-సంక్షేమ పథకాలకు ఖర్చు చేసింది రూ.1.50 లక్షలే
-తెచ్చిన రూ.5 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లింది జగన్ రెడ్డీ.?
-విజయమ్మ రాజీనామా, జగన్ రెడ్డి పొగడ్తలు తప్ప ప్లీనరీలో ఏమీ లేదు?
– యనమల రామకృష్ణుడు
వైసీపీ ప్లీనరీలో ఆత్మస్తుతి పరనింద తప్ప ఏమున్నది? ఆత్మావలోకనం లేదు. ఆత్మపరిశీలనా లేదు. కోటాను కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. ధరలు, పన్నుల తగ్గింపు, మోటర్లకు మీటర్ల ఉపసంహరణ, ఉద్యోగ ఖాళీల భర్తీ, పాఠశాలల విలీనం ఉపసంహరణ, మహిళలపై అత్యాచారాలు, హత్యల నివారణ, సీపీఎస్ రద్దు, ప్రత్యేకహోదా సహా విభజన చట్టం హక్కుల సాధన, బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు, దుల్హన్ పునరుద్దరణ, మద్యనిషేదం, ఇసుక రేట్లు తగ్గింపుపై ప్లీనరీలో చర్చించి సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తారని ఎదురు చూసిన ప్రజలకు ప్లీనరీ జరిగిన తీరు నిరాశ పరిచింది.
తల్లిని పార్టీ నుండి తొలగించడానికి, తనను పొగిడించుకోవడానికి, టీడీపీ, జనసేనను తిట్టడానికే ప్లీనరీ నిర్వహించినట్లుగా ఉన్నది. జగన్ రెడ్డి ప్రసంగంలో అబద్దాలు తప్ప వాస్తవాలు లేవు. మేనిఫెస్టో హామీలు 95 శాతం అమలు చేశామని పెద్ద అబద్దం చెప్పారు. మద్య నిషేదంపై మాట తప్పి మడమ తిప్పారు. పైగా మందుబాబులను తాకట్టు పెట్టి రూ.33వేల కోట్లు అప్పు తెచ్చారు. విషపూరిత మద్యం పోస్తూ మహిళల మాంగల్యాలు తెంచడం మేనిఫెస్టో హామీ అమలు పరచడం ఎలా అవుతుంది? మద్యంపై జగన్ రెడ్డి చెప్పేది అబద్దం కాదా?
నవరత్నాలలో ముఖ్యమైన రత్నంపై మోసం చేశారు. ఫీజ్ రీయంబర్స్ మెంట్ టిడిపి ప్రభుత్వం 16 లక్షల మందికి ఇవ్వగా దాన్ని 10 లక్షలకు మందికి కుదించి రెండవ రత్నంపై మోసం చేశారు. మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు (ఎం.టి.ఎఫ్), రీయంబర్స్ మెంట్ ట్యూషన్ ఫీజు (ఆర్.టి.ఎఫ్) ద్వారా టీడీపీ 82 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి ఏటా రూ.13వేలు ఇవ్వగా దాన్ని అమ్మ ఒడిపేరుతో 44.3 లక్షల మందికి కుదించి విద్యార్ధుల్ని మోసం చేశారు. అమ్మఒడితో రూ.15వేలు ఇస్తానని నమ్మించి రూ.13వేలు ఇస్తూ నాన్న బుడ్డీ ద్వారా రూ.70వేలు గుంజుకుంటున్నారు. ఈ రకంగా మూడో రత్నంపై మోసం చేశారు.
ఫించన్లు రూ.3వేలు ఇస్తానని నమ్మించి మూడేళ్లైన తర్వాత కూడా రూ.2,500లే ఇస్తున్నారు. ఈ పించన్ల మొత్తంలో ఎన్.టి.ఆర్. మరియు చంద్రన్న ఇచ్చింది రూ.1,875 కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డిలు కలిసి ఇచ్చింది కేవలం రూ.625 మాత్రమే. ఈ రకంగా రూ.3వేల ఫించన్ పై అవ్వ, తాతల్ని మోసం చేశారు. రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ ద్వారా టిడిపి ప్రభుత్వంలో ఒక్కొక్క రైతు లక్ష రూపాయిలకు పైగా లబ్ది పొందగా వీటిని రద్దు చేసి రైతు భరోసా పేరుతో ఐదేళ్లలో కలిగే లబ్దిని రూ.37,500లకు కుదించి రైతులను మోసం చేశారు. పైగా మోటర్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతు మెడకు ఉరి బిగిస్తున్నారు.
