– స్టాండింగ్ కమిటీ నివేదికపై ‘నిజాయితీ’ పాఠం
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమర్పించిన ‘భారతదేశంలో వైద్య విద్య నాణ్యత’ నివేదిక దేశంలో వైద్య విద్యారంగంలోని లోపాలను కళ్లకు కట్టింది. అయితే, ప్రజా సమస్యలను సైతం తమ రాజకీయ రంగుటద్దాల ద్వారా మాత్రమే చూడటం అలవాటుగా మార్చుకున్న ‘సాక్షి’ మీడియా… ఈ నివేదికలోని అత్యంత కీలకమైన సిఫార్సునే దాచిపెట్టి, ఇతర మీడియా సంస్థలు సిఫార్సులను పక్కదారి పట్టించాయని విమర్శించడం హాస్యాస్పదం.
సాక్షి ఆరోపణల ప్రకారం, కమిటీ ప్రైవేట్ రంగాన్ని లేదా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మోడల్‌ను సిఫార్సు చేయలేదట! ఇతరులు నివేదికను వక్రీకరించారట!
నిజంగా ఎవరి కళ్లకు గంతలు పడ్డాయో, ఎవరు నివేదికను దాచిపెట్టింది, ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది.
నివేదికలో ఏముంది? సాక్షి ఎందుకు దాచింది?
స్టాండింగ్ కమిటీ నివేదికలోని ముఖ్యాంశాల సారాంశం ప్రకారం, ‘వైద్య సీట్ల కొరత’ గురించి వివరిస్తూ, ఈ కొరతను అధిగమించడానికి కమిటీ చేసిన సిఫార్సులలో స్పష్టంగా ఈ అంశాలు ఉన్నాయి:
* జిల్లా/రెఫరల్ ఆస్పత్రులకు అనుబంధంగా వైద్య కళాశాలలను ఏర్పాటు చేసే ప్రక్రియను కొనసాగించడం.
* భౌతిక వసతులపై భారం పడకుండా, ఆన్లైన్/దూరవిద్యను ప్రవేశపెట్టడం.
* “వైద్య విద్యలో ప్రైవేట్ పెట్టుబడిని ప్రోత్సహించడం” (encouraging private investment in medical education).
మహాప్రభో! నివేదికలోని నాలుగు ముఖ్య సిఫార్సులలో మూడవ సిఫార్సు ఇది. సాక్షి మీడియాకు ఈ ఒక్క లైన్ కనిపించలేదా? లేక పార్టీకి పకోడీ పొట్లాలకు కోటి సంతకాల సేకరణ సలహా ఇచ్చిన వైకాపా మోకాలి మేధావులకు వ్యతిరేకంగా ఉందని తెలిసీ, పచ్చినిజాన్ని పాతరేశారా? “ప్రైవేట్ పెట్టుబడిని ప్రోత్సహించండి” అని కమిటీ స్పష్టంగా సిఫార్సు చేసిన తర్వాత కూడా, ప్రైవేట్/పీపీపీ మోడల్ గురించి కమిటీ చెప్పలేదని, మీడియా మాత్రమే ప్రచారం చేసిందని అనడం… నివేదికపై సాక్షికి ఉన్న ‘గుడ్డి’ చదువు కాకపోతే మరొకటి కాదు!
ఖర్చు తగ్గింపులోనూ ప్రైవేట్ సహకారమే!
అంతేకాకుండా, వైద్య విద్య ఖర్చు ₹60 లక్షల నుండి ₹1 కోటి వరకు పెరిగిందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఖర్చును తగ్గించడానికి కూడా కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో:
* “ప్రైవేట్ వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల మధ్య సహకారం” (collaboration between private medical colleges and district hospitals) ఉండాలి అని స్పష్టంగా సూచించింది.
ప్రైవేట్ పెట్టుబడిని ప్రోత్సహించాలని, ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు కలిసి పనిచేయాలని (పీపీపీకి మరో రూపం) కమిటీ సిఫార్సు చేసినా… సాక్షి మాత్రం గంతలు కట్టుకుని, “నిజం చెప్పిన మీడియా తప్పే” అంటోంది. బహుశా, నివేదికను పూర్తిగా చదివితే తమ పార్టీ విధానాలకు, తమ ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటుందని భయపడింది. పైగా తమను నమ్మి సంతకాల హడావిడి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు వాజమ్మలు అయ్యారని, అధినేత దగ్గర అక్షింతలు పడతాయని భయపడి వక్రీకరించి అచ్చేశారు సాక్షిలో.
సిఫార్సులు చేసిన ఈ కమిటీలో సభ్యుడిగా తమ వైకాపా తిరుపతి ఎంపీ గురుమూర్తి సభ్యుడు కావడం గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది.
సత్యానికి అద్దం పట్టాల్సిన మీడియా… తమ అధినేతకు, సచ్చు సలహాదారులకు వక్రీకరించడానికి ప్రయత్నిస్తే, ఇలాగే అడ్డంగా దొరికిపోతుంది.
దయచేసి, సాక్షి టీమ్… కళ్లకు అడ్డుగా ఉన్న పార్టీ జెండాలను తీసేసి, నివేదికను మళ్లీ ఓసారి చదవండి! భారత వైద్య విద్యలో ప్రైవేట్ పెట్టుబడిని ప్రోత్సహించాలన్న సిఫార్సు అక్షర సత్యం.
-చాకిరేవు