Suryaa.co.in

Editorial

కమలంపై వైసీపీ కోవర్టు ఆపరేషన్?

– పొత్తు ఓకేనంటూనే సీట్లపై ఫిర్యాదులు
– ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని ఆరోపణలు
– టీడీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇస్తున్నారని ఫిర్యాదు
– పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న ఆ వర్గం
– ఓ మాజీ అధ్యక్షుడి అనుచరులతో వైసీపీ కోవర్టు ఆపరేషన్
– కూటమిని విచ్ఛిన్నం చేయడమే వారి లక్ష్యం
– ఎంపి రఘురామకృష్ణంరాజుపైనా ఈ వర్గమే ఫిర్యాదులు
– అగ్రనేతల తీరుపై బీజేపీ సీనియర్ల ఆగ్రహం
– అమిత్‌షా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ కన్నెర్ర
– నోటాతో పోటీ పడే నేతలను పట్టించుకోవద్దని స్పష్టీకరణ
– ఎన్నికలంటే పారిపోయేవారి ఫిర్యాదులపై స్పందించవద్దు
– సీటిచ్చినా టికెట్ అమ్ముకున్న నేత వర్గం ఫిర్యాదులు పట్టించుకోవద్దు
– వారు వైసీపీ కోవర్టులేనని సీనియర్ల స్పష్టీకరణ
– ‘కమలం’లో కోవర్టుల కలకలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

వాళ్లంతా బీజేపీలో పేరుకు పెద్ద హోదాల్లో ఉన్న అగ్రనేతలు. వారిలో ముప్పావుసగానికిపైగా అంతా పేపర్ పులులే. పేపర్లు, టీవీ, సోషల్‌మీడియాలో తప్ప జనంలో భూతద్దం వేసినా కనిపించరు. పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే, మాకొద్దని మరొకరికి అమ్ముకున్న మాటల రాయుళ్లు. పోటీ చేయమంటే పత్తా లేకుండా పారిపోయే నేతాశ్రీలు మరికొందరు. ఇంకొందరికి ఎన్నికలొస్తే కలెక్షన్ల పండగ. అందుకే వారికి కూటమి దండగ!

వెంకయ్యనాయుడు వల్ల ఏపీలో పార్టీ నాశనమయిందనేది ఈ బాపతు నేతల ప్రచారం. కానీ వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమయి చాలాకాలమయింది. మరి ఈ పేరుగొప్ప నేతాశ్రీలు, పార్టీని ఎందుకు వెలిగించ లేదు? గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను కూడా పెట్టలేని వైఫల్యం. సొంత జిల్లా-సొంత నియోజకవర్గం-సొంత మండలంలోనే పోటీ చేసే అభ్యర్ధికి దిక్కులేని విషాదం.

ఈ బాపతు నేతలకు పార్టీలో కొత్తగా ఎవరూ చేరకూడదు. తామే ఉండాలన్నదే సిద్ధాంతం! పోనీ అలాగని వీళ్లు పార్టీకి పది ఓట్లు తెస్తారా అంటే.. అలాంటి ముఖాలు దివిటీలు వేసినా కనిపించరు. ఒకవేళ ఇతర పార్టీల నుంచి చేరినా, వారిని తమంతట తామే వెళ్లేలా చేయడమే ఈ గ్యాంగ్ పని. కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నాను.. అలా తనంతనట తాను వెళ్లేలా చేసిన ఘనత కూడా ఈ ఘనాపాఠీలదే. వీరికి కొందరు ‘సంఘ’పెద్దల సపోర్టు. కారణం.. లోక కల్యాణం కోసం కల్యాణం చేసుకోకుండా ఉన్న బ్యాచిలర్స్ కష్ట‘సుఖాలు’ కనిపెట్టుకోవడమే!

