– ఆర్జిత సేవా రుసుంను భారీగా పెంచడంపై ఆగ్రహం
– భక్తుల ఇబ్బందులను పట్టించుకోరా?
– తక్షణమే రేట్లు తగ్గించి సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని సూచన
– కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
హైదరాబాద్ : కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుంను భారీగా పెంచడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయంలో కనీస సౌకర్యాల్లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాల మీద ద్రుష్టి సారించాల్సిన అధికారులు… వాటిని విస్మరించడమే కాకుండా ఆర్జిత సేవా రుసుం పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి గురువారం దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్ మాట్లాడుతూ కొండగట్టులో ఆర్జిత సేవా రుసుం పెంపుపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాల్లేవు. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ టైంలో కనీస సౌకర్యాలపై దృష్టి సారించకుండా అడ్డగోలుగా ఆర్జిత సేవా రుసుంను పెంచడమేంటి?’’అని ప్రశ్నించారు. తక్షణమే ఆర్జిత సేవా రుసుంను తగ్గించాలని సూచించారు. అట్లాగే కొండగట్టు దేవస్థానంలో కనీస సౌకర్యాల కల్పనపై ద్రుష్టి పెట్టి భక్తులకు ఇబ్బందులను తొలగించాలని కోరారు.