– అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి కేసుల మాఫీకి యత్నం
– లిక్కర్, స్కిల్ స్కాం సహా పలు కేసులు విత్ డ్రా
– కేసు విత్ డ్రాకు స్పష్టమైన విధానాన్ని నిర్దేశించిన కోర్టు
– ప్రజా ప్రయోజనాలుంటే తప్ప విత్ డ్రా చేసుకోరాదు
– ఇది ముమ్మూటికీ చట్ట విరుద్ధం
– వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
తాడేపల్లి: అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి కేసులను మాఫీ చేసుకుంటున్న చంద్రబాబు… అవినీతి మురికిని అధికారంతో కడిగేసుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రజాప్రయోజనం ఉంటే తప్ప కేసు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేదని కోర్టులు నిర్దేశించినా…. చంద్రబాబు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న ఆయన… తన న్యాయవాదుల మీద తప్ప చట్టం మీద బాబుకు నమ్మకం లేదని… ఉంటే ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ బెయిల్ రద్దుకు కారణాలేనని.. దీనిపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. సీఆర్ పీసీ 321, బీఎన్ ఎస్ ఎస్ 360 కింద విత్ డ్రా చేసుకోవచ్చు.
అయితే ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చన్నది కూడా చట్టం నిర్దేశిస్తుంది. కేవలం సమాజానికి మంచి జరిగినప్పుడు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలి కానీ.. మీ స్వప్రయోజనాల కోసం అధికారం మీ చేతిలో ఉందని విత్ డ్రా చేయడం చట్ట సమ్మతం కాదు. వైయస్సార్సీపీ లీగల్ టీమ్ దీనిపై కచ్చితంగా పోరాటం చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసి, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంలో కేసులు నమోదైతే మరలా వారికి అధికారం వచ్చిన రోజు కేసులు విత్ డ్రా చేసుకుంటారు. ఇది చట్ట సమ్మతం కాదు. ప్రభుత్వం చాలా కేసుల్లో ఇలా విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. సుప్రీం కోర్టు ఇలాంటి కేసుల్లో చాలా గట్టిగా తీర్పులిచ్చింది.
అధికారంలో మీకు మీరై కేసులు విత్ డ్రా చేసుకుంటే అది ప్రజాప్రయోజనం కాదని చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా చేస్తుంది. వాళ్ల నాయకులకు అనుకూలంగా ముద్ర వేసి ఇవ్వడానికి పబ్లిక్ ప్రాసిక్యూట్ పోస్టాఫీసు కాదు. కోర్టు వారు కూడా యాంత్రికంగా విత్ డ్రా చేయడానికి హక్కులేదు. కోర్టు వారు కూడా ప్రజాప్రయోజనం ఉందా? లేదా ? అన్నది చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు తనమీద ఉన్న ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నారు.
దీనిలో రూ.371 కోట్ల అవినీతి సొమ్ము చేతులు మారింది. ఏపీ పైబర్ నెట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ ఇది చాలా ముఖ్యం. పేదలకు అమరావతి క్యాపిటల్ కాకముందు ప్రభుత్వం అక్కడ భూములిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత వారిని భయపెట్టి, హింసించి ఆ ఆసైన్డ్ ల్యాండ్స్ కు ప్రభుత్వం మీకు ఏ విధమైన పరిహారం ఇవ్వదని ప్రచారం చేసి వారి దగ్గర నుంచి ఆ భూములను మీరు కొనుగోలు చేసింది వాస్తవమా ? కాదా? ఆ మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ రూ.4,400 కోట్లు కుంభకోణం చేసి దోపిడీ చేశారని సీఐడీ కేసు నమోదు చేసింది.
ఆ భూములు కొన్న తర్వాత మీరు జీవో ఎం ఎస్ నెంబరు 41 విడుదల చేసి ఆభూములను రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఆ జీవో పీఓటి యాక్ట్ కు వ్యతిరేకంగా ఉంది. ఇన్ని లొసుగులు పెట్టుకుని రూ.4,400 కోట్ల విలువైన పేద ప్రజల కష్టార్జితమైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని కేసులు మీ మీద ఉంటే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు దారుల మీద ఒత్తిడి చేసి కేసులు విత్ డ్రా చేయడానికి పిటిషన్ చేసి. మీరు శుద్దపూసలగా, మంచు కడిగిన ముత్యంలా ఆ కేసుల నుంచి భయటపడాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం చట్టసమ్మతం కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది వాళ్లకు మేలు చేస్తారనే తప్ప .. మీ సొంత పనులు చేసుకుని మీకు మేలు చేసుకుంటారని కాదు? ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి, న్యాయమూర్తిగా వ్యవహరిస్తే అది రాజ్యాంగం మూల సూత్రాలకు విరుద్ధం అని సోలీ సొరాబ్జీ చెప్పారు. ఒక పోలీసు, ఒక ముద్దాయి, ఒక వ్యవస్థ మూడూ ఏకమైన రోజు అది రాజ్యాంగం ఖూనీ అయినట్టేనని జస్టిస్ మదన్ లోకు చెప్పారు. లిక్కర్ కేసులో వైయస్సార్సీపీ నేతలను ఇరికించేందుకు ఒక వెర్షన్ చెప్పమంటున్నారంటూ ఏపీబీసీఎల్ ఎండీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే… అదే వాసుదేవరెడ్డితో మీరు విత్ డ్రా పిటిషన్ వేయించారు. అది వాసుదేవరెడ్డికి సంబంధించిన విషయం కాదు. రాష్ట్ర ప్రజల సంపదకు సంబంధించిన విషయమన్న పొన్నవోలు…. ఇదేమీ ఆయన వ్యక్తిగత ఆస్తుల గొడవ కాదని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా సాక్ష్యాలను చెరిపేయడం, సాక్షులను బెదిరించడం కిందకే వస్తుంది. ఇవన్నీ మీ బెయిల్ రద్దు కావడానికి కారణం అవుతాయని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.