Suryaa.co.in

Andhra Pradesh

జీఓ నంబర్ 39తో వంద మంది కూడా విదేశీవిద్య పొందలేరు

-ప్రభుత్వ చేతకానితనం జీఓ 39తో బట్టబయలైంది
-చిత్తశుద్ధి ఉంటే గతం మాదిరిగా పథకాన్ని కొనసాగించాలి
-టీడీపీ హయాంలో పథకానికి రూ.365కోట్లు ఖర్చు చేశాం
-అవినీతి జరిగితే నిరూపించాలి, ఆరోపణలు సరికాదు
– టీడీపీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు

జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో జులై 11, 2022న జీవోనెం. 39 విడుదల చేసింది. అందులో గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడమే గాక ఈ పథకం అమలు తీరును చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ జీవోను చూస్తే నక్క కొంగకు పల్లెంలో పాయశం పోసినట్లుగా ఉంది. ఈ పథకం షరతులు ప్రకారం ఏపీ నుంచి ఏడాదికి కనీసం 10 మంది పేద విద్యార్ధులు అర్హులుగా అవ్వరు. అందులో మొదటి షరతు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 100 క్యూఎస్ యూనివర్సిటీల్లో ర్యాంకింగ్ వస్తే మొత్తం ఫీజ్ రీయంబర్స్ మెంట్ పథకం అమలు అవుతుంది.

రెండో షరతు ప్రకారం 101 నుంచి 200 క్యూఎస్ యూనివర్సిటీల్లో ర్యాంకింగ్ వస్తే 50 శాతం లేదా రూ.50 లక్షలు ఫీజ్ రీయంబర్స్ చేస్తాం. జగన్ రెడ్డి పిల్లలు కూడా విదేశీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఆ యూనివర్సిటీల్లో చదువుకోవాలంటే ఎంత అవుతుందో తెలుసా? మీ పిల్లలు చదువుతున్న యూనివర్సిటీ 100 క్యూఎస్ లోపల ఉందా? పాత పథకంలో వైఫల్యాలు ఉన్నాయని షరతులతో కూడుకున్న కొత్త పథకం ఇచ్చారు. దేశంలో 23 ఐఐటీలు, 20 ఐఐఎంలు ఉన్నాయి. ఏపీ నుంచి చాలా మంది ఎక్కువ శాతం చేరుతున్నారు.

ఐఐటీ, ఐఐఎంల్లో సీటు సాధించే విద్యార్ధులకు మాత్రమే వరల్డ్ 100 క్యూఎస్ యూనివర్సిటీలో సీటు వస్తుంది. నేడు మన దేశంలో ఐఐటీల్లో చదవి విద్యార్ధులకు ప్రీ సెలక్షన్ల్ లోనే సెటిల్ అవుతున్నారు. అంతే గాని ఎక్కడికో వెళ్లి చదవాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి దాదాపు 50వేల మంది విద్యార్ధులు ఇతర దేశాల్లో ఉన్న మిడిల్ ఆర్డర్ ఉన్న యూనివర్సీటీలకు వెళుతున్నారు. టాప్ 100 యూనివర్సటీల్లో చదివే విద్యార్ధులు తెలివిగల వాళ్లా? ఐఐటీలో చదివే విద్యార్ధులు తెలివి గల వాళ్లు కాదా? మేము గతంలో క్యాస్ట్, ఇన్ కం లాంటి సర్టిఫికేట్లు కావాలంటే మీ సేవ ద్వారా కేవలం 3 రోజుల్లో వచ్చేది. కాని నేడు రూ.8 లక్షల ఇన్ కం సీలింగ్ పెట్టి దానికి జిల్లా కలెక్టర్ సంతకం కావాలని జీవోలో తెలిపారు.

