Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఆవిర్భావంతోనే మహిళా సంక్షేమం

-టీడీపీ పాలనలోనే మహిళా సాధికారత,విద్య, భద్రత, ఉపాధి, గౌరవం
-మేనిఫెస్టో లోని మహాశక్తి కార్యక్రమాలతో అత్యుత్తమ ఫలితాలు
-జె బ్రాండ్స్ తో సొంత మద్యం అమ్మడమే మద్య నిషేధమా?
-చెప్పు తీసుకుని కొట్టేవారు లేకనే ప్రభుత్వ సర్వేల పేరుతో వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు
-నేడు ఇంటికి వచ్చే కరెంట్ బిల్లు… ఇంటి అద్దె సమానం అయ్యాయి
-మహాశక్తి చైతన్య రథయాత్ర ప్రారంభం కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
-పార్టీ కార్యాలయంలో జెండా ఊపి చైతన్య రథయాత్ర వాహనాలను ప్రారంభించిన టీడీపీ అధినేత

అమరావతి:- టీడీపీ పాలనతోనే రాష్ట్రంలో మహిళా సంక్షేమం సాధ్యమైందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా సంక్షేమాన్ని తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం ముందు…తెలుగు దేశం ఆవిర్భావం తరవాత అని చూడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో మహాశక్తి పథకాలపై సదస్సు నిర్వహించారు.

సభ అనంతరం మహాశక్తి చైతన్య రథయాత్రను చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….నా మహాశక్తి రథసారథులు ఆడబిడ్డలే. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. నేడు మహాశక్తి తీసుకొస్తున్నా. మహాశక్తి పదం నా మనసులో నుంచి వచ్చింది. రాష్ట్రంలోని మహిళల స్థితిగతులను మహాశక్తి కార్యక్రమం ద్వారా మార్చేస్తాం. ఆనాడు 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిహక్కు కల్పించారు. ఆ తర్వాత కాలంలో ఆస్తిహక్కును దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

ఆడపిల్లలకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే చాలనుకునే రోజుల్లోనే ఎన్టీఆర్ పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి విద్యను ప్రోత్సహించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ స్కూళ్లు, కాలేజీలు తీసుకొచ్చాం. విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చాం.

ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. మన జనాభాలో సగం మహిళలే. మీకు తిరుగులేదు. శక్తి సామర్థ్యాల్లో మగవాళ్లకు మహిళలు ఏ మాత్రం తీసిపోరని నిరూపితమైపోయింది. మహిళా సంక్షేమానికి నేను అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాను. వినూత్న పథకాలు అమలు చేశాను.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలను కండక్టర్లుగా నియమించాం. ఇప్పుడైతే ఏకంగా బస్సులు నడిపే శక్తి మహిళలకు వచ్చేసింది. ఆలోచనల పరంగా మహిళలే అత్యంత శక్తిమంతులని శాస్త్రీయంగానూ నిరూపితమైంది. నేడు ఐటీలో చూడండి. భర్త కంటే భార్యకే ఎక్కువ జీతం వస్తోంది. మన ఇళ్లలో గమనిస్తే కొడుకు కంటే కోడలికే ఎక్కువ జీతం వస్తుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇక వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెపుతున్న అమ్మఒడి పథకంలో లోపాలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ చెప్పినట్లు ఒక బిడ్డకే అమ్మఒడి కింద రూ. 15 వేలు ఇచ్చి ఆ బిడ్డనే చదివిస్తే మరో బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ తల్లి ఒప్పుకుంటుందా?అందుకే తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. ఆడబిడ్డ పుడితే భారమని భావించే రోజుల్లోనే చైల్డ్ ప్రొటక్షన్ స్కీం పెట్టి రూ. 5 వేలు వారి పేరుతో డిపాజిట్ చేశాం. తద్వారా ఆడబిడ్డలకు అండగా నిలిచాం. ఆ తర్వాత ఆ సాయం వారి చదువుకు ఉపయోగపడింది.