జలయజ్ఞం ధనయజ్ఞమైంది. పోలవరాన్ని తన మనషికి కట్టబెట్టేందుకు రివర్స్ టెండరింగ్ కు పాల్పడడం వల్ల నిర్మాణం ఆలస్యమై డయాఫ్రంవాల్ కొట్టుకుపోయింది. నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ సాగు, తాగు నీటి ప్రయోజనాలకు గండి కొట్టింది. అంతేకాక రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే నాటకం బెడిసికొట్టి కృష్ణా, గోదావరి జిల్లాలలో బచావత్ కమీషన్ ఏపీకి కల్పించిన హక్కుల్ని ధారాదత్తం చేసి రాష్ట్రాన్ని మోసం చేశారు. ఆసరా పేరుతో మహిళలకు టోకరా వేశారు. మొండి బకాయిలున్న 25 శాతం మహిళలకు ఇచ్చి, రుణాలు సక్రమంగా చెల్లించిన 75 శాతం మహిళలకు మోసం చేశారు. టిడిపి ప్రభుత్వం పసుపు కుంకుమ కింద డ్వాక్రా రుణమాఫీ ద్వారా అందరు మహిళలకు సమానంగా లబ్ది చేకూర్చింది. ఆసరాలో టోకరా చేయడమేకాక అభయ హస్తం నిధులు రూ.2,100 కోట్లు దారి మళ్లించారు. ఈ రకంగా ఎడవ రత్నం రాలిపోయింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించనందున ఆరోగ్య శ్రీ కేసులు తీసుకోవడం తగ్గిపోయింది. వైద్యం చేయించుకున్నవారు ముందు డబ్బులు చెల్లించాలని, తర్వాత రీయింబర్స్ చేస్తామని ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. సీఎంఆర్ఎఫ్ ను నాశనం చేశారు. దీని వల్ల పేషెంట్లు అప్పుల పాలయ్యారు. ఈ రకంగా 8వ రత్నం కూడా రాలిపోయింది. పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. టిడిపి ప్రభుత్వం 12 లక్షల ఇళ్లు నిర్మించగా, జగన్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్లల్లో నిర్మించింది కేవలం 64వేల ఇళ్లు మాత్రమే. అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గాని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. టిడిపి ప్రభుత్వం కేంద్ర నిధులకు అదనంగా రాష్ట్ర నిధుల నుండి రూ.1.50 లక్షలు ఇవ్వడమైంది. గృహ నిర్మాణ రుణాలతోనే రాష్ట్ర నిధుల నుండి రూ.1.50 లక్షలు ఇవ్వడమైంది. గృహా నిర్మాణ రుణాల రద్దుపై మాట తప్పి మడమ తిప్పారు. పైగా ఓటిఎస్ పేరుతో ఒక్కొక్కరి నుండి రూ.10వేల నుంచి రూ.20వేలు బలవంతంగా గుంజుకున్నారు. సెంటు పట్టా పేరుతో రూ.7వేల కోట్ల ప్రజాధనాన్ని జగన్ రెడ్డి ముఠా లూటీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 11వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ రకంగా 9వ రత్నం కూడా నకిలీ రత్నమైంది. నవరత్నాలు నవ మోసాలయ్యాయి.
నవరత్నాలకు మూడేళ్లల్లో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయగా, టిడిపి ప్రభుత్వం మొదటి మూడేళ్లల్లోనే సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, విదేశీ విద్య లాంటి 100కి పైగా టిడిపి సంక్షేమ పథకాల్ని రద్దు చేశారు. నవరత్నాలకు ఖర్చు చేసింది రూ.1.5 లక్షల కోట్లు కాగా, ఆ పేరుతో తెచ్చిన రూ.5 లక్షల కోట్ల అప్పు ఏమైంది? వైసీపీ ముఠా దోపిడీ కోసమే అప్పులు తప్ప సంక్షేమం కోసం కాదు. నవరత్నాలు నవ మోసాలయ్యాయి అనేదే పచ్చి నిజం. 95శాతం హామీలు అమలు చేశామనేది పచ్చి అబద్దం.