రెవెన్యూ ఆఫీసుల్లో సంతకాలు కావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం ప్రభుత్వం ఆన్ లైన్ మీ సేవ పథకాన్ని ప్రవేశపెట్టింది. అలాంటిది జిల్లా కలెక్టర్ సంతకం కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో జగన్ రెడ్డికి తెలియదా? ఇలాంటి మెలికలు పెడితే ఎంత మంది విద్యార్ధులు అర్హులవుతారు? అంటే ఎక్కువ మంది విద్యార్ధులను అనర్హులుగా చేయడమే జగన్ రెడ్డి విధానం. అంతే కాకుండా గత ప్రభుత్వం విదేశాలకు పంపిన విద్యార్ధులకు సంబంధించి రూ.120 కోట్లు సెకెండ్ ఇన్ స్టాల్ మెంట్ ను జగన్ రెడ్డి విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు.

కొంత మంది విద్యార్ధులకు విద్యను మద్యలోనే వదిలేసి వచ్చేశారు. ఐఐటి, ఐఐఎం కి వెళ్లినవాళ్లు, టాప్ ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లినవాళ్లు ఆ అడ్మిషన్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఆర్ఇసి, ఎన్ఐటీ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు, ఫేమస్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్న వారు వారికి కావాల్సిన కోర్సులకు వెళ్తారు. కానీ మీరు మూడే ఆప్షన్లు ఇచ్చారు. పీజీ, పీ.హెచ్.డీ, ఎంబీబీఎస్ మాత్రమే ఇచ్చారు. సీఏ బయట చదవడానికి అవకాశం లేదు.

గత ప్రభుత్వ హయాంలో చెప్పిన యూనివర్శిటీకి వెళ్లలేదు, చెప్పిన కోర్సుకి వెళ్లలేదు అని చెప్పారు..అది పూర్తిగా అబద్దం. 6-12-2014లో జీఓ నెంబర్ 77లో విద్యార్థులకు వెసులుబాటు కల్పించాం. ఏ కోర్సుకైనా వెళ్లొచ్చు, యూనివర్శిటీలు మారొచ్చు, సీఏ చదివే వారికి సీపీఏ, సీపీఎం కోర్సులు కెనడా, యూఎస్ లో చదువుకునే వారికి లోన్ సౌకర్యం ఉందని చెప్పాం, అవకాశం కల్పించాం. విదేశీవిద్య అందని పండుకాదని, 4,900మందికి అవకాశం కల్పించి మేం నిరూపించాం. మీరు ఇచ్చిన జీఓ ద్వారా 100 మందికి కూడా అవకాశం రాదని టీడీపీ తరపున ఛాలెంజ్ చేస్తున్నాం.

విదేశీ విద్య రద్దు చేయడంతో వచ్చిన విపరీతమైన వ్యతిరేఖత యువతలో వచ్చిందికాబట్టి, దాని నుండి తప్పించుకోవడానికి లోపభూయిష్టమైన జీఓ ఇచ్చారు. మా హయాంలో ఇంటికి ఇద్దరికి అవకాశం ఇస్తే, మీరు కేవలం ఒక్కరికే ఇచ్చారు. అమ్మఒడికి కూడా ఎన్నో షరతులు పెట్టి పథకానికి కోత కోశారు. వైసీపీ ప్రభుత్వం విదేశీవిద్యకు సంబంధించి విడుదల చేసిన జీఓను సవరించాలి, గతంలో ఉన్న విధంగా కొనసాగించాలి. అప్పుడే 100శాతం విదేశీవిద్య అమలవుతుంది. మా హయాంలో విదేశీవిద్యకు రూ.365కోట్లు ఇచ్చాం.

దీనిలో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో సీఎం చెప్పాలి. టీడీపీ చిత్తశుద్ధితో విదేశీవిద్యను అమలు చేసింది, ఆ ఘనత టీడీపీకే దక్కుతుందనే అక్కసుతో, జీఓలో టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని పేర్కొనడం దారుణం. విదేశీవిద్య చిత్తశుద్ధితో అమలు చేయాలని అనుకుంటే, అర్హతను బట్టి అమలు చేయాలి తప్ప, షరతులతో కాదు. ఈ జీఓను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

జీఓ ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇప్పటికే ఉన్న కేసులతో జీవితం సరిపోతుంది..కానీ జీఓ ఇచ్చిన అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు విదేశీ విద్య పథకం అమలు చేయాలని ప్రశ్నిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి మత్రమే ఇలాంటి షరతులతో పథకాన్ని అమలు చేశారు.

LEAVE A RESPONSE