అంత‘స్పా’ంటేనియస్‌గా వ్యవహరించే.. ఆలోచనలను ‘మర్దనా’చేయించే ఈ ‘ఆర్ట్‌ఆఫ్ లివింగు’ కళాకారుల బలహీనతలే, ఇప్పుడు వైసీపీ కోవర్టు ఆపరేషన్‌కు ప్రధాన పెట్టుబడి అన్నది ఒక టాక్. ఇప్పుడు బీజేపీలోని కొందరి బలహీనతలను సొమ్ము చేసుకుని, వారితో కూటమిపై కోవర్టు ఆపరేషన్ చేస్తున్న వైసీపీ బండారం బట్టబయలయింది. తాజాగా ఏపీ బీజేపీలో ఇదే హాట్‌టాపిక్.

టీడీపీ-జనసేన-బీజేపీతో ఏపీలో ఎన్డీఏ కూటమి ఖరారయింది. ఆ మేరకు జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పెద్దన్న పాత్ర పోషించారు. పొత్తు కట్టించింది తానే కాబట్టి, జాతీయ పార్టీ అయిన బీజేపీ గౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా చూశారు. ఆ మేరకు తనకు టీడీపీ కేటాయించిన సీట్లలో మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటును బీజేపీకి త్యాగం చేశారు.

అటు టీడీపీ కూడా బీజేపీపై గౌరవంతో, తన కోటా నుంచి ఒక అసెంబ్లీ సీటు ఇచ్చేసింది. తుది జాబితా విడుదల లోపు.. టీడీపీ-జనసేన అవసరాన్ని బట్టి బీజేపీకి ఇంకా ఎన్ని అసెంబ్లీ-లోక్‌సభ సీట్లను తమ కోటా నుంచి త్యాగం చేస్తారో తెలియదు. భేషజాలకు పోకుండా జగన్ సర్కారును గద్దె దింపే లక్ష్యంతో టీడీపీ-జనసేన ఎలాంటి త్యాగానికయినా సిద్ధంగా ఉన్నాయి. ఆ రకంగా నమ్మకంతో ప్రారంభమయిన కూటమి అడుగులకు, సహజంగానే అధికార వైసీపీలో అలజడి మొదలయింది.

ఇదంతా పురందేశ్వరి-చంద్రబాబు-పవన్‌కల్యాణ్ రాష్ట్రస్థాయిలో.. విజయవాడలో కూర్చుని చేసుకున్న ఒడంబడిక కాదు. ప్రధాని మోదీ ఆమోదం-కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాలు-బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా అంగీకారంతో ఏర్పడిన కూటమి. చంద్రబాబు-అమిత్‌షా- నద్దా భేటీల తర్వాత కొలిక్కివచ్చి ఆవిర్భవించిన కూటమి. మోదీ-అమిత్‌షా ఆమోదం లేకపోతే, కూటమి కుదరదన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమయి తీరాలి. ఇంకా అర్ధం కాకపోతే వారు శుంఠలనే అర్ధమన్నది బీజేపీ పెద్దతలల ఉవాచ.

అయితే ఇప్పుడు ఏపీలో కొందరు సీనియర్లు.. వైసీపీ కోవర్టుల అవతారమెత్తి, కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు, బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తు ఇష్టం లేని ఈ వర్గం ద్వారా.. వైసీపీ వ్యూహబృందం తన లక్ష్యసాధనలో పావులుకదుపుతోందన్నది బీజేపీలో ఇప్పుడు హాట్‌టాపిక్. దీనికి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఘోరపరాజయాన్ని అందించిన, ఓ అగ్రనేత వారథి-సారథిగా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.