ప్రతిభా భారతిని మహిళా స్పీకర్ చేశాం. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదే ఇచ్చాం. ఇళ్లు కట్టించాం. రుణాలు మహిళల పేరు మీదనే ఇచ్చాం. డ్వాక్రా ఏర్పాటుతో మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాం. నా చిన్నతనంలో నా తల్లి వంటిట్లో పడిన ఇబ్బందులు చూశా. దీపం పథకం తెచ్చి మహిళల జీవితాల్లో వెలుగులు తెచ్చాం. నేడు గ్యాస్ సిలిండర్ ధర చూసి మళ్లీ కట్టెల పొయ్యి దగ్గరకు పోయే స్థితి వచ్చింది.

అందుకే మనం అధికారంలోకి రాగానే మహాశక్తి కార్యక్రమం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నేను డ్వాక్రా సంఘాలు పెడితే చాలామంది ఎగతాళి చేశారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తెచ్చా. పొదుపు నేర్పించా… మనం తెచ్చిన డ్వాక్రా సంఘాలు ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగాయి. పసుపు కుంకుమ కింద రూ.10 వేల కోట్లు ఆర్థిక సాయం చేశాం. మహిళలకు 11 రకాల ఆరోగ్య పరీక్షల కోసం ఆర్థిక సహాయం చేశాం.

ఒక అన్న గా ఒక తమ్ముడిగా ఒక తండ్రిగా ఆలోచించి శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయించిన ఘనత టీడీపీది. ‘అమృత హస్తం’ కింద గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చాం….బేబీ కిట్లు, తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్, బాలామృతం, సామూహిక శ్రీమంతాలు, పెళ్లి కానుకలు ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుంది. మహాశక్తి పథకంలో భాగంగా ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నాం.

విద్యను ప్రోత్సహించేందుకే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇక ఆడబిడ్డ నిధికింద 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న వారికి నెలకు రూ.1500 నేరుగా ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ ఈ పథకం అమలు అవుతుంది. సంపద సృష్టించే మంత్ర దండం టీడీపీ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

వైసీపీ పాలనలో నేడు రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా? ఏ సైకో ఎటునుంచి దాడి చేస్తాడో అన్న భయం నేడు మహిళల్లో ఉంది. పోలీస్ వ్యవస్థ ఏమయ్యింది? మన హాయంలో ఆడబిడ్డల పట్ల కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికైనా ఉండేదా? నేడు భయటకు వెళ్లిన విద్యార్ధినులు ఇంటికి వస్తారో లేదో అని భయం గుప్పెట్లో మహిళలు బ్రతుకుతున్నారు.

రేపల్లెలో స్కూల్ కు వెళుతున్న విద్యార్ధినిపై గంజాయి బ్యాచ్ అల్లరి చేస్తే ఎదిరించిన తమ్ముడిపై దాడి చేసి పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేశారు.ఇంత జరిగితే జగన్ ఎందుకు అక్కడకు వెళ్లలేదు? మీ పిల్లలకో, కుటుంబ సభ్యులకో ఇలా జరిగితే జగన్ స్పందించరా? ఈ 4 ఏళ్లల్లో మహిళలపై 52,587 దాడులు, వేధింపుల ఘటనలు జరిగాయి. 22,278 మంది ఆడబిడ్డలు కనిపించకుండా పోయారని కేంద్రం చెబుతుంది.

3,372 అత్యాచారాలు, 41 సామూహిక అత్యాచారాలు జరిగాయి. తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే నిందితుల్ని ఇంత వరకు పట్టుకోలేదు. టీడీపీ హయంలో పిడుగురాళ్లల్లో ఒక బాలికపై అత్యాచారం జరిగితే 22 బృందాలు వేసి గాలిస్తే నిందితుడు రెండో రోజు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు…. అది టీడీపీ సమర్ధత.

కానీ నేడు అత్యాచారాలకు పాల్పడిన నిందితులు యద్ధేచ్చగా తిరుగుతున్నారు. మద్యపాన నిషేధం హామీ ఏమయ్యింది? నాశిరకం బ్రాండ్ లు తెచ్చారు. 15 ఏళ్ల పాటు మద్యాన్ని తాకట్టు పెట్టి రూ.33 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఈ రాష్ట్రంలో దొరికే బ్రాండ్లు పక్క రాష్ట్రంలో ఎక్కడా దొరకవు. దుర్మార్గపు జగన్మోహన రెడ్డి తన అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు.

