అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య ఆరోపణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని అరెస్టు చేసేందుకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకస్మికంగా ఆంక్షల పేరిట జివో నెంబర్ వన్ తెచ్చారని, నేడో, రేపో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపటమే ప్రభుత్వ లక్ష్యమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును జైలుకు పంపడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకు, రహదారుల మీదకు వచ్చి ఆందోళనలు, సభలు చేద్దామనుకునే పౌర సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు, దళిత సంఘాలకు వార్నింగ్ బెల్ కొట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుందని చెప్పారు. నూతన సంవత్సరం కానుకగా తీసుకువచ్చిన నల్ల జీవోకు కందుకూరు, గుంటూరు సంఘటనలు కేవలం సాకులు మాత్రమే అన్నారు.
రహదారి ప్రమాదాల్లో ఎపీ ఏడవ స్థానంలో ఉందని, కాబట్టి వాహనాలను నిషేదిస్తారా? గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో ముందంజలో ఉందని, కాబట్టి పోలీసులను నిషేదిస్తారా?అని సిఎంను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఓదార్పు యాత్ర, పాద యాత్రలలో కూడా మరణాలు జరిగాయని, మూడున్నరేళ్ళ పాలనలో 173 మంది ఆయా ప్రమాద సంఘటలలో మృతి చెందినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను ఎలా నిలువరించాలి? ఎలా అడ్డుకోవాలని? అన్న ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలకు రెండు సంఘటనలను సాకుగా వాడు కుంటున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పాలన చేయాలనుకునే వై నాట్ 175 మాస్టర్ ప్లాన్ కు ఇలాంటి నల్ల చట్టాలు నకళ్ళ అని తెలిపారు.విపక్ష నేతగా నాడు ముసలి కన్నీళ్లు కార్చిన సిఎం ప్రతిపక్షం లేకుండా పాలన చేద్దామను కుంటున్నారని, భేధ, దండోపాయాలను అస్త్రాలుగా యెంచుకున్నట్లు చెప్పారు. ప్రజా హక్కులపై ఉక్కు పాదం మోపి రాజ్యపాల చేయాలనుకునే ఇలాంటి జివోలు అంతిమంగా ఓడిపోక తప్పవని, యావత్ ప్రజలు నల్ల చట్టాలకు నిరసనగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానాలలో ఈ జీవో నిలబడకపోయినా, ప్రభుత్వం తనకున్న అధికారాలతో అప్రకటిత అమలుకు మొగ్గు చూపుతోందని ఆరోపించారు. ప్రతి పక్ష పార్టీలు మిత్ర పక్షాలుగా మారి, ఐక్య పోరాట కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలకోటయ్య సూచించారు.