టీడీపీతో పొత్తు ఇష్టం లేని బీజేపీలోని ఒక వర్గం ద్వారా, వైసీపీ కోవర్టు ఆపరేషన్ ప్రారంభించిందన్న చర్చ, కమలంలో కలకలం రేపుతోంది. అందులో భాగంగా పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన సీట్లన్నీ.. ఓడిపోయేవి ఇచ్చారంటూ ఇటీవల కొందరు పార్టీ నాయకత్వానికి రాసిన లేఖ వెనుక, వైసీపీ వ్యూహబృందం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు టీడీపీ కంకణం కట్టుకుందని, టీడీపీ నుంచి వచ్చిన వారికే సీట్లు ఇస్తోందన్నది వారి ఆరోపణ. ఆ మేరకు కొందరు రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ లేఖ వెనుక వైసీపీ వ్యూహం బృందం ఉందని, గతంలో పార్టీని వైఫల్యబాటలో నడిపించిన నేత వర్గమే ఆ ఫిర్యాదు చేసిందని సీనియర్లు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన వారు, సొంతగా పోటీ చేస్తే వెయ్యి ఓట్లు కూడా రాని నే తలేనని స్పష్టం చేస్తున్నారు.

‘ ఆ ఫిర్యాదు చేసిన వారికి స్థానికంగా ఎలాంటి గుర్తింపు లేదు. వారంతా గతంలో పార్టీని సర్వనాశనం చేసిన ఒక నాయకుడి అనుచరులే. అందులో టికెట్లు ఇస్తామంటే మాకొద్దని పారిపోయిన వాళ్లు కొందరయితే, ఇచ్చిన టికెట్‌ను ఇంకొక డాక్టర్‌కు అమ్ముకున్న వాళ్లు ఇంకొందరు. వైసీపీ సర్కారుతో కుమ్మక్కయి ప్రకాశం జిల్లాలో క్వారీలు, ధవళేశ్వరంలో ఇసుక రీచ్‌లకు పనికి ఆహార పథకం కింద నెల మామూళ్లు తీసుకున్న వాళ్లే. వీళ్లకు సొంత ఇంట్లోనే ఓట్లు పడవు. కానీ జాతీయ పార్టీ దృష్టిలో మాత్రం వీళ్లు పెద్దనేతలు. దానికి కారణం ఇద్దరు సంఘటనా మంత్రులు. అందులో ఒకాయన మాజీ. వాళ్ల కష్ట ‘సుఖాలు’ వీళ్లే చూస్తారు. ఇప్పుడు టీడీపీపై ఫిర్యాదు చేసిన వారిలో ఒక్కరికీ పక్క ఇంటి వాళ్లు కూడా ఓటేయరు. వీళ్లంతా టీవీ చానెళ్లు, సోషల్‌మీడియాలో తప్ప జనంలో ఉండని వాళ్ల గురించి పార్టీ స్పందించాల్సిన పనిలేదు. మేం కూడా నాయకత్వానికి ఆమేరకు లేఖ రాస్తాం. రాష్ట్రంలో పొత్తును విచ్ఛిన్నం చేస్తున్న నేతలపై మేమూ ఫిర్యాదు చేస్తామ’ని ఒక సీనియర్ నేత స్పష్టం చేశారు.

కాగా వైసీపీ అధినేత-సీఎం జగన్‌పై తిరుగుబాటుబావుటా ఎగురవేసి, ఏపీ సర్కారు అరాచకాలపై కేంద్రానికి శరపరంపరగా ఫిర్యాదుచేస్తున్న నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజుకు.. బీజేపీ టికెట్ ఇవ్వవద్దని కోరుతూ, ఇదే వైసీపీ కోవర్టు కంపెనీ ఇటీవల పార్టీ అగ్రనేతలను కలసి కోరిన విషయం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఆయనకు టికెట్ ఇవ్వవద్దని అనంతపురం, తిరుపతి, గోదావరి జిల్లాలకు చెందిన కొందరు నేతలు ఇటీవల పార్టీ పెద్దలను కోరిన వైనం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇదే సమయంలో.. భవిష్యత్తులో తమ కేంద్రమంత్రి పదవికి అడ్డు వచ్చే వారిని ఇప్పటినుంచే అడ్డుతప్పించే మాయోపాయానికి బీజేపీలోని ఒక పెద్ద తలకాయ తెరలేపారని.. అందుకే ఒక్కొక్కరిపై ఫోకస్ పెడుతున్నారన్నది బీజేపీలో జరుగుతున్న చర్చ.

LEAVE A RESPONSE