– వర్దన్నపేటలో యువతిపై మృగాళ్ల గ్యాంగ్ రేప్ దారుణం
-నిందితులను కఠినంగా శిక్షించాలి
– హోంమంత్రిగా రేవంత్ రెడ్డి టోటల్ ఫెయిల్యూర్
– ప్రజా పాలనలో ‘ప్రాణాలకు’ గ్యారెంటీ లేదు
– తెలంగాణను డ్రగ్స్ అడ్డాగా మార్చిన కాంగ్రెస్ సర్కార్
– శాంతిభద్రతల వైఫల్యం, గంజాయి మాఫియా స్వైరవిహారం
– డ్రగ్స్ కంట్రోల్ మీ వల్ల కాదు.. పదవి నుంచి తప్పుకోండి!
– బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి
హైదరాబాద్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం రాయపర్తి మండలంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. ఈ దారుణాన్ని బిజెపి తెలంగాణ మహిళా మోర్చా తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఆడబిడ్డల భద్రత పూర్తిగా గాలికొదిలేశారు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. గంజాయి మత్తులో కొందరు మృగాళ్లు ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె ప్రాణాలు తీయడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. ఈ ఘోరం తెలంగాణలో మహిళల భద్రత పూర్తిగా సమాధి అయిందనడానికి సజీవ సాక్ష్యం.
ఈ కేసులో పోలీసుల వ్యవహారశైలి అత్యంత హేయంగా ఉంది. కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చాల్సింది పోయి, పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా మారి బాధితులనే అవమానించడం దారుణం. యువతి శరీరంపై రక్తపు గాయాలు స్పష్టంగా కనిపిస్తుంటే.. గంజాయి మత్తులో మృగాళ్లు అఘాయిత్యం చేశారని ఆరోపణలు వస్తుంటే.. ‘ఆమెను చీమలు కరవడం వల్లే రక్తం వచ్చి చనిపోయిందంటూ బాధ్యతారహితంగా పోలీసులు చెబుతున్న సమాధానాలు వింటుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారాయో అర్థమవుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హోంమంత్రి పదవిలో ఉన్నారు. అయినా రాష్ట్రంలో నేరాలు అదుపులోకి రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట. నిందితుల పేర్లు బయటకు వచ్చినా పోలీసులు తక్షణమే స్పందించకపోవడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? నేరం జరిగాక కళ్లు తెరవడం కాదు, అసలు ఇలాంటి దారుణాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? గంజాయి, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పెకిలించడం మీ వల్ల కాకపోతే తక్షణమే హోంమంత్రి పదవి నుంచి తప్పుకోండి.
ఈ దారుణానికి గంజాయి మత్తు ప్రధాన కారణమనే ఆరోపణలు కలవరపెడుతున్నాయి. గల్లీ గల్లీలో గంజాయి, డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి. తెలంగాణను ‘డ్రగ్స్ ఫ్రీ స్టేట్’ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు మాఫియా ముందు మోకరిల్లిందా? చిన్న చిన్న కేసులతో సరిపెట్టడం కాదు.. ఈ మాఫియా వెనుక ఉన్న పెద్ద తిమింగలాలను ఎందుకు పట్టుకోవడం లేదు? యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తూ, మహిళల మానప్రాణాలతో ఆడుకుంటున్న ఈ గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాల్సిందే.
మరోవైపు తెలంగాణలో మహిళల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. రోజుకు సగటున 10 అత్యాచారాలు, 4 కిడ్నాప్‌లు, 3 హత్యలు జరుగుతున్నాయి. ప్రతి రెండున్నర గంటలకు ఒక మహిళపై అఘాయిత్యం జరుగుతోంది. హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో కూడా పట్టపగలే కత్తులతో దాడులు, తుపాకీ కాల్పులు జరుగుతుంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాలా? ఇది ప్రజా పాలన కాదు.. కాంగ్రెస్ నీడలో నడుస్తున్న “గూండాల రాజ్యం”.
ఒకవైపు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా సాధికారత కోసం చట్టసభల్లో 33% రిజర్వేషన్లు తీసుకువచ్చి మహిళలను రాజకీయ శక్తిగా ఎదిగేలా కృషి చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కారు తీవ్ర వైఫల్యం, అసమర్థతతో మహిళలకు ప్రాథమిక రక్షణ కూడా కరువైంది. ఆడబిడ్డల భద్రత గాలికొదిలేసి, తెలంగాణను నేరగాళ్ల అడ్డాగా మార్చడం అత్యంత విచారకరం.
ఇప్పటికైనా వర్ధన్నపేట ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలి. నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నెట్‌వర్క్‌లను మూలాలతో సహా పెకిలించి వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే మా హెచ్చరిక.. చేతకాకపోతే గద్దెదిగండి. మహిళల మానప్రాణాలను కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బిజెపి మహిళా మోర్చా తరపున మా పోరాటం ఆగదు.