– బ్లాక్ చేసేందుకు చర్యలు చేపట్టాలని డీజీపీని కోరిన ‘వాసిరెడ్డి పద్మ’
అమరావతి: ఆన్లైన్ రుణ యాప్ ల వలలో చిక్కి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తేలికగా రుణాలు అంటగట్టి వడ్డీల మీద వడ్డీలు వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న రుణయాప్లపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మంగళగిరిలోని నవులూరుకు చెందిన జాస్తి చౌదరి ఆన్లైన్ మోసానికి గురై చెరువులో దూకి చనిపోగా… తాజాగా అదే మంగళగిరిలో మరో బాధితురాలు ప్రత్యూష ఆత్మహత్యాఘటన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలచివేసింది. బాధితురాలి భర్త రాజశేఖర్ తో ఆమె మంగళవారం ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ఈ ఘటనలను సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి రుణ యాప్ ల వేధింపులకు మరొకరు బలిగాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రుణ యాప్ లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతూ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ పంపారు. రుణ యాప్ లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్ లను సంప్రదించడం మంచిదన్నారు. రుణ యాప్ ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రుణ యాప్ వేధింపులపై సమగ్ర నివేదిక సమర్పించాలని లేఖలో వాసిరెడ్డి పద్మ కోరారు.