– దాడి జరిగిన వెంటనే బీజేపీ అధ్యక్షుడు నద్దా ఫోన్
– తమపై దాడి జరిగిన తీరు వివరించిన సత్య
– సత్య వివరణ విన్న నద్దా వైసీపీపై సీరియస్
– అమరావతిపై వెనక్కి తగ్గవద్దని సత్యకుమార్‌కు గ్రీన్‌సిగ్నల్
– వైసీపీ సర్కారుపై పోరాటం ప్రారంభించాలని ఆదేశం
– రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
– నిందితులను శిక్షించాలని రేంజ్ ఐజీకి బీజేపీ నేతల వినతిపత్రం
– హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్
– సత్యకుమార్‌పై పథకం ప్రకారమే దాడి అని జయప్రకాష్ ఆరోపణ
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణుల దాడిని బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిని ప్రతిష్ఠగా తీసుకున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించిన తీరు స్పష్టం చేస్తోంది. ఆ మేరకు జాతీయ అధ్యక్షుడు జెపి నద్దా దాడికి గురైన జాతీయ కార్యదర్శి సత్యకు ఫోన్ చేసి, దాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
ఆ సందర్భంలో సత్యకుమార్ ఇచ్చిన వివరణ విన్న నద్దా.. పాలక వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దానితో ఏ అమరావతి అంశంపై అయితే సత్యకుమార్‌పై దాడి జరిగిందో, అదే అమరావతి అంశంపై వెనక్కి తగ్గకుండా, ముందుకు వెళ్లాలని నద్దా ఆదేశించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీపై పోరాటాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో.. అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై, వైసీపీ కార్యకర్తల దాడి సంచలనం సృష్టించింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఆయన కారును ధ్వంసం చేయడంతో పాటు, ఒక బీజేపీ దళిత, మరో బీసీ నేతపై దాడికి పాల్పడిన వైనం బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లింది. దాడికి సంబంధించిన వీడియోలు కూడా ఢిల్లీ నేతలకు వెళ్లాయి. ఆలోగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేత-మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు తదితరులు సత్యకుమార్‌పై వైసీపీ కార్యకర్తల దాడిని ఖండించారు.
దానితో జాతీయ అధ్యక్షుడు నద్దా రంగంలోకి దిగారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఉన్న సత్యకుమార్‌కు ఆయన ఫోన్ చేసి, పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే తమపై దాడి జరిగిందని, తమను ముందుకు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు.. వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేస్తుంటే పోలీసులు, ప్రేక్షకపాత్ర పోషించారని నద్దాకు వివరించారు.
తమతోపాటు ఉన్న కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిన దాడిగా భావిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తమ రాక గురించి ముందే సమాచారం తెలుసుకున్న ఎంపీ అనుచరులే ఈ దురాగతానికి పాల్పడినట్లు సత్య తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి కి వివరించనట్లు తెలుస్తోంది.
అన్నీ విన్న నద్దా.. జరిగిన పరిణామాలను తాము సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టం చేశారు. మీ వెనుక పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ నేతలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరికీ భయపడకుండా, పార్టీ లైన్‌లో వెళ్లమని భరోసా ఇచ్చారు. అమరావతి రైతులకు మద్దతునిచ్చిన క్రమంలోనే ఇదంతా జరిగినందున… అదే అమరావతి అంశంపై, ఇక నుంచి సీరియస్‌గా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వంపై పోరాటాన్ని సీరియస్‌గా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది.
ఆ తర్వాత నద్దా.. ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఫోన్ చేసి, పార్టీ పక్షాన తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరారు. దాడిని తాము ఖండించామని వీర్రాజు వివరణ ఇచ్చారు. దానితో శనివారం రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు రూపొందించాలని నద్దా ఆదేశించారు. వెంటనే వీర్రాజు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటుచేసి, శనివారం రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
మరోవైపు జాతీయ కార్పొరేషన్ చైర్మన్ జయప్రకాష్ ఆధ్వర్యంలో.. బీజేపీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీని కలిసి, జరిగిన దాడిపై నిరసన వ్యక్తం చేశారు. సత్యకుమార్ వాహనాన్ని ధ్వంసం చేసి, దాడి చేసిన వారిని శిక్షించడంతోపాటు, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపిస్తూ వినతిపత్రం సమర్పించారు.