Suryaa.co.in

Andhra Pradesh

జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా అయ్యే ప్రమాదం

– ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలు రాష్ట్ర పరిస్థితికి దర్పణం
– అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు…అధికారంలో వచ్చాక సరిదిద్దుతాం
– కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికి టీడీపీ
కరెంట్ ఎందుకు పోతోందో…బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలి?
– పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని వద్ద జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలతో ఏపీ కూడా తీవ్ర సంక్షోభం దిశగా ప్రయాణిస్తోందని ప్రధానితో వివిధ శాఖల అధికారులు చెప్పిన విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే…ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇసుక, మద్యం దొపిడీ, నిత్యావసరాల భారం వెనుక జగన్ దోపిడీ ఉందన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. సహజ వనరుల దోపీడీకి పాల్పడుతున్న జగన్….ప్రభుత్వానికి ఆదాయం కోసం విపరీతంగా పన్నులు వేస్తున్నారని, అప్పులు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉండే ఏపీలో ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతోందని చంద్రబాబు ప్రశ్నించారు.

కరెంట్ కోతలకు, పెరిగిన విద్యుత్ బిల్లులకు ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో జరిగిందని…. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ ల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిణగలోకి తీసుకోకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు..

స్ట్రాటజీ మీటింగ్ లో చర్చించిన పలు అంశాలు:-
రాష్ట్రంలో కరెంట్ చార్జీల రేట్లు పెంచడం, నిత్యావసర ధరలు, చెత్తపన్ను, పెట్రో మంట, భారమైన గ్యాస్ ధరలపై గ్రామ స్థాయిలో బాదుడే బాదుడు పేరుతో టీడీపీ ఇంటింటికి వెళ్లాలని నిర్ణయించారు. ధరలు పెంచి ఒక్కో కుటుంబంపై రూ.లక్షల్లో భారం వేస్తున్నారు. జగన్ ప్రభుత్వ బాదుడు కారణంగా పేదలపై ఎంత భారం పడుతుంది అనే విషయాలను కరపత్రాల ద్వారా ప్రచారం చెయ్యనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించారు.
అమరావతి నిర్మాణానికి మరో 5 ఏళ్ల సమయం కావాలని ప్రభుత్వం చెప్పడాన్ని నేతలు తప్పు పట్టారు. 80 శాతం పూర్తి అయిన పనులను కూడా పూర్తి చెయ్యలేని జగన్…ఇప్పుడు మరో 5 ఏళ్లు సమయం కోరడాన్ని సమావేశం తప్పు పట్టింది.

జగన్ పాలనపై చివరికి ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. తను అనుకున్న కొందరి వ్యక్తులకు, అదికూడా వ్యక్తి గత అవసరాల కోసం పదవులు ఇస్తున్నారని అన్నారు. సామాజిక సమతూకం పాటించకుండా పదవులు, పోస్టింగ్ లు ఇస్తున్న విధానంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందన్నారు. జగన్ ప్రభుత్వ విధానాల కారణంగా రెడ్డి సామాజికవర్గంలో ఉన్న రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. జగన్ కు ఓటేసి తప్పు చేశామనే భావన ఇప్పుడు సొంత వర్గంలో కూడా విస్తృతం అయ్యిందన్నారు.

సీపీఎస్ విషయంలో ఆందోళనలు చేస్తున్నవారికి టీడీపీ తన సంఘీభావం తెలియజేసింది. అదేవిధంగా వైజాగ్ లో జరిగిన ల్యాండ్ స్కామ్ ను, దేవాలాయాలపై దాడులను సమావేశంలో నేతలు ఖండించారు. విశాఖ మధురవాడలో IT హిల్స్ నందు రూ.1,550 కోట్ల విలువ చేసే భూదందాకు ఏ2 విజయసాయిరెడ్డి పాల్పడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి.

రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా, అమ్మకం జరుగుతోందని…దీని ద్వారా వేల కోట్లు జగన్ ఆర్జిస్తున్నాడని నేతలు అన్నారు. ప్రభుత్వ లిక్కర్ షాపుల ద్వారానే నెంబర్ 2 మద్యం అమ్ముతున్నరని…అధికారికంగా ఈ దోపిడీ తంతు నడుస్తోందని నేతలు అన్నారు. కల్తీమద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, కాలవ శ్రీనివాసులు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్ జవహర్, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, బీద రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బీసీ జనార్థన్ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీ పి.అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ పాత్రుడు, జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE