– అసెంబ్లీ నా-జ్ఞాపకాలు
(శ్రీపాద శ్రీనివాస్)
తేది 25.03.2006…
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న
సమయం అది…
ముఖ్యమంత్రిగా వైఎస్సార్ గారు ఓ పక్కన.. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన యువ మరియు అనేక మంది రాజకీయ అనుభవజ్ఞుల ఎమ్మెల్యేలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడుతూ ఉండేది.
నామటుకు ఆ నెల ( మార్చి, 2006) అంతా గడ్డు మాసం గా అనిపిస్తోంది.
దానికి కారణం ఆ నెల మొత్తంలో అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం నాటి రాజమండ్రి శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు గారికి పెద్దగా రాలేదు.
..సి.యల్.పి. సిబ్బందిలో ఒకడ్ని అయినప్పటికీ ఓటరుగా రాజమండ్రి వాడ్ని కాబట్టి కాస్తంత అభిమానం రాజమండ్రి వారి మీద ఉండటం సహజమే కదా!
అందుకే నా అసహనానికి అసలు కారణం!
సరిగ్గా అదే సమయంలో…
” కోరుకొండ దేవస్థానంకి సంబంధించి రేపటి రోజుకి నాకు అవకాశం వచ్చింది.
….కానీ ఓ అర్జంట్ పనికి రేపు నేను హాజరు కావాలి.. రేపటి నా ప్రశ్నను మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేయమని స్పీకర్ గారిని అర్జిస్తు నా పేరున ఓ లెటర్ ప్రిపేర్ చేయి”… అంటూ రాజమండ్రి పక్క నియోజక వర్గం అయిన ” బూరుగుపూడి” ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర గారు.. నా దగ్గరకు వచ్చారు.
నాకు వెంటనే బుర్రలో బల్బ్ వెలిగింది.. ఆ అవకాశాన్ని “రౌతు” గారికి బదలాయింపు చేయించాలి అని!
” సార్.. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగుస్తాయి. మీ ప్రశ్నను వాయిదా వేయిస్తే మళ్ళీ రాకపోవచ్చు. దీన్ని ” రౌతు” గారికి బదలాయించమని మీ పేరున స్పీకర్ గారికి అర్జీ పెడదాం” అని ఓ ఉచిత సలహా ఇచ్చాను.
అప్పుడు రవీంద్ర గారు… ” అదెలా.. నా నియోజక వర్గం పరిధిలోని సమస్యను మీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే నా ప్రజలు ఏమనుకుంటారు? నీకు ఇంత ప్రాంతీయ దురభిమానం తగదు” అంటూ నవ్వుతూ రవీంద్ర గారు నా భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేస్తూ నవ్వసాగారు.
ఆయన ఆ సమయంలో చూపిన ఆప్యాయతను అసరా చేసుకుని ఇదే సరైన అదును అనుకుంటూ… ” అదేంటి సార్… మీరు మన రాజమండ్రి లాంటి ఖ్యాతి చెందిన నగరానికి ఎంపీగా చేశారు… “కొత్తగా మొదటి సారి ఎన్నిక అయిన ఎమ్మెల్యే ను ప్రోత్సహించకపోతే ఎలా” అంటూ బుంగ మూతి పెట్టాను. వెంటనే ” రవీంద్ర గారు” నా అభ్యర్థనను కాదనలేక పోయారు.
మరునాడు అసెంబ్లీలో ” కోరుకొండ దేవస్థానం” ప్రశ్న రావడం.. మునుపటి రోజున రవీంద్ర గారి అభ్యర్థన మేరకు స్పీకర్ గారు తన విచక్షణ అధికారాలతో రౌతు సూర్య్రకాశరావు గారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం.. ఆయన మాట్లాడటం అంతా సవ్యంగానే జరిగిపోయింది.
నాకు కూడా సంతోషంతో కడుపు నిండి పోయింది. ఎందుకంటే ఈ సీజన్ మొత్తానికి మొత్తం మీద రౌతు గారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం చిక్కినందుకు!
ఇక్కడ అసలు కొసమెరుపు ఏమిటి అంటే… “ఆ రోజు అసెంబ్లీకి రాలేక పోవచ్చు” అని చెప్పిన రవీంద్ర గారు యధావిధిగానే అసెంబ్లీకి వచ్చారు.
…కానీ రౌతు సూర్యప్రకాశరావు గారికి మాట ఇచ్చిన కారణంగా, ప్రశ్నోత్తరాల సమయం ముగిసేవరకు అసెంబ్లీ హాలులోకి వెళ్లకుండా ” సి.యల్.పి” ఆఫీస్ లోనే కూర్చున్నారు.
రౌతు గారు తనకు ఎదురైన వెంటనే..
” చక్కగా మాట్లాడావు… అసలు నేను ఈ ప్రశ్న వేయడం వెనుక వున్న నా ఆంతర్యాన్ని చాలా మటుకు వ్యక్త పరిచి .. సదరు సమస్య పరిష్కారానికి ప్రభుత్వము నుండి చక్కని సమాధానం రాబట్టావు” అంటూ చిట్టూరి రవీంద్ర గారు, రౌతు సూర్య్రకాశరావు గారిని అభినందిస్తూ. తన సహృదయతను చక్కగా చాటుకున్నారు.