Suryaa.co.in

Editorial

కమలంలో వైసీపీ కోవర్టులు?

– వైసీపీని కాపాడే యత్నం
– వైసీపీతో ఆర్ధిక-వ్యాపారబంధం?
– గతంలో ఒక కీలకనేతకు క్వారీ, ఇసుక అమ్మకాల్లో వాటా?
– మరో నేతకు సెక్యూరిటీ
– వైసీపీతో టచ్‌లో కొందరు బీజేపీ అగ్రనేతలు?
– వైకాపా చెవులకు కోర్ కమిటీ చర్చల వివరాలు?
– పొత్తు వద్దన్నదే వీరి లక్ష్యం
– బీజేపీని వ్యతిరేకించే టీవీ చానెళ్లతో మ్యాచ్‌ఫిక్సింగ్
– మీడియా అడిగినట్లూ.. నేతలు చెప్పినట్లూ కలరింగ్
– వారిపై చర్యలు తీసుకోండి
– ఎన్నికల్లో వారికి బాధ్యతలు అప్పగించవద్దు
– పార్టీ నాయకత్వానికి రాష్ట్ర బీజేపీ నేతల లేఖ?
– కమలంలో లేఖల కలకలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీలో వైసీపీ కోవర్టులు ఉన్నారా? పార్టీలో జరిగే చర్చలు, నిర్ణయాలను వారే అధికార పార్టీకి చేరవేస్తున్నారా? చివరకు కోర్ కమిటీ చర్చల వివరాలు కూడా వైసీపీ గోడలు వింటున్నాయా? అందుకు తగిన ప్రతిఫలం అందుతోందా? పొత్తు చెడగొట్టడమే వారి అసలు లక్ష్యమా? వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు.. రానున్న ఎన్నికల్లో వారికి ఈ రాష్ట్రంలో, ఎక్కడా బాధ్యతలు ఇవ్వవద్దన్న లేఖ జాతీయ నేతలకు వెళ్లిందా?.. ఇప్పుడు ఇదే బీజేపీలో హాట్ టాపిక్.

ఏపీ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నాయకత్వాన్ని సవాల్ చేస్తున్న శక్తులపై చర్యలు కరవయ్యాయి. అందుకే మీడియాలో తప్ప జనంలో బలం లేని ఆ శక్తులు, క్రమశిక్షణ కట్టుత ప్పుతున్నాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో స్థిరపడింది. బీజేపీని దెబ్బతీసే అజెండాతో ఉన్న ఒక చానెల్, ఈ అసమ్మతినేతలకు దన్నుగా నిలిచింది. ఇప్పటికే సదరు చానెల్‌లో ఎలాంటి ప్రశ్నలు వేయాలో చెప్పే వైసీపీ సోషల్‌మీడియా టీమ్ గురించి సామాజిక మాధ్యమాల్లో రచ్చ అవుతోంది. అంటే సదరు చానెళ్లలో పొత్తుపై ప్రశ్నలు అడగటం- సదరు బీజేపీ నేతలు దానికి సమాధానం చెప్పడం వంటి మ్యాచ్‌ఫిక్సింగ్ ప్రశ్నలన్న మాట.

పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని స్వయంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హెచ్చరించినా, ఆమె ఆదేశాలు అమలుచేసే పరిస్థితి లేని ధిక్కారం నెలకొంది. దీనికి సంబంధించి కొందరు రాష్ట్ర నేతలు.. జాతీయ పార్టీ నాయకత్వానికి, ఇటీవల లేఖలు రాసినట్లు తెలిసింది. ఇప్పుడు దీనిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్టీలో వైసీపీ కోవర్టులున్నారంటూ.. కొందరు సీనియర్లు రాసిన లేఖ, ఏపీ బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. కులం కోణంలో వైసీపీకి మేలు కలిగించేలా వ్యవహరిస్తున్న కోవర్టులను పక్కనపెట్టకపోతే, పార్టీకి నష్టమని వారు తమ లేఖలో సూచించినట్లు సమాచారం. వీరికి తెలంగాణలో బాధ్యతలు అప్పగించాలని సూచించినట్లు తెలుస్తోంది.

కులం కోణంలోనే సదరు నేతకు ఒక కీలకనేత మద్దతునిస్తున్నారని, ఆ కీలకనేత సిఫార్సుతోనే సదరు ‘మీడియా నాయకుడు’, కోర్ కమిటీలోకి ప్రవేశించారని తమ లేఖలో పేర్కొన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పొత్తులను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న సదరు నేతల వ్యాఖ్యలు- వీడియోలను, వారు నాయకత్వానికి పంపినట్లు తెలుస్తోంది.

కాగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు… కోర్ కమిటీ నిర్ణయాలు-చర్చల వివరాలను కూడా, ఆ పార్టీకి చేరవేస్తున్నారని ఫిర్యాదు చేసిన ట్లు సమాచారం. ఇటీవలి కాలం వరకూ ఒక వెలుగు వెలిగిన రాష్ట్రనేతకు.. ప్రకాశం జిల్లాలో క్వారీ కటింగ్, ధవళేశ్వరంలో ఇసుక అమ్మకాల్లో వాటా కూడా వైసీపీ నేతలు ఇప్పించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ నిధులతో సదరు నేత, ప్రస్తుతం ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తున్న మరో కీలకనేత కలసి బెంగ ళూరు నగరంలో.. ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారన్న ప్రచారాన్ని తమ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. టీడీపీ-బీజేపీ పొత్తులో గతంలో వచ్చిన నామినేటెడ్ పదవులకు, రాజీనామా చేయించకుండా ఉన్నందుకు ప్రతిఫలంగా.. విజయవాడలోని తన నివాసానికి, వారితో అద్దెలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారట.

ఇక మరో నేతకు సెక్యూరిటీ విషయంలో సహకరించారని వివరించారు. గతంలో టీడీపీకి చెందిన ఒక మాజీమంత్రి, మరో టీడీపీ కీలకనేతతో కలసి వ్యాపారాలు-స్నేహం చేశారని తమ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో స్పీకర్ కోడెల వ్యతిరేకించినప్పటికీ, టీడీపీలోని ఆ కీలకనేత సిఫార్సు తోనే బీజేపీ నేతకు గన్‌మెన్లు కేటాయించారని, తమ లేఖలో వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా ఒక ఆశ్రమంలో గతంలో జరిగిన నగదు లావాదేవీల అంశాన్ని కూడా, సదరు నేతలు తమ లేఖలో వివరించినట్లు సమాచారం. ఈ లేఖలోని అంశాలు లీక్ కావడం ఇప్పుడు పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.

ప్రధానంగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఒక మహిళ కనిపించకుండా పోయిన వైనాన్ని, సదరు లేఖలో ప్రస్తావించడమే ఆశ్చర్యం. తన భార్య కనిపించడం లేదని.. దానికి ఏపీ బీజేపీకి చెందిన ఒక ప్రముఖుడే కారణమంటూ, ఆమె భర్త ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు చేసిన ఫిర్యాదును ఇప్పుడు తమ లేఖలో ప్రస్తావించడమే ఆసక్తికరం.

ఆమె భర్త కూడా బీజేపీ కార్యకర్తేనని, అయినా సొంత పార్టీ వారికే అన్యాయం చేశారని నేతలు తమ ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. నిజానికి ఇవన్నీ పాతవే. కానీ మళ్లీ ఇప్పుడు కొత్తగా ఫిర్యాదుల రూపంలో తెరపైకి రావడమే ఆశ్చర్యం.

LEAVE A RESPONSE