కూటమి పార్టీల పతనం మొదలు!
– మండిపడ్డ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలతోనే కూటమి పార్టీల పతనం మొదలయ్యిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడారు. ఈ రెండు స్థానాల్లో టీడీపీ మంత్రలు, ఎమ్మెల్యేలు, నాయకులు తమ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచే టీడీపీ గూండాలు వందల సంఖ్యలో ఆయా గ్రామాల్లో మోహరించి, ఓటర్లను కర్రలు, కత్తులతో బెదిరించి వారి నుంచి ఓటర్ స్లిప్‌లను లాక్కున్నారని అన్నారు.
పోలీసుల అండతో వైయస్ఆర్సీపీ నేతలను బయటకు రానివ్వకుండా, ఏకపక్షంగా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ అరాచకానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాకుండా, రౌడీయిజంతోనే ఈ ఎన్నికల్లో గెలవాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. తమను ఎజెంట్లు కూర్చునేందుకు అనుమతించాలంటూ మహిళలు పోలీసుల కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారంటేనే ఈ ఎన్నికలు ఎంత నిరంకుశంగా జరుపుతున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే…
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగంతో పోలీసుల సహకారంతో ఏకపక్షంగా గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా గెలిచే ధైర్యం లేక అడ్డతోవలు తొక్కుతున్నారు. సుపరిపాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రజాతీర్పును స్వేచ్ఛగా కోరేందుకు ఎందుకు భయపడుతోంది. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రజల చీత్కారాలకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని కూడా పూర్తిగా పదిహేను నెలల్లో అమలు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తొలి ఏడాది తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది అరకొరగా అమలు చేస్తున్నారు.
మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీపై నేటికీ అతీగతీ లేదు, నిరుద్యోగభృతి, యాబై ఏళ్ళకే పెన్షన్ ఇలా ఏపథకం చూసినా అమలు అనేది కనిపించడం లేదు. చివరికి రైతులకు ఎరువులను కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రజలకు, రైతులకు అండగా నిలిచిచేందుకు వైయస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట నిలుస్తున్నారు. దీనిని చూసి కూటమి ప్రభుత్వం భయపడిపోతోంది.