నువ్వు ఏం చేశావ్, ఏం ఇచ్చావ్ చెప్పు? నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయే. గంజాయి తాగి, డ్రగ్స్ కి అలవాటు పడిన వారిని మనం కాపాడుకోగలమా? పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం. నిన్న విశాఖలో ఓ స్కూలు దగ్గర గంజాయి దొరికింది. వైసీపీ అధికాంరలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెంచేశారు. జగన్ రెడ్డి ఒక చేత్తో రూ. 10 ఇచ్చి మరో చేత్తో రూ. 100 లాక్కుంటున్నారు.

ధరల నియంత్రణకే నేను రైతు బజారులు పెట్టాను. నేడు ఉప్పూ, పప్పూ అన్నీ మండిపోతున్నాయి. దేశంలో ఎక్కువ నిత్యావసర ధరలు ఉన్నది ఏపీలోనే. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు , పెట్రోల్ రేట్లు… ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ పెంచేశారు. టీడీపీ హయాంలో కరెంటు చార్జీలు పెంచలేదు. జగన్ ప్రభుత్వం 7 సార్లు కరెంటు చార్జీలు పెంచాడు. ఇప్పుడు కరెంట్ బిల్లు అనేది…ఇంత అద్దె అంత అయ్యింది. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక దొరుకుతోందా? ఇసుకను అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలించి వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారు. మళ్లీ జగన్ వస్తే మీ ఇళ్లు , పొలాలు కొట్టేస్తారు. ఎవరికీ రక్షణ ఉండదు.రాష్ట్రంలో వాలంటీర్లకు నేను ఒక్కటే చెపుతున్నా….. మీరు రాజకీయం చేయకండి…. సైకో చెప్పిన పనులు చేయకండి. వాలంటీర్లు ఇళ్లలోకి చొరబడుతున్నారని తెలిసింది. ప్రజల వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటున్నారు…ఏంటీ వ్యవహారాలు జగన్ రెడ్డీ?

చెప్పుతో కొట్టేవారు లేక ప్రజలను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. వ్యక్తిగత అంశాలపై ఆరా తీస్తున్నారు. ఆడపిల్లల వ్యక్తిత్వంపై నీచంగా మాట్లాడే, పోస్టులు పెట్టే వైసీపీ నేతలకు ధీటుగా సమాధానం చెప్పండి. సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏమన్నా అంటే చెప్పు చూపించండి. మీ చెప్పు ఫోటో తీసి వారికి పంపండి. తప్పు చేసిన ప్రతి వైసీపీ నేతనూ బోనెక్కిస్తా. మీ తప్పులకు వడ్డీతో సహా చెల్లిస్తా.

మహిళల జీవితాలుమార్చడానికి నాంది మహాశక్తి. జగన్ రెడ్డికి డబ్బు పిచ్చి. దేశంలో డబ్బంతా అతనికే కావాలి. మనం మాత్రం తిండి లేకుండా మాడిపోవాలా? కోడికత్తి డ్రామాలు, యాక్షన్లకు కాలం చెల్లింది. 2 కోట్ల 50 లక్షలమంది మహిళలు ముందుకొచ్చి అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి. అన్ని సమస్యలకు పరిష్కారం మహాశక్తి సంకల్పం.

మహాశక్తి కంకణం ధరించి 41 రోజులు దీక్ష చేస్తామని సంకల్పం చేయండి. ఇంటింటికీ వెళ్లి మహాశక్తి పథకాలపై వివరించండి. ప్రజలను చైతన్య వంతులను చేయండి. నా ఆడబిడ్డలను ఒక మహాశక్తిగా తయారుచేయాలన్నది నా సంకల్పం. వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి ఏంటో జగన్ రెడ్డికి చూపించాలని చంద్రబాబు నాయుడు అన్నారు.

అనంతరం మహాశక్తి చైతన్య రథయాత్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతలు ఈ వాహనాల్లో వేలాది గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో నేతలు డోర్ టు డోర్ విజిట్ తో పాటు ప్రత్యేక సమావేశాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

LEAVE A RESPONSE