఒకవేళ బుగ్గ వెలిగితే టిఆర్ఎస్ కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. “చెరువులు నిండినా, ఎండిపోయినా చేపలు అక్కడే ఉంటాయి. కప్పలు మాత్రమే చెరువు నుంచి బయటికి వెళ్తాయి. బీఆర్ఎస్ పార్టీ చేపల వంటిది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కప్పల వంటి వాళ్లు.” అని వ్యాఖ్యానించారు.

ఉద్యమ సమయంలో అధికారంలో లేనప్పుడూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఉందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉందని అన్నారు. కష్టాల్లో, సంతోషాల్లోనూ ప్రజలతోనే బీఆర్ఎస్ ఉంటుందని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలు గెలుస్తారని, బీజేపీ గెలిస్తే ఎవరికీ లాభం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంటు గోల్ మాల్ అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదని, ఇప్పుడు మరొసారి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు.

కాంగ్రెస్ తాగు, సాగు నీరు కూడా ఇవ్వలేదని, కాబట్టి మన గురించి మంచి ఆలోచన చేసే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ నిధులు విడుదల కానివ్వకుండా ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి కవిత గారు మైతాపూర్, భూపతిపూర్ క్రాస్ రోడ్, తాట్లవాయి, కట్కాపూర్, బీర్పూర్, అల్లీపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ…

గత పదేళ్లలో సీఎం కేసీఆర్ 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. నియామకాలపై కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి ఆపుతున్నారని, అయినా కూడా సీఎం కేసీఆర్ 2.3 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. హైదరాబాద్ కు 22 వేల కంపెనీలను తీసుకొచ్చామని, దాంతో దాదాపు 30 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. మాటలు చెప్పేటొళ్లు ముఖ్యమా లేదా పనులు చేసే వాళ్లు ముఖ్యమా అని ప్రశ్నించారు.

“ఎన్నికలు ఉన్నప్పుడే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వస్తారు. అందుకే ఆయనకు తెలంగాణ ప్రజలు ఎలక్షన్ గాంధీ అని పేరుపెట్టారు. ధరణిపై ఆయన విమర్శలు చేస్తున్నారు. గతంలో మన పేరు మీద భూమి ఉన్నా ఒక్కసారైనా బ్యాంకు రుణం వచ్చిందా ? ధరణి వచ్చిన తర్వాత 99 శాతం రైతుకు తన భూమి మీద తనకు హక్కు వచ్చింది. ధరణి పోతే రైతుబంధు రాదు.” అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాక ముందు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరారు. పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో పుష్కలమైన సాగునీటి వనరుల వల్ల రాష్ట్రంలో ధాన్యపు భాండాగారంగా మారిందని చెప్పారు. దేశంలో తెలంగాణను నెంబర్ వన్ గా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని, గతంలో పనుల కోసం తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారని, ఇప్పుడు పనుల కోసం ఇతర రాష్ట్రాల వాళ్లు తెలంగాణకు వలస వచ్చే పరిస్థతి ఏర్పడిందని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో బీడీ కార్మికులను కనీసం గుర్తించలేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దని స్పష్టం చేశారు.

కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా ఎన్నికల తర్వాత బీడీ కార్మికులందరికీ రూ. 5 వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. సౌభాగ్య లక్ష్మీ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని, రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ రక్ష బీమా సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీతంగా పెంచిన గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీ కింద రూ. 400కే అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు.

రైతు బీమా మొత్తం పెంపు, సన్న బియ్యం పంపిణీ గురించి వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ ను గెలిపిస్తే ఇవన్నీ సాకారమవుతాయని, కాబట్టి కారు గుర్తుకు ఓటేసి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల గడ్డ బీఆర్ఎస్ అడ్డ అని తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE