– పిడుగురాళ్లలో లైంగిక వేధింపుల ఘటనపై ‘వాసిరెడ్డి పద్మ’ ఆగ్రహం
– కీచక ఉద్యోగిపై చర్యలకు ఆదేశం
గుంటూరు: లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు రోడ్డుపైన బైఠాయించిన ఓ బాధితురాలికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలిచింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల టౌన్ లో వార్డు వాలెంటీర్ పట్ల సచివాలయ ఉద్యోగి లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటనపై సోమవారం రాష్ట్ర కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీచకత్వానికి పాల్పడిన ఉద్యోగిపై చర్యలకు ఆమె ఆదేశించారు. వివరాల్లోకొస్తే…
పిడుగురాళ్ల పట్టణం 13 వ వార్డు సచివాలయం ఎదుట బాధిత వాలెంటీర్ బైఠాయించింది. సచివాలయ ఉద్యోగి శివ చెన్నారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని… అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. వెంటనే పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు ఆరాతీశారు.
సత్వర విచారణతో లైంగిక వేధింపులకు పాల్పడిన సదరు ఉద్యోగి పై చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. బాధితురాలితోనూ ఫోన్ లో మాట్లాడి ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించే వారికి తగినబుద్ధి చెప్పాలని.. ఆమెకు న్యాయం చేస్తామని వాసిరెడ్డి పద్మ భరోసానిచ్చారు.