– వీఆర్వో, వీఆర్ఏ, సర్వేయర్ల సమస్యలను పరిష్కరిస్తా
– సంఘాల నేతలకు రెవెన్యూ మంత్రి అనగాని హామీ
అమరావతి: రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ను శుక్రవారం ఆంధ్రపదేశ్ వీఆర్వో అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వి.ఆర్.ఎ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, ఏపీ గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్బంగా వారి సమస్యలను మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వివరించారు. తమకు ప్రమోషన్లు ఇవ్వాలని మూడు సంఘాల వారు కోరారు. దీనిపై అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని హామీ ఇచ్చారు.
వీఆర్వో అసోసియేషన్ నాయకులు రవీంద్ర మాట్లాడుతూ తమకు రోజూ గ్రామ సచివాలయాల కెళ్లి హాజరు వేయించుకోవడం సమస్యగా ఉందని, తాము ఎక్కడ పనిలో ఉంటే అక్కడ నుండే హాజరు వేసే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. అదే విధంగా రెవిన్యూ శాఖ విధుల్లో ఉన్నప్పుడు కూడా వేరే విధులు కూడా చేయాలని గ్రామ సచివాలయాల అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల రెవెన్యూ శాఖ పనిని సరిగ్గా చేయలేకపోతున్నామని తెలిపారు.
తమకు గ్రామ సచివాలయాల్లో ఒక కంప్యూటర్ ను ఏర్పాటు చేస్తే ఇక ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే రోజువారీ విధులు నిర్వహిస్తామని కోరారు. సర్వేయర్ల అసోయేషన్ నాయకులు మాట్లాడుతూ తమను టెక్నికల్ పోస్టులుగా గుర్తించాలని కోరారు. ఈ అంశాలపైన రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ తో చర్చించి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటానని మంత్రి అనగాని వారికి హామీనిచ్చారు.
అయితే వీఆర్వో, వీఆర్ఎ, సర్వేయర్లు అందరూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. అవినీతికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయని, దానికి అస్కారంగా లేకుండా పని చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చే ప్రజలను సంతృప్తి పరిచేలా పని చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు.