Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు, బోండా ఉమాకు నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్ కు లేదు

– వాసిరెడ్డి పద్మ పరామార్శకు రాలేదు, పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడాకే వచ్చారు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు, బోండా ఉమాకు నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్ కు లేదు. మహిళా కమిషన్ కు ఏదైనా అవమానం జరిగితే సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తారు. అంతేకానీ ఆమే ఫిర్యాదు చేసి, ఆమే నోటీసులిచ్చి, ఆమే విచారణ జరిపి, ఆమే శిక్ష వేయటం న్యాయసమ్మతం కాదు. చట్టాలు తెలుసుకొని వ్యవహరించాలి.

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికే ఆమె అక్కడికి వచ్చారు. పరమార్శించి వెళ్లిపోకుండా, చంద్రబాబు వచ్చేంతవరకు ఉండి శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది వాసిరెడ్డి పద్మగారే. ఆమె పరామార్శకు రాలేదు, పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడాకే వచ్చారు. చంద్రబాబుతో అతిగా ప్రవర్తించి అక్కడున్న మహిళా నాయకురాళ్లను చేయెత్తి కొట్టబోయిన కమిషన్ ఛైర్ పర్సన్ దే తప్పు. ఆమెకు అన్యాయం జరిగిందని తలిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి.

చంద్రబాబుపై అతిగా ప్రవర్తించినందుకు ఆమెపై ఫిర్యాదు చేద్దామంటే పెద్దమనసుతో చంద్రబాబు వద్దన్నారు. వాసిరెడ్డి పద్మ లేని హక్కుల్ని సమీకరించుకోవాలని చూస్తున్నారు. అమాయకత్వం, అవగాహనా రాహిత్యం, చట్టాలపట్ల అవగాహనా లేమితో ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. జగన్ ప్రభుత్వం నిద్రపోతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతోంది. నిర్లక్ష్యం వహించిన ఎస్ఐని, సీఐని సస్పెండ్ చేయడంకాదు, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలి. ఈ ప్రభుత్వ వ్యవహారశైలి ముద్దాయిలకు స్నేహహస్తం అందిస్తున్నట్లుగా ఉంది.

నేర చరితులెవరూ ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో భయపడటంలేదు. నేరస్థులకు నేరం చేసుకోవడానికి హక్కు కల్పించినట్లుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో తప్పు చేసినవారు ప్రభుత్వానికి భయపడేవారు. చంద్రబాబు హయాంలో గుంటూరుజిల్లా దాచేపల్లిలో ఓబాలికను అత్యాచారం చేయగా.. చంద్రబాబు డీజీపీకి ఫోన్ చేసి 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయమనగా నిందితుడే తప్పించుకొనే దారిలేక ఉరేసుకొని చనిపోయాడు. దీన్ని చూసైనా ప్రభుత్వానికి కమ్ముకున్న చీకట్లు వదలిపోవాలి.

నేనిప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగనే కంచికచెర్లలో ఆటో డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ఇది మన ప్రభుత్వం అనుకుంటున్నాయి. సస్పెండ్ చేయాల్సింది సీఐ, ఎస్ ఐని కాదు.. ప్రభుత్వాన్ని, మిమ్మల్ని, మీ హోం మంత్రిని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించకపోవడంవల్ల ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. ముఖ్యమంత్రి మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవటం ద్వారా పరిపాలించే హక్కు కోల్పోయారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జైళ్లల్లో ఉన్నవారు మన ప్రభుత్వముంది అని అనుకుంటున్నారు.

సీఎం ఈ మార్క్ ను తీసేసుకోవాలి. నేరస్థులు ముఖ్యమంత్రిని మన ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల్లో నెలకొని ఉన్న భయాన్ని సీఎం పారదోలాలి. తప్పు చేసినవారికి శిక్ష అనుభవించడం తప్ప వేరే మార్గం ఉండకూడదు. తాను తప్పించుకోవచ్చు అనే ఆలోచన నేరస్థుడికి రాకూడదు. సీఎం ఇంటి పక్కనే అత్యాచారం చేస్తే నిందితుల్ని ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. రాజమండ్రిలో అత్యాచారానికి పాల్పడినవారిని కూడా పట్టుకోలేకపోయారు.

పులివెందుల అడవిలో మహిళను రేప్ చేసి మర్డర్ చేసినవారు ఏమయ్యారో ఇంతవరకు తెలియదు. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేదు. ప్రస్తుత హోంమంత్రిని అత్యాచారం గురించి మాట్లాడమంటే ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, నన్ను ఎందుకు పిలిపించారు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి మంత్రుల్ని, ఘనాపాటీలను పెట్టుకున్న సీఎంను అభినందించాలి. ఇలాంటి అసమర్థ మంత్రులకు ప్రజలు జేజేలు పలకక ఏం చేస్తారు.

సమాజంలో సగభాగం మహిళలున్నారు. మహిళల రక్షణ ప్రభుత్వ బాధ్యత. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందో అర్థం కావడంలేదు. ఐపీసీ376, 354, 509 జీవోలను ఎందుకు అమలు పరచడంలేదు? గతంలో ఇటువంటి సంఘటనలు జరిగితే అధికారులు బాధపడేవారు, సిగ్గుపడేవారు కానీ నేడు వారికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. పైగా ఆనందపడుతున్నాడు. ముగ్గురు ముష్కరులచే మానభంగానికి గురైన అమ్మాయికి వెంటనే చంద్రబాబు కోరిన రీతిలో ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. ఇప్పటికైనా ప్రభుత్వ వ్యవహారశైలి మానుకొని మహిళలకు రక్షణ కల్పించాలి లేదా మీకు మీరే సస్పెన్షన్ విధించుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు.

LEAVE A RESPONSE